logo

వైఫల్యమే పాఠం.. విజయతీరమే గమ్యం

ఇంటర్‌, పది పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. పరీక్ష ఫలితాలు కొంత మంది తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చుతున్నాయి. పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేకపోయిన విద్యార్థులు కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బంగారం లాంటి జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు

Updated : 28 Jun 2022 12:48 IST

 ఫలితాలతో నిరుత్సాహం చెంది రాయొద్దు మరణ శాసనం
ప్రపంచ కుబేరులేం చదువరులు కారు
దండేపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే

ఇంటర్‌, పది పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. పరీక్ష ఫలితాలు కొంత మంది తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చుతున్నాయి. పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేకపోయిన విద్యార్థులు కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బంగారం లాంటి జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు నుంచి మొదలు, యాజమాన్యాల వరకు తమ పిల్లలకు మంచి ర్యాంకులు రావాలనే ఒత్తిడి కావచ్చు...స్నేహితుల ముందు ఎలా తిరగాలనే మానసిక సంఘర్షణ..ఇలా ఎన్నో కారణాలు విద్యార్థుల మృతికి కారణమవుతున్నాయి. మార్కులే కొలమానం కాదు అనే విషయాన్ని అందరూ గుర్తించాలి. ప్రముఖుల జీవితాలే ప్రేరణ కావాలి. ఒకసారి అనుత్తీర్ణులైనా పట్టుదలతో ఎన్నో విజయాలు సాధించవచ్చని తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.
గొప్పవాళ్లందరు చదువరులు కాదు..
ప్రపంచ కుబేరుల జాబితాలో పేరు సంపాదించిన వారిలో ఎక్కువ మంది ఏదో కారణంతో చదువు మధ్యలో ఆపేసిన వారే. సంపాదన విషయంలో మనం వారి పేర్లను స్మరించుకుంటున్నాం. అందుకు వారు చేసిందొక్కటే.. నచ్చిన మార్గంలో ప్రయాణించి అనుకున్న విజయం సాధించే వరకు విశ్రమించకపోవడం. ధ్రువపత్రాలను కేవలం అర్హతగానే పరిగణించారు. వారి ఆలోచనలకు పదును పెట్టారు. వైఫల్యాలను అనుభవాలుగా స్వీకరించి విజయాలు సాధించారు.
ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో.. దాన్ని పొందే పద్ధతుల్లోనూ అంతే శ్రద్ధ పాటించాలి.... ..స్వామి వివేకానంద

విద్యార్థులేం చేయాలి..
* నిరాశ చెంది ఒంటరిగా కూర్చుంటే మనసు పరిపరివిధాల పోతుంది. తల్లిదండ్రులకు పెద్ద తలవంపులు తెచ్చానన్న బలహీనమైన భావన మరింత కుంగుబాటుకు దారి తీస్తుంది. అలా కాకుండా రోజూ ఎలా గడిపామో భవిష్యత్తులోనూ అలాగే చేయండి.
* అనుత్తీర్ణత సాధించిన సబ్జెక్టులో మళ్లీ పరీక్ష ఉంటుంది. విద్యాసంవత్సరం వృథా కాకుండా సహచర విద్యార్థులతో కలిసి చదివే వెసులుబాటు ఉన్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే దిశగా అడుగులు వేయాలి.
* ఫలితాలు వచ్చాక ఒకటి, రెండు రోజులు కాసేపు ధ్యానంలో గడిపి వచ్చే ఫలితాన్ని సానుకూలంగా ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధం కావాలి. పరీక్షలు ఫలితాలు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి సోపానాలు మాత్రమేనని గమనించాలి.
* వీలైనంత వరకు కుటుంబసభ్యులతో కలిసి గడపాలి. ఆహ్లాదకరమైన విషయాలు మాట్లాడుకోవాలి. స్నేహితులతో గడపండి. మంచి శ్రేణి సాధించిన మీ మిత్రులను కలిసి మనస్ఫూర్తిగా అభినందించండి.

తల్లిదండ్రులు ఏం చేయాలంటే..
* ఫలితాలు రాగానే ఇంట్లో ఎలాంటి చర్చలు, వాదోపవాదాలు లేకుండా సూర్యోదయం అయినంత తేలికగా ఉండాలి. దూషణలు, రేపు తాము తలెత్తుకొని ఎలా తిరగాలన్న ఆక్రోశాన్ని పొరపాటున కూడా తల్లిదండ్రులు వ్యక్తం చేయరాదు. ఎలా బతుకుతారని అర్థం లేని ప్రశ్నలతో వేధించవద్దు.
* తమ బిడ్డ మిగితా అందరి కన్న తెలివైన వాడని, పదిలో మంచి గ్రేడ్‌ తెచ్చుకుంటాడని అందరితో చెప్పి తీరా ఫలితాలు వచ్చాక చతికిల పడుతుంటారు. ఎలాంటి చర్చలు లేకుండా మామూలుగా ఉన్నట్లే గడిపితే పిల్లలు ఇబ్బంది పడరు.
* ఫలితాలు వెల్లడైన తర్వాత తోటి వారితో పోల్చే ప్రయత్నం చేయకండి. చదువుల కోసం తెచ్చిన వేలాది రూపాయలు బూడిద పాలయ్యాయని నిందించే ప్రయత్నం చేయండి. పిల్లలకు ఏదైనా సున్నితంగా చెప్పాలన్న విషయం గుర్తుంచుకోవాలి.

చివరిగా ఒక్క విషయం..
ఎవరికీ పరీక్షల్లో తప్పాలని నలుగురిలో చులకనవ్వాలని ఉండదు. తల్లిదండ్రులకు తలవంపులు తేవాలని ఎవరూ కోరుకోరు. అనుత్తీర్ణతకు అనేక కారణాలు ఉంటాయి. వాటిని అన్వేషించి అధిగమించడం ఎలాగో తెలుసుకోండి. ప్రయత్నలోపం లేకుండా వెంటనే సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధపడండి.
చదువు మధ్యలో ఆపేసి 
మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ అంటే ప్రపంచ కుబేరుడిగానే తెలుసు. ఆయన తన అభిరుచి కోసం హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం చదువును మధ్యలో వదిలేసి వచ్చారు. ఆ తర్వాత కంప్యూటర్‌ రంగంలో మార్పులకనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తూ సంపాదనలో కుబేరులయ్యారు. 
రెండు విశ్వవిద్యాలయం నుంచి డ్రాపవుటై
ఒరాకిల్‌ డేటాబేస్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థను స్థాపించిన ల్యారీ ఎలీ సన్‌ను పెంపుడు తండ్రి ఎందుకు పనికిరాడని తిట్టేవారట. తర్వాత రెండు విశ్వవిద్యాలయాల నుంచి డ్రాపవుటై అంచలంచెలుగా ఎదిగి ల్యారీ ఒరాకిల్‌ను స్థాపించారు. సంపదలో ప్రత్యేక స్థానాన్ని పొందారు.
చిన్నప్పుడు ప్రోగ్రామింగ్‌ నేర్చుకోవడంతో..
సామాజిక మాధ్యమాల్లో అత్యంత ఆదరణ పొందిన ఫేస్‌బుక్‌ను రూపొందించడానికి జుకర్‌బర్గ్‌ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం చదువు మధ్యలో మానేశారు. చిన్నప్పుడు ప్రోగ్రామింగ్‌ నేర్చుకోవడంతో సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగి నేడు కుబేరుడయ్యారు.
 ఎనిమిదిలో తప్పినా... సత్తా చాటాడు.
ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ ఎనిమిదో తరగతిలో అనుత్తీర్ణుడయ్యారు. కానీ అతనికి నచ్చిన రంగాన్ని ఎంచుకొని కష్టపడి విజయతీరాలకు చేరారు. ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించారు. చదువు ఒక్కటే కాదు..జీవితంలో తమకు నచ్చిన రంగంలో కష్టపడితే ఎలాంటి ఢోకా ఉండదు.  
ఉద్యోగం రాకున్నా.. సినిమాల్లో రాణించారు..
బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. అలాంటి అమితాబ్‌కు స్వరంలో సున్నితత్వం తక్కువ ఉందని ఆకాశవాణిలో ఉద్యోగానికి తిరస్కరించారు. అనంతరం సినిమా నటుడిగా రాణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని