logo

జాడలేని నిధులు.. పూర్తికాని భవనాలు..

ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల తహసీల్దార్‌ కార్యాలయాలకు అనుబంధంగా ధరణి రిజిస్ట్రేషన్‌ భవనాలను మంజూరు చేసింది. అయితే నిధులు లేక ఆశయం నీరుగారింది. ప్రభుత్వం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల

Published : 14 Aug 2022 03:09 IST

ప్రజలకు తప్పని ఇబ్బందులు

భైంసా పట్టణం, న్యూస్‌టుడే

ముథోల్‌లో ప్రారంభం కాని ధరణి రిజిస్ట్రేషన్‌ భవనం

ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల తహసీల్దార్‌ కార్యాలయాలకు అనుబంధంగా ధరణి రిజిస్ట్రేషన్‌ భవనాలను మంజూరు చేసింది. అయితే నిధులు లేక ఆశయం నీరుగారింది. ప్రభుత్వం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యత ప్రక్రియను సబ్‌రిజిస్ట్రార్ల నుంచి తప్పించి తహసీల్దార్లకు కట్టబెట్టింది. నాలుగేళ్లుగా (రెండు సంవత్సరాలు ఐఎల్‌ఆర్‌ఎమ్‌-ఇంటిగ్రేటెడ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ రికార్డ్‌ సిస్టం, 2020 నవంబరు నుంచి ధరణి)వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, దాన, తనఖా తదితర రిజిస్ట్రేషన్ల ప్రక్రియలన్నీ తహసీల్దారు కార్యాలయంలోనే కొంత స్థలం సర్దుబాటు చేసుకుని నిర్వహిస్తున్నారు. దీంతో తహసీల్దార్‌ కార్యాలయాల్లో స్థలభావ సమస్యలు ఎదుర్కొంటున్నారు. భూముల విలువ పెంచి రిజిస్ట్రేషన్ల ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకుంటున్న ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారికి కనీస సౌకర్యాలు కల్పించలేకపోతోంది. గదుల కొరత, పురాతన భవనాల్లో వర్షాకాలంలో ఊరవడం వంటి ఇబ్బందులతో సతమతమవుతున్న అధికారులకు, సందర్శకులకు ధరణి కార్యక్రమం అందులోనే చేపట్టడంతో సమస్య మరింత తీవ్రమయ్యింది. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే క్రయ విక్రయదార్లు, సాక్షులు సంఖ్య పెరిగింది.

కష్టంగా నిరీక్షణ

రోజుకు ఓ తహసీల్దార్‌ కార్యాలయంలో గరిష్ఠంగా 30 రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అమమతించగా అందుకు సుమారు 150-200మందిక వచ్చే అవకాశం ఉంటుంది. వారికి కూర్చునేందుకు స్థలం లేక కార్యాలయ ఆవరణలో ఎక్కడ పడితే అక్కడే నిరీక్షించాల్సి వస్తుంది. వానా, ఎండాకాలాల్లో చిన్న పిల్లలతో వచ్చే తల్లులు, గర్భిణులు, దివ్యాంగుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆన్‌లైన్‌, సర్వర్‌ సమస్యలు తలెత్తినపుడు గంటల తరబడి వేచి ఉండక తప్పదు. ఈ సమస్యను అధిగమించేందుకు రెండేళ్ల క్రితం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధరణి రిజిస్ట్రేషన్‌ భవనం నిర్మించేందుకు రూ.10 లక్షలు మంజూరు చేసింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కొన్ని మండలాల తహసీల్దార్లు గుత్తేదార్లను పురమాయించి వాటిని నిర్మించేందుకు ఉపక్రమించారు. మరికొందరు నిధులురాక సందేహించి పనులు చేపట్టలేదు. వారు అనుకున్నట్లుగానే నిధులు రాలేదు. దీంతో వాటి నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఇదంతా ఒకెత్తైతే రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారికి మరుగుదొడ్లు, మూత్రాశాలలు లేక అత్యవసరంగా ఒకటి, రెంటికి ఇబ్బందులు ఎందుర్కొంటున్నారు.

పూర్తయినవి రెండే

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్మల్‌ జిల్లాలోని కడెంలో మాత్రమే ధరణి భవనం పూర్తిచేశారు. మరొకటి ముథోల్‌లో నిర్మించినా ప్రారంభం కాలేదు. కుంటాలలో గోడలు, ఖానాపూర్‌లో పైకప్పువరకు నిర్మించి నిధులు రాక అర్ధాంతరంగా నిలిపివేశారు. భైంసాలో పునాధులు తవ్వించగా నిధులు జాడ లేక వాటిని పూడ్చివేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో ఇలాంటి సమస్యలు నెలకొనడంతో వాటి పరిస్థితి సందిగ్ధంగా మారింది.

నిధుల రాగానే పనులు ప్రారంభిస్తాం - రాంబాబు, అదనపు పాలనాధికారి, నిర్మల్‌

ప్రభుత్వం ధరణి భవనాల నిర్మాణానికి మంజూరి ఇచ్చిన మాట వాస్తవమే. నిధులు రాకనే నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచాయి. రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్నవారు నిర్ణీత సమయానికి వస్తే సరిపోతుంది. కార్యాలయానికి వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల్లో కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. నిధులు రాగానే నిర్మాణాలను చేపడతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని