logo

రక్షణ కరవై.. భక్షణకు సిద్ధమై..

జిల్లాలో సర్కారు భూములకు రక్షణ కరవైంది. అసైన్డ్‌, బీడీపీపీ భూముల్లో యథేచ్ఛగా వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. ఈ  వ్యవహారమంతా ఓ వ్యక్తి కనుసన్నల్లోనే జరుగుతోంది. దీనికి కొందరు అధికారులు, నేతల సహకరిస్తున్నారు. నెలనెలా ఠంఛనుగా ఎవరి వాటాలు వారికి

Published : 25 Jun 2022 04:24 IST

ఇదీ జిల్లాలో సర్కారు స్థలాల దుస్థితి..

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌

ఇనాం భూముల్లో వేసిన వెంచర్‌

జిల్లాలో సర్కారు భూములకు రక్షణ కరవైంది. అసైన్డ్‌, బీడీపీపీ భూముల్లో యథేచ్ఛగా వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. ఈ  వ్యవహారమంతా ఓ వ్యక్తి కనుసన్నల్లోనే జరుగుతోంది. దీనికి కొందరు అధికారులు, నేతల సహకరిస్తున్నారు. నెలనెలా ఠంఛనుగా ఎవరి వాటాలు వారికి అందుతుండటంతో భూ ఆక్రమణలు ఆకాశమే హద్దుగా కొనసాగుతున్నాయి. దీంతో జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న వేలాది ఎకరాల బీడీపీపీ, అసైన్డ్‌, అబాదీ, ఇనాం, ఏజెన్సీ భూములు ప్లాట్లుగా రూపాంతరం చెందుతున్నాయి. అక్రమార్కులకు ఆదాయమార్గమవుతున్నాయి.

జిల్లా ఆవిర్భావం అనంతరం రెండువేల ఎకరాల ప్రభుత్వ భూములు జిల్లా కేంద్రంనుంచి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని అధికారులు ప్రత్యేక సర్వే చేసి 2016లోనే గుర్తించారు. వాటికి హద్దులు, రక్షణ చర్యలు అంతంతమాత్రంగానే ఉండటంతో అక్రమార్కుల కన్ను పడింది. పర్యవేక్షణ లేకపోవడంతో ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్న భూములను కజ్జా చేసి క్రయవిక్రయాలు జరుపుతున్నారు. మొదట బాండ్‌ పేపర్లపై ఒప్పంద పత్రాలు రాసుకుంటూ.. ఆపై అధికారుల అండదండలతో అదను చూసి ఇంటి నెంబర్లు తీసుకుంటున్నారు. అనంతరం రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి.

కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం పక్కనే..

పాలనాధికారి క్యాంపు కార్యాలయాన్ని ఆనుకునే ప్రస్తుతం ఇనాం భూముల దందా కొనసాగుతోంది. 15 ఎకరాల భూమిలో కొందరు నేతలు, అధికారులు భాగస్వాములుగా ఉన్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. సర్వే నంబర్‌ 21 నుంచి 26 వరకు ఇనాం భూములు ఉన్నాయి. ప్రస్తుతం 15 ఎకరాల ఇనాం భూమిని చదును చేసి ప్లాట్లు చేశారు. ఇందులో రూ.10 నుంచి రూ.20 లక్షల వరకు ఒక్కో ప్లాటును విక్రయిస్తున్నారు. ఈ లెక్కన సుమారు రూ.5 కోట్ల దందా ఇక్కడ నడుస్తోంది. వాంకిడి మండలంలో 98 సర్వే నంబర్లలోని ఇనాం భూములను సైతం తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు.

ఇదీ ఇనాం భూముల చరిత్ర...

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను కలుపుకొని ఒకప్పుడు ఆసిఫాబాద్‌ జిల్లాగా ఉండేది. ప్రభుత్వానికి అందించిన సేవలకు మెచ్చి అప్పటి అధికారులకు కొందరు వ్యక్తులకు ఇనాం (బహుమతి)గా భూములను ఇచ్చారు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1955లో ఈ ఇనాం భూములను రద్దు చేసింది. వీటికి సాగు చేసుకోవడానికే వాడాలని, ప్లాట్లు చేయడం, విక్రయించడం చేయరాదని స్పష్టం చేసింది. తెలంగాణలో ఓఆర్‌సీ(అక్యూపెన్సీ రైట్స్‌ సర్టిఫికేట్స్‌) ఉంటేనే ఈ భూములను ఇతరులకు విక్రయించవచ్చని స్పష్టమైన నిబంధనలున్నాయి.

ఓఆర్‌సీ రావాలంటే...

ఇనాం భూములకు ఓఆర్‌సీ ధ్రువపత్రం రావాలంటే 1955 ఖాస్ర పహాణీతో పాటు 1973-74 సంవత్సరాలకు సంబంధించి పహాణీలను జతచేసి తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. సంబంధిత రైతు పది సంవత్సరాలు భూమి శిస్తు చెల్లించినట్లుగా అధారాలు చూపాలి. అనంతరం సదరు వ్యక్తికి నిజాం కాలంలోనే ఇనాం భూములు ఇచ్చాయనే విషయాన్ని ఆర్డీఓ నిర్ధారించి, ఓఆర్‌సీ జారీ చేస్తారు.

కొలిక్కివచ్చిన ప్రయత్నాలు..

రెవెన్యూ అధికారుల సహకారంతో కొందరు ఓఆర్‌సీ పొందడానికి చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో నాలుగు వరుసల రహదారిని ఆనుకుని ఉన్న బీడీపీపీ భూముల్లో (బిలా దాఖల పొరంబోకు) ప్రస్తుతం భారీ భవనాల నిర్మాణాలు సాతుగున్నాయి. వీటికి సైతం నౌ లావుణి పట్టాలు ఉన్నాయని మండల స్థాయి అధికారులు చెబుతుండగా, జిల్లాస్థాయి అధికారులు సైతం విస్మయం చెందుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా నౌ లావుణి పట్టాలు చూడలేదని, దీనిగురించి వినలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పారు.


మొరమూ అక్రమమే...

వెంచర్లలో రహదారులు నిర్మించడానికి బుదల్‌ఘాట్‌ వాగు ఒడ్డుకు ఉన్న భూముల నుంచి ప్రొక్లెయిన్‌ సహకారంతో రోజంతా ఎలాంటి అనుమతులు లేకుండానే ట్రాక్టర్లలో మట్టిని తీసుకువస్తున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని