logo
Published : 06 Aug 2022 04:59 IST

అదను దాటుతున్నా.. అందని చేప పిల్లలు

ఖరారు కాని టెండర్లు!

ఆదిలాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే

టీవలి భారీ వర్షాలతో జిల్లాలోని చెరువులు అలుగు పారుతున్నాయి. జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ఈ సమయంలో చేప పిల్లలు వదిలితే సరైన సమయానికి ఎదిగి మత్స్యకారులకు లాభం తెచ్చే అవకాశం ఉంటుంది. ఏటా జూన్‌లో టెండర్లు పిలిచి చెరువుల్లో చేప పిల్లలు వదిలే బాధ్యతను ప్రైవేట్‌ గుత్తేదారులకు అప్పజెబుతున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయి ఇప్పటికే చేపపిల్లలను వదలాల్సి ఉంది. అయితే ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. గతేడాది 220 చెరువుల్లో చేపపిల్లలను వదలగా.. ఈ సీజన్‌లో 284 చెరువుల్లో విడతల వారీగా 1.28 కోట్లు వదిలేందుకు ప్రణాళిక రూపొందించారు.
జిల్లాలో 70 మత్స్య సహకార సంఘాలున్నాయి. వీటిలో 4,200 మంది మత్స్యకారులకు సభ్యత్వం ఉంది. గతేడాదితో పోలిస్తే రెండు వేల మంది కొత్తగా సభ్యత్వం తీసుకున్నారు. ఏటా చేప పిల్లలు చెరువుల్లో వదులుతుండటంతో టన్నుల్లో చేపల ఉత్పత్తి అవుతోంది. జులై నెలాఖరులోగా చేపపిల్లలను వదిలితే, బాగా పెరిగే అవకాశం ఉంది. ఆలస్యంగా వదలడం వల్ల అవి పెరిగే సమయానికి తటాకాల్లో నీళ్లు తగ్గిపోయి పెరుగుదల సరిగా ఉండదని మత్స్యకారులు వాపోతున్నారు.

* జిల్లాలో స్థానికంగా విక్రయించే చేపలు, ఎక్కువ డిమాండ్‌ ఉండే రకాలు కాకుండా ఇతర రకాలను సరఫరా చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల సైజ్‌ సరిగా లేకపోవడం, సకాలంలో సరఫరా చేయకపోవడంతో అవి పెరగడం లేదని అంటున్నారు. కట్ల, రవ్వ, మెరిగె రకాలకు జిల్లాలో డిమాండు ఉంది. కట్ల రకం తక్కువగా రవ్వ పిల్లలు ఎక్కువగా వేస్తున్నారు. మెరిగె రకం వేయడం లేదని వారు తెలిపారు. కట్ల రకం నాలుగైదు నెలలకే కిలో సైజులో పెరుగుతుంది. ధర కూడా ఎక్కువ. అదే రవ్వ రకం ఏడాదికి కిలో సైజుకు వస్తుంది. ఆలస్యంగా చెరువుల్లో వేస్తే.. పెరగడానికి 15-18 నెలలవుతుంది. నిబంధనల మేరకు 35-40 ఎంఎం సైజుతో కొన్ని 82-100 ఎంఎం సైజ్‌తో మరి కొన్ని వేయాల్సి ఉంది. గుత్తేదారులు వాటి కంటే తక్కువ సైజులో ఉన్నవి, పెరుగుదల లేని రకాలను వేస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. లబ్ధిదారులకిచ్చే పొట్లాలలో వేయి పిల్లలు ఉంటాయని సరఫరా చేస్తున్నా.. తక్కువగా ఉంటున్నాయని, ఈ సీజన్‌లోనైనా పక్కాగా ఇవ్వాలని వారు కోరుతున్నారు.

అలుగు పోస్తున్న చెరువు

* జిల్లాలో ఈ ఏడాది చేపపిల్లలు వదిలేందుకు ధరలను ఖరారు చేశారు. పెద్ద సైజువి (80-100ఎం.ఎం) రూ.1.63 చొప్పున, అదే చిన్నవి (40-45ఎంఎం) రూ.0.61 చొప్పున ధరను ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ధరలు తక్కువగా ఉండటంతో గుత్తేదారులు ముందుకు రావడం లేదని తెలిసింది. దీంతో జిల్లాకు సంబంధించిన టెండర్లు ఇంకా పూర్తి కాలేదు. చెరువులన్నీ జీపీఎస్‌ చేసి ఉండటంతో దాని ఆధారంగా టెండర్‌ దక్కించుకున్న గుత్తేదారులు, మత్స్యశాఖకు చెందిన సిబ్బందిలో ఒకరు చెరువు దగ్గరికి వెళ్లి చేపపిల్లలను సరఫరా చేసినట్లుగా, సంబంధిత సంఘం సభ్యులతో చిత్రం తీసి నమోదు చేయాల్సి ఉంటుంది. ఫొటో తప్పనిసరి చేయడంతో సంబంధిత చెరువు దగ్గరికి వెళ్లి దానికి సంబంధించిన సంఘ సభ్యులను కలిసి చేప పిల్లలను వదిలేయాల్సి ఉంటుంది.


ఆదేశాలు రాగానే..  

విజయ్‌కుమార్‌, మత్స్యశాఖ సహాయ సంచాలకులు

ఏటా చెరువుల సంఖ్యను పెంచుతున్నాం. టెండర్లు ఖరారు కాగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు చేప పిల్లలను గుత్తేదారులు సరఫరా చేస్తారు. ఈ ఏడాది అదనంగా మరో 60 చెరువుల్లో వదులుతున్నాం.

Read latest Adilabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని