logo

ఆశ పట్టాలెక్కేనా..!

బెల్లంపల్లి ప్రజలు దశాబ్దాలుగా ఇళ్ల పట్టాల కోసం ఎదురుచూస్తున్నారు. 75 ఏళ్ల కింద బొగ్గు గనుల ప్రారంభం కోసం సింగరేణి సంస్థ వందలాది ఎకరాలను లీజుకు తీసుకుంది. గనులు మూతపడ్డ కొద్దీ జీఎం కార్యాలయంతో సహ వివిధ విభాగాల కార్యాలయాలను గోలేటికి తరలించారు.

Published : 13 Aug 2022 05:37 IST

సీఎం హామీతో పంపిణీకోసం ఎదురుచూపులు..
బెల్లంపల్లి పట్టణం, న్యూస్‌టుడే

బెల్లంపల్లి ప్రజలు దశాబ్దాలుగా ఇళ్ల పట్టాల కోసం ఎదురుచూస్తున్నారు. 75 ఏళ్ల కింద బొగ్గు గనుల ప్రారంభం కోసం సింగరేణి సంస్థ వందలాది ఎకరాలను లీజుకు తీసుకుంది. గనులు మూతపడ్డ కొద్దీ జీఎం కార్యాలయంతో సహ వివిధ విభాగాల కార్యాలయాలను గోలేటికి తరలించారు. అప్పటినుంచి పట్టణంలో జనాభా తగ్గుతూ వచ్చింది. సింగరేణి సంస్థ 150 ఎకరాల భూమిని ప్రభుత్వానికి రెండేళ్ల క్రితం అప్పగించింది. ఈ క్రమంలో పట్టాలు ఇస్తారన్న ప్రచారంతో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సీఎం కేసీఆర్‌ను కలిసి పట్టాల సమస్యపై మరోసారి వినతిపత్రం అందజేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీంతో పట్టణ ప్రజల చిరకాల కోరిక తీరుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు.
ఇదీ పరిస్థితి
2014 ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. అప్పటి నుంచి పట్టాల పంపిణీ కోసం ప్రజలు ఎదురుచూస్తునే ఉన్నారు. అర్హులను గుర్తించే విషయంలో రెవెన్యూ అధికారులకు చిక్కులు ఎదురయ్యాయి. సింగరేణి క్వార్టర్లను సంస్థ ప్రభుత్వానికి అప్పగించింది. ఈ క్రమంలో సింగరేణిలో పనిచేస్తున్న వారి పేర్ల మీద ఇంటి నంబర్లు ఉన్నాయి. ఇదే ఇంటిని మరొకరికి అద్దెకు ఇవ్వడం.. వారు ప్రస్తుతం ఇంట్లో నుంచి వెళ్లడానికి నిరాకరించడంతో సమస్యలు తలెత్తాయి. అయినప్పటికీ అధికారులు అన్ని పత్రాలు ఉన్న ప్రజల వద్ద నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకున్నారు. సీఎంను కలిసిన తర్వాత ఎమ్మెల్యే చిన్నయ్య  సింగరేణి ప్రాంతాల్లో కాకుండా ఇతర వార్డుల ప్రజలంతా జీఓ నంబరు 76 కింద అందుబాటులో ఉన్న పత్రాలతో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. పట్టణంలోని ప్రజలంతా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియ ముగియడంతో రెవెన్యూ అధికారులు సర్వే చేసిన తర్వాత పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.

85 మందికి రిజిస్ట్రేషన్‌ పూర్తి
పట్టణంలో పట్టాల మంజూరు కోసం అర్హులైన ప్రజల వద్ద నుంచి రెవెన్యూ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. 2722 మంది దరఖాస్తు చేసుకున్నారు. పలు దఫాలుగా సర్వే చేసి అర్హులను గుర్తించడానికి చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు 85 మందికి మాత్రమే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వ, సింగరేణి భూముల్లో రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కావడంతో ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు పట్టాల పంపిణీలో జాప్యం కొనసాగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వ భూములు, సింగరేణి స్థలాల్లో ఇళ్లను నిర్మించుకున్న వారే అధికంగా ఉన్నారు. పట్టణంలో పట్టాల పంపిణీ ప్రధాన సమస్యగా మారింది. రిజిస్ట్రేషన్‌ కోసం అర్హులైన ప్రజలు ఎదురుచూస్తున్నారు.
సింగరేణి ఎస్‌ఆర్‌టీ  క్వార్టర్లపై తర్జనభర్జన
బెల్లంపల్లి పట్టణంలోని టేకులబస్తీ, కన్నాలబస్తీ, హన్మాన్‌బస్తీ, 24 డీప్‌ ఏరియా, శాంతిఖని, సుభాష్‌నగర్‌, ఇంక్లైన్‌బస్తీల్లో సింగరేణి ఎస్‌ఆర్‌టీ క్వార్టర్లు ఉన్నాయి. వీటిని సింగరేణి ప్రభుత్వానికి అప్పగించింది. ప్రస్తుతం ఎస్‌ఆర్‌టీ క్వార్టర్ల ఫైల్‌ సీఎస్‌ నుంచి ఆర్థిక శాఖకు చేరింది. క్వార్టర్లు నిర్మించి ఉండడంతో నివాసముంటున్న వారికి ఎలా కేటాయించాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. గతంలో హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో క్వార్టర్లను కొలతల ప్రకారం ధరలు నిర్ణయించి వారికి అప్పగించారు. బెల్లంపల్లిలోనూ అదే పద్దతి పాటించాలన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో రెండు నెలల్లో ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ప్రైవేటు వ్యక్తులు కొలతలు చేస్తే చర్యలు
కుమారస్వామి, తహసీల్దార్‌

ప్రజలంతా జీఓ నంబరు 76 కింద దరఖాస్తులు చేసుకున్నారు. ఎమ్మెల్యే చొరవతో దరఖాస్తులకు అవకాశం కల్పించారు. అయితే కొన్ని వార్డుల్లో ప్రజలను మభ్యపెడుతూ ప్రైవేటు వ్యక్తులు ఇంటి స్థలాలను కొలతలు చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని ఇలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల తర్వాతనే అధికారికంగా సర్వేయర్‌ కొలతలు తీసుకున్నాక ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ప్రజలు గమనించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని