logo

‘ముంపు’చూపు కరవు..

నిరుపేదలకు నీడ కల్పించాలనే సదాశయంతో ప్రభుత్వం రెండు పడకగదుల ఇళ్లకు శ్రీకారం చుట్టింది. నివాసయోగ్యమైన స్థలాలను కాదని చెరువుల చెంత, ముంపు ప్రాంతాల్లో పనులు చేపడుతున్నారు. ముందుచూపు లేక ఇష్టారాజ్యంగా కడుతున్న నిర్మాణాలతో

Published : 14 Aug 2022 03:09 IST

నివాసయోగ్యం కాని చోట రెండుపడక గదుల ఇళ్లు

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌

నిరుపేదలకు నీడ కల్పించాలనే సదాశయంతో ప్రభుత్వం రెండు పడకగదుల ఇళ్లకు శ్రీకారం చుట్టింది. నివాసయోగ్యమైన స్థలాలను కాదని చెరువుల చెంత, ముంపు ప్రాంతాల్లో పనులు చేపడుతున్నారు. ముందుచూపు లేక ఇష్టారాజ్యంగా కడుతున్న నిర్మాణాలతో భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉమ్మడి జిల్లాలో చేపట్టిన రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే నత్తనడకన సాగుతూ విమర్శల పాలవుతున్నాయి. ఏకంగా చెరువు సమీపంలో, శిఖం భూముల్లోనే వీటిని చేపడుతుండటంతో ఇప్పటికే చుట్టూ వరద చేరింది.

నత్తనడక పనుల వల్ల ఉమ్మడి జిల్లాలో రెండుపడక గదుల ఇళ్లను పంపిణీ చేయలేదు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో చాలాచోట్ల గుత్తేదారులు చేతులెత్తేస్తున్నారు. వివాదరహిత స్థలాలను ఎంపిక చేయాల్సిన అధికారులు హడావుడిగా స్థలాలను చూడటంతో కొన్నిచోట్ల యజమానులు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి. మరోవైపు కడుతున్నవి సైతం నాసిరకంగా.. నీటివనరుల వద్ద ఉండటంతో ఏమాత్రం నివాసయోగ్యం కాదని లబ్ధిదార్లు అభిప్రాయపడుతున్నారు.

పంపిణీపై సందిగ్ధం..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 5408 రెండు పడక గదుల పనులు కొనసాగుతున్నాయి. ఇందులో ఖానాపూర్‌లో ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. బెల్లంపల్లిలో ఇంకా గోడల పనులే నడుస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలోని రాజీవ్‌నగర్‌లో నిర్మాణ పనులు ముగిశాయి. మందమర్రిలో సైతం 380 ఇళ్ల పనులు తుది దశలో ఉన్నాయి. నిర్మల్‌ పట్టణంలో 1380 ఇళ్లను పూర్తి చేశారు. సోఫీనగర్‌లోని రెండు పడకగదుల నిర్మాణాలకు సిద్దాపూర్‌ వాగు జలాలతో ముప్పు పొంచి ఉందని ప్రజలు అంటున్నారు. నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి పంపిణీ ప్రక్రియ చేపట్టాలని నిరాశ్రయులు కోరుతున్నారు.

శిఖం భూమిలో..

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం శివారు ప్రాంతంలో 300 ఇళ్లను చెరువు శిఖం భూముల్లోనే నిర్మిస్తున్నారు. నీటి పారుదలశాఖ అధికారులు, రెవెన్యూ, పీఆర్‌ అధికారులు ఎవరూ ఈ విషయం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం పునాదుల దశకు పనులు చేరుకున్నాయి. భారీ వర్షాలకు చెరువు నిండితే ఇళ్లలోకి సులువుగా వరద చేరే అవకాశం ఉంది. సమీపంలోనే ప్రస్తుతం నీళ్లు ఉన్నాయి. రూ.కోట్ల వ్యయం నీటిపాలవుతందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

అర్ధాంతరంగా ఆగిన 125 ఇళ్లు

కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణ శివారులో 480 ఇళ్లు మంజూరు కాగా అధికారులు పనులు ప్రారంభించారు. ఇందులో 125 ఇళ్లకు సంబంధించి పునాదులు, పిల్లర్లు నిర్మించారు. ఓ వ్యక్తి ఈ స్థలం నాదేనని కోర్టుకు వెళ్లడంతో నిర్మాణాలు నాలుగేళ్ల నుంచి నిలిచిపోయాయి. పునాదుల కోసమే రూ.కోటి వరకు ఖర్చు చేశారు. మిగతా 355 ఇళ్ల పనులు తుది దశలో ఉన్నాయి.

చెరువుల చెంత.. వరదొస్తే చింత

ఆదిలాబాద్‌ జిల్లా కేఆర్కే కాలనీలో 980 ఇళ్లను నిర్మించారు. పనులు తుది దశలో ఉన్నాయి. పక్కనే చెరువు ఉంది. ఇటీవల వర్షాలకు ఇళ్ల చుట్టూ చెరువు నీళ్లు చేరాయి. భారీ వర్షాలు పడితే ఎలా అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. నార్నూర్‌ మండలం గాదిగూడ సమీపంలో సైతం వాగు పక్కనే 25 ఇళ్లు పూర్తి చేశారు. వర్షాలకు వరదంతా ఇళ్లలోకి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని