logo

గురువుల సంకల్పం.. కలిసొచ్చిన ఆంగ్లం

అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం.. ఇలా విద్యార్థుల కోసం అనేక సౌకర్యాలను అందజేస్తున్న ప్రభుత్వ పాఠశాలలు గతంలో వివిధ కారణాలతో మూతబడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో మూతబడిన పాఠశాలలు

Published : 25 Jun 2022 04:24 IST

కుమురం భీం జిల్లాలో 9 పాఠశాలలు పునఃప్రారంభం

కౌటాల గ్రామీణం, న్యూస్‌టుడే

కౌటాల మండలం తాటినగర్‌లో పునఃప్రారంభమైన పాఠశాలలో విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయురాలు

అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం.. ఇలా విద్యార్థుల కోసం అనేక సౌకర్యాలను అందజేస్తున్న ప్రభుత్వ పాఠశాలలు గతంలో వివిధ కారణాలతో మూతబడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో మూతబడిన పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు ఉపాధ్యాయులు చేసిన బడిబాట ద్వారా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కుమురం భీం జిల్లాలో తొమ్మిది పాఠశాలలు మళ్లీ తెరచుకున్నాయి.

దారిచూపిన ‘బడి బాట’..

జిల్లాలో ఏళ్లుగా మూతపడి ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఈ ఏడాది విద్యా సంవత్సరంలో తిరిగి ప్రారంభమయ్యాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా తొమ్మిది బడులలో విద్యాబోధన పునఃప్రారంభమయ్యాయి. బడిబాట కార్యక్రమంలో భాగంగా.. ఉపాధ్యాయులు గ్రామాల్లో ర్యాలీలు, గ్రామసభలు నిర్వహించి సర్కారు బడుల్లో అందుతున్న విద్యాబోధన, సౌకర్యాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. దీంతో పాటు ఈ విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం కూడా ప్రారంభం కానుందని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఫలితంగా ఉపాధ్యాయుల సంకల్పం, తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పుల వల్ల అంతా ఏకమై పాఠశాలలను తిరిగి తెరిపించారు.

సమష్టిగా కలిసి.. బాగుచేసి

ఏళ్లుగా తెరచుకోని బడుల భవనాలు శిథిలావస్థకు చేరి ఉండటంతో తాత్కాలికంగా అవస్థలు తప్పడం లేదు. ఇది గ్రహించిన గ్రామస్థులు, ఉపాధ్యాయులు అందరూ ఏకమై సమష్టిగా మరమ్మతులు చేయించాలని నిర్ణయించుకొన్నారు. ఈమేరకు ఖర్చులు భరించి బడులను బాగు చేయిస్తున్నారు. ఫ్లోరింగ్‌, బ్లాక్‌బోర్డు, రంగులు తదితర పనులు మొదలుపెట్టారు. ఒకవైపు మరమ్మతులు కొనసాగుతుండటంతో చదువులకు ఆటంకం కలగకుండా కౌటాల మండలం వైగాం గ్రామంలోని తాత్కాలికంగా ఓ ఇంట్లో బోధన కొనసాగిస్తున్నారు. ప్రైవేటుకు ధీటుగా విద్యాబోధన అందించేందుకు ఉపాధ్యాయులు సైతం క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ఫలితంగా విద్యార్థుల తల్లిదండ్రులకు బడులపై నమ్మకం పెరుగుతోంది.

ఇంటినే తరగతి గదిగా మార్చి..

కౌటాల మండలం వైగాం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో ఆరేళ్ల కిందట మూతబడింది. బడి బాటలో 35 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఏళ్లుగా తెరచుకోని బడి భవనానికి ప్రస్తుతం మరమ్మతులు కొనసాగుతున్నాయి. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరిత.. చదువులకు ఆటంకం కలగకుండా ఇలా ఓ ఇంట్లో విద్యాబోధన అందిస్తున్నారు.

మూడేళ్లకు తెరుచుకొని

ఇది వాంకిడి మండలంలోని సామెల ప్రాథమిక పాఠశాల. ఇది మూడేళ్ల కిందట విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో మూతబడింది. ఈ ఏడాది ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడు జాదవ్‌ సచిన్‌కు పోస్టింగ్‌ ఇచ్చారు. ఈయనతో పాటు సీఆర్పీ సందీప్‌లు బడిని తెరిపించేందుకు కృషి చేశారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచి మారుతితో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు. వారి కష్టానికి ఫలితం కూడా దక్కింది. 31 మంది విద్యార్థులు చేరడంతో పాఠశాల పునఃప్రారంభమైంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని