logo
Published : 06 Aug 2022 04:59 IST

అధికారి నిర్లక్ష్యం.. అటకెక్కిన ఆదేశం!

రూ.లక్షల విలువైన టీపీఎంయూ సామగ్రి మాయం!

న్యూస్‌టుడే, ఉట్నూరు

ఇలా దుమ్ముధూళిలో పడేసిన దస్త్రాలు, పాడైపోయిన ఫర్నిచర్‌ టీపీఎంయూ కార్యాలయానికి

సంబంధించినవే. పెద్ద మొత్తంలో విలువైన సామగ్రి, ఫర్నిచర్‌, కంప్యూటర్లను మాయం

చేసిన తరువాత.. మిగిలిన వాటిలో కొన్నింటిని మొక్కుబడిగా తీసుకొచ్చి

ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయంలోని ఓ గదిలో ఇలా నిర్లక్ష్యంగా పడేశారు.

రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ల మీద నడుస్తుందన్న చందంగా తయారైంది ఓ అధికారి తీరు. ఆయన పనిచేసిన టీపీఎంయూ(ట్రైబల్‌ ప్రాజెక్టు మెనేజ్‌మెంట్ యూనిట్)తోపాటు తన పర్యవేక్షణలోని ఏసీ (ప్రాంతీయ సమన్వయాధికారి) కార్యాలయాలను ప్రభుత్వం ఎత్తివేసింది. అందులోని ఉద్యోగులు, సిబ్బందిని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ)లో సర్దుబాటు చేశారు. సంబంధిత కార్యాలయాల్లోని ఫర్నిచర్‌, కంప్యూటర్లు, సామగ్రి, దస్త్రాలను డీఆర్‌డీఏల అధికారులకు సమానంగా పంపిణీ చేయాలని ఉన్నతాధికారి ఆదేశాలు జారీచేసినా.. సదరు అధికారి నిర్లక్ష్యం చేయడంతో రూ.లక్షల విలువైన సామగ్రి చేతులు మారాయి. ఈ వ్యవహారంలో జిల్లా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంసైతం విమర్శలకు తావిస్తోంది.

అడవి బిడ్డల అభివృద్ధి కోసం రెండు దశాబ్దాల కిందట ఐటీడీఏలో టీపీఎంయూను ఏర్పాటు చేశారు. దీని పరిధిలో ఆరు ఏసీలను నెలకొల్పారు. పీవో పర్యవేక్షణలో ఉమ్మడి జిల్లాలోని 20 ఏజెన్సీ మండలాల్లోని ఆదివాసీ, గిరిజన మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం, పొదుపు, అభివృద్ధి, అక్షరాస్యత పెంపుదల, ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం కృషి చేయడం, ఐటీడీఏ అమలుపర్చే సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపిక కోసం టీపీఎంయూ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌ (ఏపీడీ) ఆధ్వర్యంలో చర్యలు చేపట్టేవారు.

జిల్లాల పునర్విభజనతో..

మహిళా సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్న టీపీఎంయూ కార్యాలయాన్ని ప్రభుత్వం జిల్లాల పునర్విభజన సందర్భంగా 2018లో ఎత్తివేసింది. అందులోని అధికారులు, సిబ్బందిని జిల్లాల్లోని డీఆర్‌డీఏలలో సర్దుబాటు చేశారు. ఈ క్రమంలో టీపీఎంయూతోపాటు దాని పరిధిలోని ఏసీలలోని ఫర్నిచర్‌, దస్త్రాలు, కంప్యూటర్లు, బీరువాలు, కుర్చీలు, ఫ్యాన్లు ఇతర సామగ్రిని నాలుగు జిల్లాల డీఆర్‌డీఏ అధికారులకు సమానంగా పంపిణీ చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలోని సెర్ప్‌ ఉన్నతాధికారి అప్పటి ఏపీడీని ఆదేశిస్తూ స్పష్టమైన ఉత్తర్వులు జారీచేసినా.. అమలులో మాత్రం సదరు ఏపీడీ నిర్లక్ష్యం వహించడంతో రూ.లక్షల విలువైన సామగ్రి మాయమైంది. జిల్లా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై స్పందించి చర్యలు తీసుకుంటే విలువైన సామగ్రి ఏమైందనే విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

అధికారి వివరణ..

ఎత్తివేసిన టీపీఎంయూ, ఏసీల్లోని కంప్యూటర్లు, సామగ్రిని డీఆర్‌డీఏకు అప్పగించారా అనే విషయంపై ‘న్యూస్‌టుడే’ ఆదిలాబాద్‌ జిల్లా డీఆర్‌డీవో కిషన్‌ను సంప్రదించగా.. ‘కంప్యూటర్లు, సామగ్రి ఏది కూడా తమకు ఇవ్వలేదన్నారు. ఏమైందో తనకు తెలియదన్నారు. అప్పటి టీపీఎంయూ ఏపీడీ ఎవరున్నారో వారికి తెలిసి ఉంటుందని’ చెప్పారు.

  


ఎత్తివేసిన టీపీఎంయూ, ఏసీ కార్యాలయాల్లోని ఫర్నిచర్‌, కంప్యూటర్లు, దస్త్రాలు, ఇతర సామగ్రిని వెంటనే డీఆర్‌డీఏ అధికారులకు అప్పగించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలోని పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) ఉన్నతాధికారి నాలుగేళ్లక్రితం అప్పటి టీపీఎంయూ ఏపీడీని ఆదేశిస్తూ.. జారీచేసిన ఉత్తర్వులివి. ఇప్పటికీ సదరు అధికారి ఆ సామగ్రిని డీఆర్‌డీఏలకు అప్పగించలేదు. ఆయన నిర్లక్ష్యం కారణంగా  రూ.లక్షల విలువైన ప్రభుత్వ సామగ్రి మాయమైందనే ఆరోపణలున్నాయి.


 

Read latest Adilabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని