logo

తిరంగా.. తొలిసారి ఎగరంగ..!

ఈ పల్లెల్లో ఇప్పటివరకు జాతీయ జెండా ఎగురలేదంటే ఆశ్చర్యంగా ఉంది కదు.. స్వాతంత్య్రం వచ్చిన 75 వసంతాలకు నేడా ఆ కుగ్రామాల్లో తొలిసారి జెండా రెపరెపలాడుతోంది..

Published : 14 Aug 2022 03:09 IST

ఆ ఊళ్లలో మొదటిసారి జాతీయ జెండా రెపరెపలు

మామడ, న్యూస్‌టుడే

పోచమ్మగూడెంలో జెండాకు వందనం చేస్తున్న స్థానికులు

ఈ పల్లెల్లో ఇప్పటివరకు జాతీయ జెండా ఎగురలేదంటే ఆశ్చర్యంగా ఉంది కదు.. స్వాతంత్య్రం వచ్చిన 75 వసంతాలకు నేడా ఆ కుగ్రామాల్లో తొలిసారి జెండా రెపరెపలాడుతోంది..

పోచమ్మగూడెంలో 70 సంవత్సరాల వృద్ధురాలు..

మామడ మండలం వాస్తాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని పోచమ్మగూడెంలో 14 నివాసాల్లో 40 మంది జనాభా ఉంటుంది. ఎన్నికలప్పుడు పార్టీలు పంపిణీ చేసిన జెండాలు తప్పితే జాతీయ పతాకం ఎప్పుడూ ఎగుర లేదు. అక్కడ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాలేవీ లేనందున ఆ అవసరం రాలేదు. ఇప్పుడు సర్పంచి సంతోష్‌, పంచాయతీ కార్యదర్శి మురళి ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా పోచమ్మ గూడెం వెళ్లి జెండాలు పంపిణీ చేయడంతో ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. గ్రామ కూడలిలో 70 సంవత్సరాల వృద్ధురాలు సిడాం లక్ష్మి చేత పతాకావిష్కరణ చేయించారు.

మల్కాపూర్‌లో జాతీయ జెండాలతో గ్రామస్థులు

మల్కాపూర్‌లో పండగ వాతావరణం..

తోటిగూడ పంచాయతీ అనుబంధ గ్రామం మల్కాపూర్‌ దట్టమైన అటవీ ప్రాంతంలోని 12 ఇళ్లలో 35 మంది వరకు జనాభా ఉంటుంది. ఆ ఊరికి దారి లేదు. వాగులు అడ్డుగా ఉంటాయి. ప్రభుత్వ పథకాలు చేరుతున్నా.. రవాణా సౌకర్యం లేక వెనకబాటు తనం కనిపిస్తుంది. సర్పంచి లంకుబాయి, లింగుపటేల్‌, పంచాయతీ కార్యదర్శి శివ మల్కాపూర్‌లో ఇంటింటికీ జెండా పంపిణీ చేయడంతో వారు చక్కగా ఇళ్లపై జాతీయ పతాకం కట్టి పండగలా జరుపుకొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని