logo

రైతుబంధుకు రూ. 217కోట్లు

వానాకాలం రైతుబంధు పంపిణీ ప్రక్రియ ఈ నెల 28 నుంచి ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో  వ్యవసాయ అధికారులు అవసరమైన కార్యాచరణ రూపొందించడంలో నిమగ్నమయ్యారు. ఇదివరకే లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం చేశారు. రూ.217 కోట్లు జమకానున్నాయి. ‘ధ

Published : 25 Jun 2022 04:24 IST

28 నుంచి జమ ప్రక్రియ ప్రారంభం

నిర్మల్‌, న్యూస్‌టుడే

విత్తనాలు విత్తుతున్న రైతులు

వానాకాలం రైతుబంధు పంపిణీ ప్రక్రియ ఈ నెల 28 నుంచి ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో  వ్యవసాయ అధికారులు అవసరమైన కార్యాచరణ రూపొందించడంలో నిమగ్నమయ్యారు. ఇదివరకే లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం చేశారు. రూ.217 కోట్లు జమకానున్నాయి. ‘ధరణి’ పోర్టల్‌ ఆధారంగా రైతుబంధు కింద పెట్టుబడి సాయం పొందే అన్నదాతల సంఖ్య లెక్క తేల్చారు. జిల్లా వ్యాప్తంగా 1,73,471 మంది భూమి పట్టాదారులు ఉండగా.. ఇందులో 1.67 లక్షల మంది రైతులకు సంంధించి పట్టాదారు పాసు పుస్తకాలు, బ్యాంకు ఖాతాలు, ఆధార్‌ నంబర్లు అన్నీ పక్కాగా ఉన్నాయి. మిగతా పట్టాదారుల్లో కొంతమంది వివరాలు ధరణి పోర్టల్‌లో నమోదు కాకపోవడం, మరికొంత మందికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు ఉండటం, ఆధార్‌ అనుసంధానం కాకపోవడం, ఇంకొంత మంది వ్యవసాయ అధికారులకు సరైన వివరాలు ఇవ్వకపోవడంతో నమోదు కాలేవు.

పెట్టుబడి సాయం జమ ఇలా..

రైతుబంధు కింద పెట్టుబడి సాయం నగదు బదిలీ తక్కువ నుంచి ఎక్కువకు చేపట్టనున్నారు. తొలిరోజు ఒక ఎకరం లోపు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. రెండో రోజు రెండెకరాలలోపు ఉన్న అన్నదాతలకు, మూడో రోజు మూడెకరాలోపు కర్షకులకు.. నాల్గవ రోజు నాలుగెకరాలోపు వారికి.. ఇలా పదోరోజున పదెకరాలలోపు ఉన్న రైతులకు నగదు బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు వెల్లడించారు. పది ఎకరాలకు మించి ఉన్న రైతులకు 11వ రోజు నుంచి డబ్బులు జమచేసి ఈ సీజన్‌ ప్రక్రియను ముగించనున్నారు.  

కొత్తవారికి ఆప్షన్‌ రాలే..

యాసంగి సీజన్‌ తర్వాత భూముల క్రయవిక్రయాలు, యాజమాన్య హక్కుల బదిలీల్లో జరిగిన మార్పులు, చేర్పులు, వారసత్వ పట్టాల మార్పిడి, తదితర వాటికి సంబంధించి రైతుబంధు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఇంకా అవకాశం ఇవ్వలేదు. ఇలా జిల్లాలో దాదాపు 4 వేల మంది రైతులు ఉంటారని రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల 28లోగా కొత్తవారికి దరఖాస్తు చేసుకునేలా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు.


అర్హులందరికీ సాయం

- అంజిప్రసాద్‌, జిల్లా వ్యవసాయ అధికారి

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతుబంధు సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే రైతుబంధు కింద పెట్టుబడి సాయం పొందుతున్న వారికి వివరాలతో ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 28 నుంచి రైతుబంధు కింద నగదు అన్నదాతల ఖాతాల్లో జమ అవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని