logo

ఎగిరిన పతాకం..విరబూసిన అక్షరం

స్వాతంత్య్రం సిద్ధించిన ప్రారంభంలో ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యత శాతం ఐదు లోపే... కానీ రోజురోజుకు చోటు చేసుకుంటున్న మార్పులు..విద్యావ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా ప్రస్తుతం అరవై శాతం ఉంది..75 వసంతాల్లో

Published : 14 Aug 2022 03:09 IST

దండేపల్లి, మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్‌టుడే

స్వాతంత్య్రం సిద్ధించిన ప్రారంభంలో ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యత శాతం ఐదు లోపే... కానీ రోజురోజుకు చోటు చేసుకుంటున్న మార్పులు..విద్యావ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా ప్రస్తుతం అరవై శాతం ఉంది..75 వసంతాల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ పలు రంగాల్లో అభివృద్ధి సాధించటమే కాకుండా విద్యారంగంలోనూ గణనీయమైన మార్పులు సాధించింది. ఇక్కడ విద్యను అభ్యసించిన విద్యార్థులు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు.

ప్రాథమిక స్థాయి నుంచి కళాశాలల వరకు పురోగతిలో...

చదువు ఆవశ్యతను గుర్తించడంతో రోజురోజుకు విద్యార్థుల నమోదు పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో అన్ని యాజమాన్యాల కింద 4,822 పాఠశాలలు ఉండగా 4.12 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారు.

* ఇరవై ఏళ్ల కిందట ఉమ్మడి జిల్లాలో కనీసం పదుల స్థానంలో కూడా ఇంటర్మీడియట్‌ కళాశాలలు లేవు...కాని ప్రస్తుతం ప్రభుత్వ, బీసీ, మైనార్టీ, కేజీబీవీ, ఆదర్శ, ఎస్సీ, ఎస్టీ, సాంఘిక సంక్షేమ శాఖల పరిధిలో 137 కళాశాలలతో పాటు ...66 ప్రైవేటు కళాశాలలున్నాయి.

* ఆదిలాబాద్‌ జిల్లాలో 34, నిర్మల్‌లో 35, కుమురంభీమ్‌లో 36, మంచిర్యాలలో 32 ప్రభుత్వ కళాశాలలుండగా...60 వేల మంది విద్యను అభ్యసిస్తున్నారు.

* డిగ్రీ విద్యను అభ్యసించేందుకు ఆదిలాబాద్‌లో 3, కుమురంభీంలో 1, మంచిర్యాలలో 4, నిర్మల్‌ జిల్లాలో 3 ప్రభుత్వ కళాశాలలున్నాయి.

ఆర్జీయూకేటీ మన దగ్గరే...

బాసరలోని కళాశాల

రాష్ట్రస్థాయిలో విద్యార్థులకు ఉత్తమ ఇంజినీరింగ్‌ విద్యను అందజేసేందుకు ఏర్పాటు చేసిన ఆర్జీయూకేటీ (ట్రిపుల్‌ ఐటీ) నిర్మల్‌ జిల్లాలోని బాసరలో ఉంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన 8 వేల మంది ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు.

సాంకేతిక విద్యలో ముందంజ..

బెల్లంపల్లిలోని పాలిటెక్నిక్‌ కళాశాల

ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్‌లో 2, నిర్మల్‌లో 1, మంచిర్యాలలో ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఉండగా మంచిర్యాలలో మూడు ప్రైవేటు కళాశాలలున్నాయి. ఇందులో వివిధ డిప్లొమా సాంకేతిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు 17 ఐటీఐ కళాశాలలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి మంచిర్యాల జిల్లాలో 9, ఆదిలాబాద్‌లో 4, నిర్మల్‌లో 3, కుమురంభీంలో ఒక కళాశాల ఉంది.

వైద్య విద్యకు బాసట..

ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ కళాశాల

వైద్యవిద్య చదివేందుకు ఉమ్మడి జిల్లా కేంద్రంలో రిమ్స్‌ కళాశాలను ఏర్పాటు చేశారు.. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన 500 పైచిలుకు విద్యార్థులు ఇక్కడ వైద్య విద్య అభ్యసిస్తున్నారు. వైద్యకళాశాలతోపాటు సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది. మంచిర్యాలలో ఈ ఏడాది వైద్య కళాశాలతో నర్సింగ్‌ కళాశాల ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది కుమురం భీం జిల్లాలో ప్రారంభం కానుంది. నిర్మల్‌కు కూడా వైద్యకళాశాలను ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది.దీంతో నాలుగుజిల్లాల్లో నాలుగు కళాశాలు వచ్చినట్టే.

అక్షర ఉషస్సు..

అక్షరాస్యతపరంగా చూస్తే ఉమ్మడి జిల్లాలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. 1951 జనాభా లెక్కల ప్రకారం ఆరేళ్ల పిల్లలను మినహాయిస్తే అక్షరాస్యత శాతం 10శాతం లోపు ఉండేది. పాఠశాలలు అభివృద్ధి చెంది... పిల్లలందరు బడికి వెళ్తున్నా.. ఇంకా చాలా మంది వయోజనులు నిరక్షరాస్యులుగానే ఉన్నారు. అయితే అందరిని అక్షరాస్యులు చేసే ఉద్దేశంతో ప్రభుత్వాలు అక్షరజ్ఞానం, అక్షర భారతి, అక్షర సంక్రాంతి, సాక్షరభారత్‌, అమ్మానాన్నకు చదువు తదితర కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 60.575 కు చేరుకోవడం.. వయోజనుల అక్షరాస్యత పెంపులో గణనీయమైన మార్పులు సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని