logo

సింగరేణిలో మూడు స్తంభాలాట..!

సింగరేణిలో దశాబ్ద కాలంగా గుర్తింపు సంఘంగా పనిచేస్తున్న తెబొగకాసంలో మొదటి నుంచీ వర్గపోరు కనిపిస్తోంది. ఒక దశలో ఆధిపత్యం కోసం కోర్టును ఆశ్రయించి, నాయకత్వ ఎంపిక కోసం రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో సింగరేణి కార్మికవర్గం ఓట్లు వేసే వరకు వెళ్లిన సంగతి సింగరేణీయులందరికీ తెలిసిందే. తెబొగకాసంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ తెరాస అధినేత కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో కార్మికవర్గం తెబొగకాసం పట్ల మొగ్గు చూపుతూ వస్తోంది. గతంలో ఇద్దరి మధ్య ఉన్న వర్గపోరు ఇప్పుడు ముగ్గురికి

Published : 25 Jun 2022 04:24 IST

గుర్తింపు సంఘంలో ఎవరికి వారే..

న్యూస్‌టుడే, మంచిర్యాల

సింగరేణిలో దశాబ్ద కాలంగా గుర్తింపు సంఘంగా పనిచేస్తున్న తెబొగకాసంలో మొదటి నుంచీ వర్గపోరు కనిపిస్తోంది. ఒక దశలో ఆధిపత్యం కోసం కోర్టును ఆశ్రయించి, నాయకత్వ ఎంపిక కోసం రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో సింగరేణి కార్మికవర్గం ఓట్లు వేసే వరకు వెళ్లిన సంగతి సింగరేణీయులందరికీ తెలిసిందే. తెబొగకాసంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ తెరాస అధినేత కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో కార్మికవర్గం తెబొగకాసం పట్ల మొగ్గు చూపుతూ వస్తోంది. గతంలో ఇద్దరి మధ్య ఉన్న వర్గపోరు ఇప్పుడు ముగ్గురికి విస్తరించడంతో.. రానున్న గుర్తింపు ఎన్నికల్లో దీని ప్రభావం ఎంత మేరకు ఉంటుందనే అంతుచిక్కడం లేదు.

మూడు వర్గాలుగా వ్యవహరిస్తున్న నేతలు

తెరాస అనుబంధ తెబొగకాసంలో ముగ్గురు అగ్రనేతలు మూడు వర్గాలుగా చీలినట్లు కార్మిక వర్గానికి, కిందిస్థాయి కార్యకర్తలకు స్పష్టంగా తెలుస్తోంది. 2012 జూన్‌ 28న జరిగిన ఐదో దఫా గుర్తింపు ఎన్నికల్లో తెబొగకాసం గుర్తింపు సంఘంగా ఎన్నికైంది. మిర్యాల రాజిరెడ్డి యూనియన్‌ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ 2013 మే 19న గోదావరిఖనిలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్యల కోసం మల్లయ్య వర్గం తీర్మానంచేసి అగ్రనాయకత్వానికి పంపింది. అదే నెల 26న శ్రీరాంపూర్‌లో మిర్యాల రాజిరెడ్డి వర్గం సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించి మల్లయ్యను తొలగించి ఆయన స్థానంలో కనకరాజును ఎన్నుకున్నట్లు తీర్మానం చేశారు.

* రెండువర్గాల్లో ఎవరితో చర్చించాలో తెలియక యాజమాన్యం సతమతమైంది. చివరికి హైకోర్టు జోక్యంతో ప్రాంతీయ లేబర్‌ కమిషనర్‌ (సెంట్రల్‌) ఆధ్వర్యంలో రహస్య బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. సింగరేణి చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదు. 2014 ఫిబ్రవరి 23న సింగరేణిలో పనిచేసే 40,576 మంది కార్మికులు ఓటర్లుగా.. రెండు వర్గాల్లో ఎవరికి కార్మికవర్గం మద్దతు ఉందని తేల్చడానికి రహస్య ఓటింగ్‌ విధానాన్ని అనురించారు. ఓటింగ్‌లో మిర్యాల రాజిరెడ్డి వర్గం పైచేసి సాధించడంతో కెంగెర్ల మల్లయ్య ప్రాభవం తగ్గింది. ఆయన స్థానంలో అధ్యక్షునిగా ఆకునూరి కనకరాజు, గౌరవాధ్యక్షురాలిగా అప్పటి ఎంపీ, ప్రస్తుత నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కవితను, కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఏనుగు రవీందర్‌రెడ్డిని ఎంపిక చేసుకున్నారు.

*  కొంతకాలం తర్వాత కనకరాజును పక్కన పెట్టి, ఐఎన్టీయూసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న బి.వెంకట్రావును అధ్యక్షునిగా ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత కొంత కాలానికి కెంగెర్ల మల్లయ్యను కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఎంపిక చేశారు. మల్లయ్యకు సరైన ప్రాధాన్యం  దక్కడంలేదని కినుక వహించి, బీఎంఎస్‌లోకి వెళ్లి ఆ సంఘానికి అధ్యక్షునిగా ఎంపికయ్యారు. సంఘంలో వర్గపోరును తగ్గించడంతోపాటు, బీఎంఎస్‌ను బలహీనపర్చడంలో భాగంగా చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మల్లయ్యతో మంతనాలు జరిపి, తిరిగి తెబొగకాసంలో చేరేలా మంత్రాంగం నడిపించారు. సంఘంలో చేరిన కొంత కాలం మల్లయ్యకు ఎలాంటి పదవి కట్టబెట్టలేదు. ఇటీవల తిరిగి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఆయనకు పదవి ఇచ్చారు. అయినప్పటికీ ఈ ముగ్గురు నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.

బెల్లంపల్లి రీజియన్‌లో..

అగ్రనాయకుల అనుచరవర్గం ఏరియా స్థాయుల్లో రెండు నుంచి మూడు వర్గాలుగా చీలిపోయింది. కొన్ని ఏరియాల్లో  అగ్రనాయత్వానికి భయపడి పైకి కలిసి ఉన్నట్లు నటించినా, చేతల్లో మాత్రం వర్గపోరు స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీరాంపూర్‌ ఏరియాలో అన్నయ్య, మంద మల్లారెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి కేంద్ర కమిటీ నాయకుల పేరిట వెంకట్రావు వర్గంగా వ్యవహరిస్తుండగా, ఏరియా ఉపాధ్యక్షుడు కె.సురేందర్‌రెడ్డి మిర్యాల వర్గంగా ముద్రపడ్డారు. ఈ పోరుపడలేక కార్పొరేట్‌ చర్చల కమిటీ సభ్యునిగా ఉన్న కె.వీరభద్రయ్య తెబొగకాసంను వీడి, తన మాతృ సంఘమైన ఏఐటీయూలో చేరారు. గనుల స్థాయిలోనూ ఈ రెండు వర్గాల మధ్య కొంతకాలం బాహాబాహీ నడిచింది. తాజాగా కెంగెర్ల వర్గం తెరపైకి వచ్చింది. మందమర్రి ఏరియాలో ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తీవ్రంగా మందలించడంతో వర్గపోరు కనిపించనప్పటికీ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్‌ మిర్యాలవైపు, మిట్ట సూర్యనారాయణ వెంకట్రావు వర్గంగా గుర్తింపు పొందారు. బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ నాయకుడు మంగీలాల్‌ మధ్య వర్గపోరు తీవ్రంగా ఉండగా, తాజాగా మల్లయ్య అనుచరుడైన సదాశివ్‌ మరో వర్గంగా ఏర్పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు