logo

సక్రమ చెల్లింపు.. రుణపరిమితి పెంపు..

పట్టణాల్లో బతుకుదెరువు కోసం చిన్నాచితకా పనులు చేస్తున్న వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద రుణ పరిమితిని రూ.50 వేలకు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో బ్యాంకుల నుంచి మొదటి విడత రూ.10 వేల రుణం తీసుకుని

Updated : 28 Jun 2022 06:47 IST

ఇక వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి రూ.50 వేలు
కైలాస్‌నగర్‌, కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే

సమీక్ష నిర్వహిస్తున్న కుమురంభీం జిల్లా అదనపు పాలనాధికారి చాహత్‌ బాజ్‌పాయి (పాత చిత్రం)

పట్టణాల్లో బతుకుదెరువు కోసం చిన్నాచితకా పనులు చేస్తున్న వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద రుణ పరిమితిని రూ.50 వేలకు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో బ్యాంకుల నుంచి మొదటి విడత రూ.10 వేల రుణం తీసుకుని తిరిగి చెల్లించిన కొందరికి రూ.20 వేలు రుణం ఇచ్చారు. దాన్నికూడా సక్రమంగా చెల్లించిన వారికి రూ.50 వేల రుణం పొందే అవకాశం కలిగింది. అప్పులు చేసుకుని వ్యాపారాలు కొనసాగించే పేదలకు ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
సకాలంలో చెల్లిస్తే ప్రయోజనం..
రెండేళ్ల కిందట కరోనా కష్టకాలంలో లాక్‌డౌన్‌ విధించడంతో వీధి వ్యాపారుల బతుకులు ఆగమయ్యాయి. తిరిగి పరిస్థితులు మెరుగుపడ్డాక చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారు పెట్టుబడికి డబ్బుల్లేక అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం వారికి ఆర్థిక చేయూతనందించేందుకు పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో వీధి వ్యాపారుల సర్వే నిర్వహించింది. అర్హులైన వారికి గుర్తింపు కార్డులను అందజేసి మొదటి విడతగా రూ.10 వేలు, తర్వాత రూ.20 వేలు అందజేసింది. అయితే మొదటి విడత రుణాలు వేల సంఖ్యలో పొందినప్పటికీ చాలామంది తిరిగి చెల్లించలేదు. అదే సక్రమంగా చెల్లించిన వారు రెండో విడతగా రూ.20 వేలు పొందారు. ప్రస్తుతం ఈ రుణాన్ని సైతం చెల్లించిన వారు రూ.50 వేల రుణాలు పొందేందుకు అర్హత సాధిస్తారు.
డిజిటల్‌ లావాదేవీలకు ప్రోత్సాహం
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు వీధి వ్యాపారులకు నగదు ప్రోత్సాహకాన్ని సైతం అందిస్తోంది. ఫోన్‌ పే, భారత్‌ పే, పేటీఎం తదితర పేమెంట్‌ అగ్రిగేటర్లకు చెందిన క్యూఆర్‌ కోడ్‌ స్కానర్లను ఉచితంగా అందజేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వీధి వర్తకులకు రెండేళ్లలో వివిధ బ్యాంకుల నుంచి దాదాపు రూ.51.98 కోట్ల రుణాలను చెల్లించారు. నెలలో రూ.10 వేల నగదు రహిత లావాదేవీలు చేసిన వారికి ప్రోత్సాహకంగా రూ.100 క్యాష్‌బ్యాక్‌ను సైతం వారి ఖాతాల్లో జమ చేస్తోంది. దీంతో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.22 లక్షలు క్యాష్‌బ్యాక్‌ రూపంలో వ్యాపారుల ఖాతాల్లో జమయ్యాయి. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి 7శాతం వడ్డీ రాయితీ వర్తిస్తోంది.


సద్వినియోగం చేసుకోండి
- శ్రీనివాస్‌, డీఎంసీ, మెప్మా, ఆదిలాబాద్‌

పీఎం స్వనిధి పథకం కింద రుణాలు తీసుకుని సక్రమంగా చెల్లించిన వారికి రూ.50 వేల రుణం అందజేయాలని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. గడువులోగా చెల్లిస్తే వడ్డీ రాయితీ లభిస్తుంది. వినియోగదారుల నుంచి ఆన్‌లైన్‌లో ఎక్కువగా నగదు స్వీకరించిన వారికి ప్రోత్సాహక నగదు ఖాతాల్లో జమవుతుంది. వీధి వ్యాపారులందరూ సద్వినియోగం చేసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని