logo
Published : 06 Aug 2022 04:59 IST

బెంచీ కూలింది.. పని నిలిచింది

రామకృష్ణాపూర్‌, మందమర్రి పట్టణం, న్యూస్‌టుడే

ఆర్కేపీ ఓసీ ఇలా..

టీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మందమర్రి ఏరియా ఆర్కేపీ ఓసీలో సౌత్‌ సైడ్‌ రోడ్డులో సుమారు రెండు నుంచి మూడు భారీ మట్టి బెంచీలు కుంగిపోయాయి. వారం రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీత పనులను 80 శాతం ఓ ప్రైవేటు కంపెనీ నిర్వహస్తుండగా 20 శాతం పనులను సింగరేణి నిర్వహిస్తోంది. సౌత్‌ సైడ్‌ పంపులు నడిచే ఏరియా ప్రాంతంలో సుమారు 500 మీటర్ల మేర రోడ్డు, భారీ బెంచీలు కుంగిపోవడంతో అక్కడున్న 190 హెచ్‌పీ గల రెండు పంపులు అందులో మునిగిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా నీరు నిలిచిపోగా.. బొగ్గు ఉత్పత్తి, ఓబీ పనులు చేపట్లే ప్రైవేటు కంపెనీ కూడా పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. నీటిని తీయడానికి, బెంచీలను మరలా నిర్మించడానికి సుమారు నాలుగు నుంచి ఐదు నెలలు పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో సంబంధిత అధికారులు ప్రస్తుతం అక్కడ పనిని నిలిపి వేసినట్లు తెలుస్తోంది. అక్కడ పనిచేసే ఉద్యోగులను వేరే చోట్లకు బదిలీ చేసేందుకు సంస్థ ఉన్నతాధికారులకు నివేదికలు సైతం పంపినట్లు సమాచారం. ప్రైవేటు కంపెనీ స్థలం వైపు నీరు నిలిచి పోవడంతో సింగరేణి సంస్థకు కేటాయించిన స్థలంలో ప్రస్తుతం ఆ కంపెనీ పనులు చేపడుతుంది. గతంలో పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగాయని, మరలా పునరావృతం అవడం పట్ల అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని పలువురు కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రైవేటీకరణ కోసం మూడు ఏళ్లలో ఓసీని మూసి వేసే ఆలోచనలో భాగంగానే యాజమాన్యం ఉద్యోగులను బదిలీ చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు.

అగమ్యగోచరంగా ఉద్యోగుల పరిస్థితి

ఓసీలో సుమారు 400 మంది విధులు నిర్వహిస్తుండగా..  అందులో ఈపీ ఆపరేటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఫిట్టర్లు సుమారు 60 నుంచి 80 మంది ఉద్యోగులను ఇతర ఏరియాల్లోకి బదిలీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి యాజమాన్యం ఇప్పటికే కొత్తగూడెంలోని ఉన్నతాధికారులకు నివేదికలు సైతం పంపినట్లు సమాచారం. ఇదే అదునుగా భావించిన పలువురు అధికారులు, నాయకులు బదిలీలను నిలిపివేసేందుకు పైరవీలు చేస్తూ ఉద్యోగులను నమ్మిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల పిల్లల చదువులకు ఆటంకం కల్గుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదువులు మధ్యలో ఉన్నాయని.. ఇప్పుడు బదిలీ చేయడం వలన చాలా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


కార్మికుల్లో అయోమయం

ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి అక్బర్‌అలీ

ఆర్కేపీ ఓసీలో సౌత్‌ సైడ్‌ స్లయిడింగ్‌ అవడం వల్ల పనిస్థలం లేక పలువురు ఉద్యోగులను యాజమాన్యం బదిలీ చేస్తామనడం సరికాదని ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి అక్బర్‌అలీ అన్నారు. శుక్రవారం ఓసీలో నిర్వహించిన సమావేశంలో కార్మికులను సమస్యలు తెలుసుకొని మాట్లాడారు. ఉద్యోగులను బదిలీ చేస్తామనడంతో వారిలో అయోమయం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు అవకాశం ఇచ్చి అనుకూల ప్రాంతాలకు బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. వారి కుటుంబ సమస్యలు, పిల్లల చదువులకు ఆటంకం కల్గుతుందన్నారు. ఈ విషయమై ఏరియా జీఎం దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Read latest Adilabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని