logo

బాపూ మాట..బంగారు బాట

మద్యపాన నిషేధం, మహిళా స్వతంత్రం, పరిశుభ్రత, అక్షరాస్యత, ఆరోగ్యం లాంటి కార్యక్రమాలను దేశ స్వాతంత్య్రోద్యమానికి జోడించిన ధీశాలి గాంధీజీ. ప్రేమ, త్యాగం, పరస్పర సహకారం, స్నేహం, శాంతియుత సహజీవనం, ఉన్నత విలువలను నేర్పిన మహనీయుడు ఆయన.

Published : 13 Aug 2022 05:43 IST

బంగ్లా ముందు స్మారకచిహ్నం

- న్యూస్‌టుడే,చెన్నూరు పట్టణం

మద్యపాన నిషేధం, మహిళా స్వతంత్రం, పరిశుభ్రత, అక్షరాస్యత, ఆరోగ్యం లాంటి కార్యక్రమాలను దేశ స్వాతంత్య్రోద్యమానికి జోడించిన ధీశాలి గాంధీజీ. ప్రేమ, త్యాగం, పరస్పర సహకారం, స్నేహం, శాంతియుత సహజీవనం, ఉన్నత విలువలను నేర్పిన మహనీయుడు ఆయన. అందుకే గాంధీజీ మహాత్ముడే కాదు జాతిపిత కూడా.. ఆయన చూపిన బాట.. ఆయన మాట స్ఫూర్తిదాయకం. ఆదర్శనీయం, అనుసరణీయం.

నిజాం పాలకులపై పోరాడిన మిలటరీ సైనికుల్లో పలువురు ప్రాణాలు విడిచారు. పోరాట యోధుల స్మారకార్థం అద్దాలమేడ ముందు బండరాయితో నిర్మించిన అశోకచిహ్నం, ఫిరంగులు నేటికి చెక్కుచెదరకుండా ఉన్నాయి. రజాకర్ల ఉద్యమ అనంతరం హైదరాబాద్‌ నిజాంతో అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి వల్లభాయ్‌పటేల్‌ ఈ మేడలోనే చర్చలు జరిపినట్లు చెబుతారు. అద్దాలమేడ ప్రస్తుతం హిందీ, మరాఠి, తెలుగు సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తోంది.

మమ్మల్ని చూడాలనుకో, మంచిదే. పట్టుకోవాలనుకో చాలా వేగం ఉండాలి. కానీ మమ్మల్ని ఓడించాలనుకుంటే ‘అంతకంటే జోక్‌ మరొకటి ఉండదు’.

- ఇండియన్‌ ఆర్మీ
మానవునిలో దాగి ఉన్న శారీరక, మానసిక, సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక శక్తులను వెలికితీయగల సాధనమే విద్య.
విద్య
గాంధీజీకి బ్రిటీష్‌ విద్యా విధానం పట్ల విముఖత ఉండేది. దాని వల్ల వారి ప్రభుత్వంలో పని చేసే గుమాస్తాలను తయారు చేయడానికి అది పనికి వస్తుందనే వారు..భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టడానికి యువకులలో దేశభక్తిని ప్రేరేపించుటకు జాతీయ విద్యా విధానం అవసరమని విశ్వసించారు. వృత్తి విద్యను నేర్పించడం వల్ల పని పట్ల గౌరవం పెరగడంతో పాటు సామాజిక విలువలు పెంపొందుతాయని అంటారు.  ఇందులో భాగంగానే ప్రభుత్వాలు ఈ దిశగా కృషి చేస్తున్నాయి. గురుకులాలు, వృతివిద్య పాఠశాలలను ఏర్పాటు చేశాయి. అనేక గ్రామాల్లో విద్య అందుబాటులోకి వచ్చింది.. నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు ఉచితంగా చదువుకోవడానికి అవకాశాలు కల్పించారు.్చ

* నిర్మల్‌ జిల్లా కుంటాల మండలంలోని పెంచికల్‌పాడ్‌ పాఠశాలల్లో ఒకప్పుడు ఇరవై మంది విద్యార్థులు ఉండేవాళ్లు. కనీస సౌకర్యాలు లేక సరైన బోధన లేకపోవడంతో విద్యార్థుల చేరిక తక్కువగా ఉండేది. ప్రస్తుతం పాఠశాలలో ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయడం వల్ల వంద శాతం నమోదుతో విద్యార్థుల సంఖ్య 80కి చేరుకుంది. గ్రామస్థులు స్వయంగా ముగ్గురు విద్యా వాలంటీర్లను నియమించారు. పాఠశాల అభివృద్ధికి అనేక మంది సాయం చేయడంతో అన్ని సౌకర్యాలు సమకూరుతున్నాయి.
స్వతంత్ర భారతంలో నేటికి మహిళలపై వివక్ష , హింస, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. వాటిని రూపుమాపడం మనందరి బాధ్యత మన దేశంలోని మహిళలు ఇంటికే పరిమితం కాకూడదనేది గాంధీజీ అభిప్రాయం. మహిళలందరు స్వచ్ఛందగా స్వాతంత్య్ర సమరంలో పాల్గొంటేనే స్వాతంత్య్రం లభిస్తుందని పిలుపునివ్వడంతో అనేక మంది మహిళలు ఉద్యమంలో ప్రధానపాత్ర పోషించారు. స్త్రీలందరు విద్యావంతులు కావాలి. వారికి ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని కోరుకునే వారు. ఆయన చూపిన మార్గదర్శనం మేరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్నాయి. గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు పథకాలు అమలు చేస్తున్నాయి.  గతంతో పోలిస్తే అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారు.. విద్య, రాజకీయ, సామాజిక రంగాల్లో రాణిస్తున్నారు. 

మహిళాభ్యుదయం 
* ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలంలో గతంలో 70 సంఘాలు, 650 మంది సభ్యులు ఉండేవాళ్లు. అలాంటిది అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం ఏడు వేల మంది సభ్యులతో ఆర్థికాభివృద్ధి సాధించారు. ప్రస్తుతం రైతుల నుంచి కూరగాయలు, పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. రైతులకు ఆధునిక యంత్రాలను అద్దెకు ఇస్తున్నారు. లక్షల రూపాయిల టర్నోవర్‌తో సంఘం ప్రగతి పథంలో నిలిచి ఆదర్శంగా ఉంది. సంఘంలోని అనేక మంది మహిళలు తమ పిల్లలను చదివిస్తుండటంతో పాటు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు.

వయోజన విద్య
దేశంలోని ప్రజలందరు అక్షరాస్యులుగా అయినపుడే ఆ దేశ స్వాతంత్య్రం నిలుస్తుంది. అభివృద్ధి చెందుతుందనే వారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నా.. ఉమ్మడి జిల్లా అక్షరాస్యతలో వెనుకబడి ఉంది. వయోజనులను అక్షరాస్యులుగా చేసేందుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేసిన ఆశించిన స్థాయిలో అక్షరాస్యత శాతం పెరగలేదు.. జిల్లా కేవలం 54 శాతం అక్షరాస్యత కలిగి ఉంది.

పారిశుద్ధ్యం  క్విట్‌ ఇండియా..క్లీన్‌ ఇండియా ఇవే
మన నినాదాలు. స్వతంత్ర సంగ్రామ సంబరాలు జరుపుకుంటున్నాం. చాలా సంతోషం, కానీ.. స్వాతంత్య్రం కంటే పారిశుద్ధ్యం  చాలా ముఖ్యం. మన తొలి అడుగు ఇదే కావాలి. పరిశుభ్రత మంచి అలవాటు.. ఈ రెండూ మంచి ఆరోగ్యానికి మానవ సంబంధాలకు నిదర్శనం.
ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ ఆశించిన స్థాయిలో పరిశుభ్రత ఏర్పడలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రత్యేకంగా గ్రామాలతో పాటు పట్టణాల్లో డంపింగ్‌యార్డులు నిర్మించింది.. చెత్త సేకరణకు ప్రతి గ్రామానికి ట్రాక్టర్లు ఏర్పాటు చేసింది. కార్మికులను నియమించారు.. బహిరంగ మలవిసర్జనను పూర్తిగా నిర్మూలించేందుకు మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారు. అయిన కొన్ని గ్రామాల్లో ఇంకా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.  చెత్త సేకరణను పక్కాగా అమలు చేస్తే..ఉమ్మడి జిల్లా పరిశుభ్రత జిల్లాగా నిలిచే అవకాశం ఉంది.
ః సంపూర్ణ పారిశుద్ధ్యంలో ఇచ్చోడ మండలంలోని ముఖరా(కె) జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు పొందింది. ప్రత్యేకమైన అవార్డులను స్వంతం చేసుకుంది. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు స్థానిక నేతలు కృషి చేస్తున్నారు. ఇంటింటికి ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించారు. ఇళ్లల్లో స్థలం లేని వారికి సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చారు. గత మూడేళ్లలో 40వేల మొక్కలు నాటి గ్రామంతో పాటు పరిసరాల్లో పచ్చదనం నిండేలా చేశారు.
మందమర్రిలోని నార్లాపూర్‌ గ్రామ జనాభా 1540. సర్వే చేస్తే 190 మంది నిరక్షరాస్యులుగా తేలింది. వారిని అక్షరాస్యులుగా చేయాలనే ఆలోచనతో జిల్లా వయోజన విద్య అధికారి పురుషోత్తం నాయక్‌ స్థానిక వెలుగు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అక్షర వాలంటీర్లను నియమించారు. వంద రోజుల ప్రణాళికతో ప్రతి ఒక్కరిని కేంద్రాల్లో చేర్పించడంతో పాటు పరీక్షలు నిర్వహించి అక్షరాస్యులుగా ప్రకటించారు.
ఒక దేశం ఆర్థికంగా, నైతికంగా ముందడుగు వేయాలంటే మద్యపాన నిషేధం తప్పనిసరి.

ప్రపంచవ్యాప్తంగా అనాదిగా మద్యపానం ఉంది. మద్యపానం పట్ల గాంధీజీ ఉన్న వ్యతిరేకత రాజీలేనిది. పేదలు మరింత పేదరికంలోకి  వెళ్లడానికి మద్యం మహమ్మారి నుంచి వారంతా బయటపడనందుకు అంటారు గాంధీ. కాని ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయం మద్యం నుంచి వస్తుండటంతో మద్యపానాన్ని నిషేధించలేక పోతున్నారు. కొన్ని గ్రామాల్లో స్వాతంత్రోద్యమం నుంచి ఇప్పటి వరకు మద్యపానం జోలికి వెళ్లలేదు. ఉమ్మడి జిల్లాలో 15కు పైగా గ్రామాలు స్వచ్ఛందంగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నాయి.
* జైనథ్‌ మండలంలోని పిప్పర్‌వాడ గ్రామంలో గత కొన్ని దశాబ్దాలుగా మద్యపాన నిషేధం అమలవుతోంది. నిరుపేదలు సంపాదించుకున్న సొమ్ము మద్యానికి వెచ్చించడంతో పాటు కుటుంబ కలహాలు ఎక్కువ కావడంతో గ్రామాభివృద్ధి కమిటీ మద్యపాన నిషేధం పాటించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రామంలోని యువత వ్యవసాయం, ఇతర ఉపాధి రంగాలపై దృష్టి సారించి ఆర్థికంగా అభివృద్ధి చెందారు.

 


మండలాలు- 70
గ్రామాలు- 1758
పంచాయతీలు- 1509
పాఠశాలలు- 3609
విద్యార్థులు- 4.35 లక్షలు
జనాభా- 27.39 లక్షలు
అక్షరాస్యులు- 14.81 లక్షలు
అక్షరాస్యత- 54శాతం
పరిశ్రమలు- 869
కుటీర పరిశ్రమలు- 8092
మహిళా సంఘాలు- 42వేలు
సభ్యులు-4.70 లక్షలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని