logo

ముందుంది ముప్పు.. రక్షణ గోడలే దిక్కు

కాళేశ్వరం జలాశయం బ్యాక్‌ వాటర్‌ జిల్లా కేంద్రానికి కొత్త సమస్య తెచ్చిపెట్టింది. భారీ వర్షాలతో ఇటీవల మంచిర్యాలలో అనేక కాలనీలు వరదనీటిలో మునిగి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ సమస్య భవిష్యత్తులో ఏటా వచ్చే ప్రమాదం ఉంది. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి.. సుందరీకరణ పేరుతో ప్రజాధనం

Published : 06 Aug 2022 04:59 IST

మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే

మంచిర్యాల పట్టణం మధ్యలో నుంచి ప్రవహించే రాళ్లవాగు

కాళేశ్వరం జలాశయం బ్యాక్‌ వాటర్‌ జిల్లా కేంద్రానికి కొత్త సమస్య తెచ్చిపెట్టింది. భారీ వర్షాలతో ఇటీవల మంచిర్యాలలో అనేక కాలనీలు వరదనీటిలో మునిగి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ సమస్య భవిష్యత్తులో ఏటా వచ్చే ప్రమాదం ఉంది. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి.. సుందరీకరణ పేరుతో ప్రజాధనం వృథా చేయకుండా రాళ్లవాగు సరిహద్దులో ఉండే కాలనీలకు రక్షణ గోడలు ఎత్తుగా (సైడ్‌ వాల్స్‌) నిర్మిస్తే ముందు ముందు వచ్చే వరదల ముప్పు నుంచి తప్పించుకునే అవకాశం ఉంది.

ఇదీ పరిస్థితి..

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే చాలు జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఎల్లంపల్లి జలాశయం నీరు విడుదల చేస్తారు. దిగువ ప్రాంతంలో ఉన్న కాళేశ్వరం జలాశయం బ్యాక్‌ వాటర్‌ వెనుకకు వదులుతున్నారు. ఫలితంగా మంచిర్యాల గోదావరి సరిహద్దు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. పట్టణంలో నుంచి ప్రవహించే రాళ్లవాగు, తొళ్లవాగు వరద నీరు గోదావరినదిలో కలువకుండా ఉద్ధృతంగా పారడంతో ఆ వాగుల నీళ్లు కూడా వెనక్కి వచ్చి వేలా సంఖ్యలో నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. గత నెలలో వచ్చిన వరదల్లో 13 కాలనీల్లో 2,265 ఇళ్లు నీట మునిగాయి. ఇందులో 85 ఇళ్లు పూర్తిగా కూలీ పోయాయి. ఎల్‌ఐసీ కాలనీ, రాంనగర్‌, ఎన్టీఆర్‌ నగర్‌, పద్మాశాలినగర్‌ కాలనీల్లో రూ.కోట్ల ఆస్తులకు నష్టం జరిగింది. అనేక మంది ప్రజలు కట్టు బట్టలతో ప్రాణాలతో బయట పడ్డారు.

ఇలా చేస్తే బాగు..

మంచిర్యాల పురపాలక సంఘానికి పట్టణ ప్రగతి నిధులు ప్రతి నెల వస్తున్నాయి. మరోపక్క సాధారణ నిధులు, ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ నిధులు కూడా వస్తాయి. వీటితో ఇక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు కమీషన్లు వచ్చే పనులకు ప్రాధాన్యం ఇస్తూ పార్కులు, జంక్షన్లు, సుందరీకరణ పనులకు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. ఆ నిధులు వృథాగా ఖర్చు చేయకుండా రాళ్లవాగు సరిహద్దులో ఉన్న కాలనీల్లో వరదనీరు రాకుండా రక్షణ గోడలు ఎత్తుగా నిర్మించాలి.

వాగు మధ్యలో ఉన్న తుమ్మ చెట్లను, ఎత్తు గడ్డలను తొలగించి  కెనాల్‌ నీరు ఎలా పోతుందో.. అలా వాగునీరు గోదావరి నదిలో కలిసేలా చర్యలు తీసుకోవాలి. రాళ్లవాగు నీరు గోదావరిలో కలిసే ప్రాంతంలో కొంత దూరం వరదనీరు సులభంగా వెళ్లడానికి ఎల్‌-టర్న్‌గా కాలువ నిర్మించాలి. గోదావరినది, రాళ్లవాగు బఫర్‌ జోన్‌ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను తొలగించాలి. అందులో ఎవరైన పేద ప్రజలు ఉంటే వారికి ప్రభుత్వం పరంగా ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఎత్తు ప్రాంతాల్లో కేటాయించాలి.

భవిష్యత్తులో బఫర్‌ జోన్‌ స్థలాల్లో  ఇళ్లు కట్టకుండా మున్సిపల్‌, రెవెన్యూ, నీటిపారుద శాఖ అధికారులు సమన్వయంతో శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే పట్టణ ప్రజలకు రక్షణ ఉండే అవకాశం ఉంది.


మంచిర్యాలలో గత నెలలో వచ్చిన వరదలతో రాంనగర్‌, ఎల్‌ఐసీ కాలనీలు ఇలా వరద నీటిలో మునిగాయి. ఆ ఇళ్లలో ఉన్న ఖరీదైన వస్తువులు, ఫర్నిచర్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు చెడిపోయాయి. ఒక్కొక్క భవనంలో రూ.50 వేల నుంచి రూ.5 లక్షల పైచిలుకు నష్టం జరిగింది. మాతాశిశు ఆసుపత్రి కూడా వరదనీటిలో మునిగింది. అందులో విలువైన మందులు, పరికరాలు పనికి రాకుండా పోయాయి.


మంచిర్యాలలో రాళ్లవాగు ఒడ్డు పక్కన కార్మెల్‌ కాన్వెంట్‌ పాఠశాల ఉంది. అందులో  వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహించినా..  ఆ పాఠశాలలోకి వెళ్లకుండా సరిహద్దులో రక్షణ గోడ ఎత్తుగా నిర్మించారు. ఆ పాఠశాలకు పక్కన రాళ్లవాగు అవతలి ఒడ్డున స్థిరాస్థి వ్యాపారులు రెండేళ్ల కిందట లేఔట్‌ వెంచర్‌ ఏర్పాటు చేశారు. అందులో అనేక మంది ప్రజలు పెద్దపెద్ద భవనాలు నిర్మించారు. ఆ వ్యాపారులు ముందస్తు జాగ్రత్త కోసం రాళ్లవాగు సరిహద్దులో ఎత్తుగా రక్షణ గోడ ఇలా నిర్మించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని