logo

ఏజెంట్ల మోసం.. గల్ఫ్‌లో వనవాసం

గల్ఫ్‌ దేశాలంటే ఇక్కడి ప్రజలకు తెలియని వారుండరు.. పరిచయం లేని కుటుంబం ఉండదు.. కొందరు అదృష్టం పంచన చేరితే ఎందరో దురదృష్టానికి చిరునామాలు అవుతున్నారు..

Updated : 02 Jul 2022 12:33 IST

దినదిన గండంగా గడుపుతున్న బాధితులు

నిర్మల్‌, న్యూస్‌టుడే

గల్ఫ్‌ దేశాలంటే ఇక్కడి ప్రజలకు తెలియని వారుండరు.. పరిచయం లేని కుటుంబం ఉండదు.. కొందరు అదృష్టం పంచన చేరితే ఎందరో దురదృష్టానికి చిరునామాలు అవుతున్నారు.. కష్టాలొస్తే కాసింత ఓదార్చేవారే కానీ శాశ్వతంగా ఆ ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన వారు లేరు. సంవత్సరాలుగా వెంటాడుతున్న పేదరికాన్ని దూరం చేసుకుందామని.. కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలని.. తలకు మించిన అప్పులు చేసి ఎన్నెన్నో ఆశలతో ఆ దేశాలకు వెళ్లి తిరిగొచ్చి మళ్లీ వెళ్లిన వారిలో కొంతమంది ఏజెంట్‌ ‘వల’లో చిక్కి ఇరుక్కుపోతున్నారు. వారికిసరైలు వీసాలు లేకపోవడంతో అక్కడి కంపెనీలు తీసుకోడం లేదు. బయటపనులు దొరకక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఉద్యోగం పేరు చెప్ఫి. ఇతర పనులు...

మాయమాటలు చెబుతూ ఏజెంట్ల వలలో ఎంతో మంది బాధితులు చిక్కుకుంటున్నారు. గల్ఫ్‌ దేశాల్లో మంచి కంపెనీల్లో మంచి ఉద్యోగం కల్పిస్తామని ఆశ చూపించి అక్కడెళ్లిన తర్వాత గొర్రెలు మేపడం, మరుగుదొడ్లు శుభ్రం చేయడం వంటి పనులు అప్పజెప్తున్నారు. రూ. లక్షలు అప్పులు చేసి గల్ఫ్‌ దేశాలకు వెళ్లినా అక్కడ తినడానికి తిండిలేక, ఉండటానికి గూడులేక, పనిదొరక్క, అక్కడి ప్రభుత్వాలు విధించిన చట్టాల కారణంగా కొందరు మానసికంగా కుంగిపోయి అనారోగ్యంతో, గుండెపోటుతో మరణిస్తుండగా మరికొంత మంది ఉట్టి చేతులతో స్వగ్రామాలకు చేరుతున్నారు. ఇంకొందరు అక్కడే విగత జీవులుగా అజ్ఞాతవాసంలో ఉంటుండగా మరికొంత మంది అక్కడి జైళ్లలో మగ్గుతున్నారు.


కొద్ది రోజుల క్రితం నిర్మల్‌ బస్టాండ్‌ నుంచి గల్ఫ్‌ దేశానికి వెళ్తున్న వ్యక్తిని పంపిస్తున్న కుటుంబ సభ్యులు

ఓ బాధితుడి గోడు

లక్ష్మణచాంద మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి సంవత్సరం క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లాడు. తెలిసిన ఏజెంటుకు రూ. 60వేలు చెల్లించాడు. దుబాయ్‌ వెళ్లిన తరువాత పనిచేసే కంపెనీలో రెండు నెలల తర్వాత వీసా ఇస్తుందని నమ్మించి పంపించాడు. ఏజెంటును నమ్మి దుబాయ్‌ వెళ్లి పనిలో కుదిరాడు. మూడు నెలలు గడిచినా కంపెనీ వీసా ఇవ్వలేదు. వేతనం ఇవ్వకుండా కాలయాపన చేయటంతో తనతోపాటు అక్కడ పనిచేసే వారు ఇబ్బందులకు గురయ్యారు. చివరికి ఆ కంపెనీ తీసేశారు. మరో కంపెనీలో చేరినా అతితక్కువ వేతనం ఇచ్చారని బాధితుడు వాపోయాడు. ప్రస్తుతం బయట పనులు చేసుకుంటూ బతుకు వెత్తదీస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.

బృందంగా వెళ్లారు.. మోస పోయారు..

నిర్మల్‌ ప్రాంతానికి చెందిన ముగ్గురు మిత్రులు గల్ఫ్‌ వెళ్లి డబ్బులు సంపాదించుకుందామని ఓ ఏజెంటును సంప్రదించారు. మంచి కంపెనీ, చక్కని జీతం ఉంటుందని నమ్మించిన ఏజెంటు ఒక్కొక్కరి నుంచి రూ.70 వేలు తీసుకున్నాడు. అక్కడికి వెళ్లిన తరువాత కంపెనీ వసతి కల్పిస్తుందని, మూడు నెలల్లో వీసా వస్తుందని నమ్మించి పంపించాడు. అక్కడికి వెళ్ల్లిన తరువాత మూడు నెలలు గడిచినా కంపెనీ వీసా రాలేదు. ఆ కంపెనీ వీసా ఇవ్వదని తెలుసుకొని మోసపోయారు. చేసేదేం లేక ఏవోచోట్ల పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు.

ఇదీ గల్ఫ్‌ ముఖచిత్రం..

* ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావాసులు గల్ఫ్‌ దేశంలోని యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్‌, ఖతర్‌, బహెరాన్‌, తదితర దేశాల్లో 60 వేల మందికిపైగా ఉన్నారు.

* ఉపాధి కోసం వెళ్లిన వారిలో చాలా మంది సాంకేతిక పరిజ్ఞానం లేని వారు, శిక్షణ, అనుభవం లేని వారే ఎక్కువ.

* కూలీలుగా వెళ్లి చాలా ఇబ్బందులు పడుతున్న వారు దాదాపు 8 వేల మంది వరకు ఉన్నారు.

* నకిలీ ఏజెంట్ల మోసాల బారిన పడి రూ. లక్షల్లో మోసపోయిన వారు వందల సంఖ్యలో ఉంటారు.

* ప్రవాసులకు సంబంధించిన వివరాలు ఇప్పటికీ లేవు. గ్రామ గ్రామాన సర్వే నిర్వహించి సమాచారాన్ని సేకరించాలి.

సందర్శక వీసాపై వెళ్లి అక్కడే ఉన్న వారు: 08 వేల వరకు

స్వగ్రామాలకు వచ్చి తిరిగి వెళ్లలేని వారు: 15 వేల వరకు

గల్ఫ్‌లో ఉన్న ఉమ్మడి జిల్లా వాసులు : 60 వేలు


కార్మికుల సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి

స్వదేశ్‌ పరికిపండ్ల, ప్రవాసిమిత్ర కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు

బాధితులకు అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఉపయోగపడే గల్ఫ్‌ కార్మికుల సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి. చట్టబద్దంగా ఏర్పడే ఈ బోర్డు ప్రభుత్వాలు మారినా అలాగే ఉంటుంది. గల్ఫ్‌లో ఇబ్బందులు పడుతున్న కార్మికులతో పాటు ఇక్కడున్న వారి కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలి. బాధితులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని