logo

ఆధార్‌ అనుసంధానం..ఓటర్ల సవరణకు అవకాశం

ఆదిలాబాద్‌ పట్టణంలో బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరుగుతూ ఓటుహక్కు కలిగిన వారిని ఆధార్‌ అనుసంధానం చేయిస్తున్నారు. ఈ ప్రక్రియ ఎన్నికల విభాగ పర్యవేక్షకులు సాయి మహేష్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Published : 13 Aug 2022 05:37 IST

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే

ఇంటింటికీ తిరుగుతూ..
ఆదిలాబాద్‌ పట్టణంలో బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరుగుతూ ఓటుహక్కు కలిగిన వారిని ఆధార్‌ అనుసంధానం చేయిస్తున్నారు. ఈ ప్రక్రియ ఎన్నికల విభాగ పర్యవేక్షకులు సాయి మహేష్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ఏదో ఒక గుర్తింపు కార్డుతో ఎపిక్‌ నెంబరుకు అనుసంధానం చేయించుకోవాలని కోరుతున్నారు.


అనర్హుల ఓట్లను తొలగించేలా ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం ఆధార్‌ అనుసంధానంపై దృష్టి సారిస్తూనే.. కొత్త ఓటరు నమోదు, పాత జాబితాల్లో మార్పు, చేర్పులకు సంబంధించి ప్రత్యేక ఓటర్ల సవరణ (స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌) కార్యక్రమం ఈ నెల 1వ తేదీ నుంచి జిల్లా యంత్రాంగం ప్రారంభించింది. బూత్‌స్థాయి అధికారులు(బీఎల్‌ఓ) ఇంటింటికీ వెళ్లి ఆ జాబితా సవరణ చేస్తున్నారు.
ఏటా జనవరి ఒకటో తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు నమోదుకు అవకాశం ఉండేది. ఆ తరువాత 18ఏళ్లు నిండిన వారు మరో ఏడాది పాటు వేచి చూడాల్సి వచ్చేది. ఈ సారి ఏప్రిల్‌ 1, జులై 1, అక్టోబర్‌ 1వ తారీఖు నాటికి 18ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. జిల్లాలో ప్రస్తుతం 4,25,042 మంది ఓటర్లు ఉండగా.. 582 బీఎల్‌ఓలు ఆయా ఓటర్ల వద్దకు వెళ్లి ఆధార్‌ అనుసంధానంతో పాటు కొత్తవారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇదే సందర్భంలో అనర్హులను జాబితా నుంచి తొలగించే చర్యలకు ఉపక్రమించారు. ఒకే వ్యక్తి రెండు అంతకంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం పరిపాటిగా మారింది. మృతి చెందిన వారి పేర్లు కూడా జాబితాల్లో కనిపిస్తున్నాయి. అర్హత గల ప్రతి పౌరుడికి ఒకే చోట ఉండాలని.. బోగస్‌ ఓట్లకు తావులేకుండా ఆధార్‌ అనుసంధానంపై దృష్టి సారించారు. ఇందుకు ఫారం-6బీ కొత్తగా ప్రవేశపెట్టారు. ఆధార్‌ సంఖ్య ఇవ్వకుంటే ఆ ఫారంలో పొందుపరచిన 11 ప్రత్యామ్నాయ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించవచ్చు. అయితే ఆధార్‌ అనుసంధానం ఓటర్ల ఐచ్చికమే కానీ ఒత్తిడి ఉండదని ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఎంత మంది అనుసంధానం చేసుకుంటారన్నది వేచి చూడాలి.

నమోదు ఇలా..
బూత్‌స్థాయి అధికారుల వద్ద, తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాల్లో ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. అంతర్జాలంలో, మీ-సేవా కేంద్రాలు, ఓటరు హెల్ప్‌ లైన్‌ యాప్‌, నేషనల్‌ ఓటర్స్‌ సర్వీస్‌ పోర్టల్‌, ఈఆర్‌వో నెట్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇప్పటికే బీఎల్‌వోలు ఇంటింటా జాబితాలతో తిరుగుతూ నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇదే కాకుండా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. ఇందుకు అవసరమైన ఫారం-6, ఫారం-7, ఫారం-8, ఫారం-6బీ తదితర వాటిని ఎన్నికల సంఘం సరఫరా చేస్తుంది. ఇదిలా ఉంటే వీఆర్‌ఏలు సమ్మెబాట పట్టడంతో.. వారు బీఎల్‌ఓలుగా ఉన్నచోట సవరణ కార్యక్రమం నిలిచిపోయింది. జిల్లా వ్యాప్తంగా 100చోట్ల ఈ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. ఈ విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టిసారించాల్సి ఉంది.


ఓటర్ల జాబితా సవరణ: అక్టోబర్‌ 24 వరకు
నవంబరు 9న ముసాయిదా ఓటరు జాబితా విడుదల
డిసెంబరు 8 వరకు అభ్యంతరాల స్వీకరణ
డిసెంబరు 26 అభ్యంతరాల పరిష్కారం
జనవరి 5, 2023న తుది ఓటరు జాబితా విడుదల


నియోజకవర్గం ఓటర్లు బీఎల్‌ఓలు
ఆదిలాబాద్‌ 2,27,583 281
బోథ్‌ 1,97,459 301
మొత్తం 4,25,042 582

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని