logo

శ్రమలో.. ఉదయించిన కిరణం

జీవితానికి ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకొని.. ఆచరణలో అమలుచేసి.. పోలీసు ఉద్యోగం సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు హాజీపూర్‌ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ఉదయ్‌కిరణ్‌. కాసిపేట మండలం సోమగూడెంలో ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా

Published : 25 Jun 2022 04:24 IST

జోన్‌స్థాయిలో 11వ ర్యాంకుతో ఎస్‌ఐగా విజయం సాధించిన వైనం

హాజీపూర్‌, న్యూస్‌టుడే: జీవితానికి ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకొని.. ఆచరణలో అమలుచేసి.. పోలీసు ఉద్యోగం సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు హాజీపూర్‌ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ఉదయ్‌కిరణ్‌. కాసిపేట మండలం సోమగూడెంలో ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా జీవనం గడుపుతున్న తాల్క హర్షవర్ధన్‌- భాగ్యరేఖ దంపతుల ఏకైక కుమారుడు ఉదయ్‌కిరణ్‌. ఆయన బాసర ఐఐఐటీలో 2014లో బీటెక్‌ పూర్తిచేశారు. డిగ్రీ పూర్తికాగానే ఉస్మానియా యూనివర్శిటీలో ఎంటెక్‌ చేయాలని నిర్ణయించుకొని.. ఆ దిశగా సీటు సాధించి 2016లో కళాశాలలో చేరారు. ఆ క్రమంలోనే పోలీసు ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ వేయడంతో ఆయన దృష్టి ఉద్యోగంపై పడింది. ఎంటెక్‌ చదువును మధ్యలోనే ఆపేసి తాను నమ్ముకున్న సిద్ధాంతం ఆధారంగా కష్టపడి పోటీ పరీక్షల కోసం చదివారు. ఏకకాలంలో ఫైర్‌ కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని తపనతో సాగారు. 2017లో తొలుతగా ఫైర్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఫలితాలు ప్రకటించగా ఆ ఉద్యోగానికి ఎంపికై జిల్లాలోని జన్నారంలో ఉద్యోగ విధుల్లో చేరి ఆరునెలల పాటు విధులు నిర్వహించారు. ఇదే క్రమంలో ప్రభుత్వం అదే ఏడాది ఎస్‌ఐ ఉద్యోగాల ఫలితాలు ప్రకటించడంతో తొలి ప్రయత్నంలోనే ఆనాటి ఐదో జోన్‌ (ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం) జిల్లాల పరిధిలో 11వ ర్యాంకు సాధించి 2017 బ్యాచ్‌లో ఎస్‌ఐగా ఎంపికయ్యారు. కేవలం 23 ఏళ్ల వయస్సులోనే రెండు ప్రభుత్వ ఉద్యోగాలు ఒకేసారి రావడం ఆయనలో ఎంతో సంతోషాన్ని నింపింది. శిక్షణ అనంతరం ప్రొబెషనరీ ఎస్‌ఐగా ఖమ్మం జిల్లా మధిరలో చేరారు. ఆ తరువాత ఎర్రుపాలెం, ఖమ్మం మూడో పట్టణ ఎస్‌ఐగా అనేక సవాళ్లను ఎదిరించి విధులు నిర్వహించారు. ప్రస్తుతం హాజీపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐగా బదిలీ అయి ప్రజలతో సఖ్యతగా ఉంటూ విధి నిర్వహణలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు.

ఏకాగ్రతతో ఏదైనా సాధించే అవకాశం

‘యువత శారీరకంగా ఉత్తీర్ణత సాధిస్తామనే నమ్మకం ఉంటే రాతపరీక్ష కోసం తీవ్రమైన కసరత్తు చేయాలి. ఎంతో మంది యువత ఉన్నతమైన విద్యను చదివినప్పటికీ పోలీసు ఉద్యోగాలపై మక్కువ చూపుతుండడంతో పోటీ అధికంగా పెరిగింది. నిత్యం దినపత్రికలు చదువుతూ సమాజంపై అవగాహన పొందాలి. రాత పరీక్ష నాటికి కనీసం రెండు నుంచి నాలుగు సార్లు వివరంగా చదువుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి. ఏదైనా ఒకే రకం పుస్తకాలను వంద శాతం మేరకు చదివి సొంతంగా నోట్సు తయారు చేసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. చదువుతో పాటు సాధిస్తామనే విశ్వాసం పెంచుకొని ఏకాగ్రతతో సాధన చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు..’.. అని అంటున్నారు ఉదయ్‌కిరణ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని