logo

వైకుంఠధామం.. కష్టాల ఘట్టం..!

హాజీపూర్‌ మండలం చిన్నగోపాల్‌పూర్‌లో నిర్మించిన వైకుంఠధామం ఇది. సరైన రహదారి లేకపోవడంతో ఉపాధి కూలీల సహకారంతో రోడ్డువేశారు.

Updated : 02 Jul 2022 03:11 IST

హాజీపూర్‌ మండలం చిన్నగోపాల్‌పూర్‌లో నిర్మించిన వైకుంఠధామం ఇది. సరైన రహదారి లేకపోవడంతో ఉపాధి కూలీల సహకారంతో రోడ్డువేశారు. తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గ్రామానికి దూరంగా ఉండడంతో విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు ఆ శాఖ అధికారులు అంగీకరించడం లేదు. దీంతో ప్రజలు దీనిని వినియోగించేందుకు ఆసక్తి చూపడం లేదు. అధికారులు స్పందించి వెంటనే విద్యుత్తు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

మంచిర్యాల గ్రామీణం, న్యూస్‌టుడే

పల్లెల్లో అంత్యక్రియల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఊరూరా వైకుంఠధామాలను నిర్మించింది. వాటిల్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో జాప్యం చేస్తుండటంతో వీటిని వినియోగించడంలేదు. ఉపాధి నిధుల సహకారంతో ఒక్కో గ్రామంలో రూ.12 లక్షలు వెచ్చించి నిర్మించిన వైకుంఠధామాల్లో సరైన రహదారులు, తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్డి సౌకర్యం వంటి వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. పల్లెప్రగతి పేరుతో సమస్యలను గుర్తించినప్పటికీ వాటిని పరిష్కరించండంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.

సమస్యలివే...

శ్మశానవాటికకు సమీపంలో భగీరథ పైపులైను ఉంటేనే తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. లేనిపక్షంలో బోరు వేస్తున్నారు. పలు గ్రామాల్లో బోర్లు పడకపోవడంతో నీటికి కొరత ఏర్పడుతోంది. దీనిని అధికారులు పట్టించుకోవడం లేదు. సమీపంలో విద్యుత్తు లైను ఉంటేనే కనెక్షన్లు ఇస్తున్నారు. దూర ప్రాంతంలోని వైకుంఠ ధామాలకు సరఫరా చేసేందుకు నిధులు వెచ్చించాల్సి ఉంటుందని చెప్పి అంచనాలు సిద్ధం చేసి డీడీలు తీయమని చేతులు దులుపుకొంటున్నారు. అనేక చిన్న పంచాయతీలకు సరైన బడ్జెట్‌ లేకపోవడంతో డీడీలు తీయడంలేదు. దీంతో వాటిని పట్టించుకునేవారు కరవయ్యారు.

జిల్లాలోని పంచాయతీలు, వైకుంఠధామాల వివరాలివే..

జిల్లాలోని మండలాలు: 16

పంచాయతీలు: 311

విద్యుత్తు సౌకర్యం లేనివి : 283

తాగునీటి సౌకర్యం లేనివి : 248

మరుగుదొడ్లులేనివి : 140

విద్యుత్తు సౌకర్యం కల్పించాలని ఆదేశాలు

జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలకు విద్యుత్తు సరఫరాకు అవసరమైన లైను లేకపోవడంతో కొంతమేరకు జాప్యమేర్పడుతోంది. పాలనాధికారి ఆదేశాల మేరకు విద్యుత్తు శాఖ అధికారులతో చర్చించి అవసరమైన విద్యుత్తు సౌకర్యం కల్పించే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు పంచాయతీల్లో ప్రతిపాదనలు తయారుచేసి డీడీలు తీయించడం పూర్తయింది. మరిన్ని పంచాయతీలకు అదే మాదిరిగా విద్యుత్తు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం.

- నారాయణరావు, జిల్లా పంచాయతీ అధికారి, మంచిర్యాల.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు