logo

కనిపించని పెరటి తోటలు..

కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా ప్రతిష్ఠాత్మకంగా 2018లో పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల లబ్ధిదారులైన గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం కోసం కేంద్రాల

Published : 28 Jun 2022 04:22 IST

అంగన్‌వాడీ కేంద్రాల్లో స్థలాల కొరత
న్యూస్‌టుడే, తలమడుగు

ఇక్కడ కనిపిస్తున్న పెరటితోట తలమడుగు మండలం కజ్జర్ల-2 అంగన్‌వాడీ కేంద్రంలోనిది. ఇక్కడ అనువైన స్థలం ఉండటంతో బాలింతలు, గర్భిణులు, చిన్నారులను దృష్టిలో పెట్టుకుని సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సొర, బీర, చిక్కుడు, కొత్తిమీర, మెంతి వంటివి పండిస్తూ పౌష్టికాహారం అందిస్తున్నారు. వేసవిలో మాత్రం నీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంగన్‌వాడీ కార్యకర్తలు చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా ప్రతిష్ఠాత్మకంగా 2018లో పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల లబ్ధిదారులైన గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం కోసం కేంద్రాల పరిధిలోని కార్యకర్తలు ఖాళీ స్థలాల్లో పెరటి తోటలను(న్యూట్రీ గార్డెన్లు) ఏర్పాటు చేయాలి. సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించి వాటిని వండి ఆహారంగా అందించాలి. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో ఎక్కడా అనువైన స్థలాలు లేకపోవడంతో ఆచరణ అంతంత మాత్రంగానే ఉంది. ఫలితంగా ప్రభుత్వ ఆశయం నీరుగారుతోంది.

జిల్లా వ్యాప్తంగా 18 మండలాలకుగాను 1256 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 530 కేంద్రాల్లో న్యూట్రీ గార్డెన్ల స్థలాలు ఉన్నట్లు గుర్తించినప్పటికీ ప్రస్తుతం 35లలో మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇక్కడ టీచర్లు సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలను పండిస్తున్నారు. పెరటితోటలో కూరగాయలు పండించడమే కాకుండా తమ పరిధిలోని మహిళలు, ప్రజలకు సేంద్రియ పంటలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. కానీ కార్యకర్తలు నూట్రీ గార్డెన్‌పై శ్రద్ధ కనబర్చడం లేదు. ఈ క్రమంలో కేంద్రాల్లో స్థల సమస్య, నీరు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని కిచెన్‌గార్డెన్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వమే కార్యకర్తలకు టమాట, వంకాయ, సొర, బీర, మెంతి, కొత్తిమీర, పాలకూర వంటి విత్తనాలను అందించింది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత కూడా ఖాళీ స్థలాలు ఉన్న వాటిల్లోనూ పెరటితోటల ఏర్పాటుకు కార్యకర్తలు ఆసక్తి చూపడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో కోతులు, ఎలుకలు, పలు చోట్ల నీటి సమస్యలతో తోటలను నిర్వహించలేకపోతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో స్థలాలు ఉన్నచోట పెరటి తోటలను ఏర్పాటుచేస్తే సేంద్రియ ఆకు, కూరగాయలతో బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందే అవకాశం ఉంటుంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


ప్రత్యేక దృష్టి
- ఐసీడీఎస్‌ పీడీ మిల్కా, ఆదిలాబాద్‌

జిల్లాలోని ఆయా అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉండటంతో పాటు ఖాళీ స్థలాలు ఉన్నవాటిలో కచ్చితంగా పెరటితోటల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టిసారిస్తాం. అందుకు తగ్గట్లుగా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని