logo

మారని తీరు.. అభ్యర్థుల బేజారు

జిల్లాలో ప్రభుత్వ మైనార్టీ గురుకులాల్లోని ఔట్‌ సోర్సింగ్‌లో భర్తీ చేయనున్న పలు అధ్యాపకుల పోస్టుల భర్తీ ప్రక్రియ వివాదాస్పదం అవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారని నిరుద్యోగులు, గతంలో చేసిన పొరపాట్లే మళ్లీ

Published : 14 Aug 2022 03:09 IST

మైనార్టీ గురుకులాల్లో పోస్టుల భర్తీ ప్రక్రియపై అనుమానాలు

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే

గురుకుల పాఠశాల భవనం

జిల్లాలో ప్రభుత్వ మైనార్టీ గురుకులాల్లోని ఔట్‌ సోర్సింగ్‌లో భర్తీ చేయనున్న పలు అధ్యాపకుల పోస్టుల భర్తీ ప్రక్రియ వివాదాస్పదం అవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారని నిరుద్యోగులు, గతంలో చేసిన పొరపాట్లే మళ్లీ చేస్తున్నారని వివిధ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. అందరికీ తెలియజేయాల్సిన వివరాల్లో గోప్యత పాటిస్తున్నారని, అర్హులకు పోస్టులు దక్కకుండా కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలకు అధికారుల తీరు బలం చేకూర్చుతోంది.

రెండురోజుల క్రితం కాగజ్‌నగర్‌ మండలం గన్నారం మైనార్టీ గురుకులం బాలుర-1 పీజీటీ సోషల్‌, కాగజ్‌నగర్‌ మండలంలోని కోయవాగు మైనార్టీ గురుకులంలో బాలుర-1 వృక్షశాస్త్రం ఔట్‌సోర్సింగ్‌ అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఆ గురుకులాల ప్రిన్సిపళ్లు దరఖాస్తులు ఆహ్వానిస్తూ పూర్తి వివరాలు లేకుండా ప్రకటన జారీ చేశారు. ఈ నెల 17వ తేదీ వరకు స్వీకరణ గడువు విధించారు.

ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను ఎంపిక చేయాలి. ప్రస్తుతం ప్రకటన కేవలం జిల్లాకే పరిమితమైంది. దీంతో ఇతరులకు తెలిసే అవకాశం తక్కువ. జిల్లా మైనార్టీ అధికారి ఆ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయాలి. కానీ కేవలం ప్రిన్సిపల్స్‌ ప్రకటించి, తమకు అనుకూలమైన అభ్యర్థులను భర్తీ చేసుకునే అవకాశం ఉందని టీపీటీఎఫ్‌(తెలంగాణ ప్రైవేట్‌ టీచర్స్‌ ఫోరం) ప్రతినిధి గులాబ్‌ ఆరోపించారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీవోనెం.4459 ప్రకారం జిల్లా పాలనాధికారి పర్యవేక్షణలోనే ప్రకటన జారీ చేసి అర్హులైన వారిని భర్తీ చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి. అయినప్పటికీ అది జిల్లాలో అమలు కావడం లేదు. సత్వరమే ఆ ప్రకటనను రద్దు చేసి జిల్లా పాలనాధికారి, జిల్లా మైనార్టీ అధికారుల పర్యవేక్షణలో ప్రకటన జారీ చేసి భర్తీ చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని నిరుద్యోగులు పేర్కొన్నారు.

అంతటా ఆరోపణలే..

ఆసిఫాబాద్‌ మైనార్టీ గురుకులంలోని ఇటీవలే ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో మూడు అధ్యాపకుల పోస్టులను భర్తీలోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తెలిసింది. ఈ ముగ్గురులో ఒకరు మంచిర్యాల, నిర్మల్‌ మరొకరు, నిజామాబాద్‌కు చెందినవారిని ఆ పోస్టుల్లో నియమించారు. మైనార్టీ గురుకులం బాలురలో ప్రిన్సిపల్‌ నియామకంలో కూడా నిబంధనలు పాటించలేదు. ఎలాంటి ప్రకటన జారీ చేయకుండానే ప్రిన్సిపల్‌ను కూడా భర్తీ చేసినట్లు ఆరోపణలున్నాయి.

చర్యలు తీసుకోవాలని వినతి

నిర్మల్‌ జిల్లా మైనార్టీ గురుకులాల్లోని పోస్టుల భర్తీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, సత్వరమే చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇటీవల ప్రభుత్వ కార్యదర్శి హైమద్‌ నదీంకు లేఖ రాశారు. జిల్లాలోని అన్ని గురుకులాల్లోని భర్తీ అయిన పోస్టులపై విచారణ చేపట్టి, అనర్హులను తొలగించాలని కోరారు. స్వయంగా మంత్రి ఆదేశించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్ఛు

అమలు కాని ఆదేశాలు..

ఏడాది క్రితం మైనార్టీ గురుకులం(గన్నారం)లో 11 ఔట్‌సోర్సింగ్‌ అధ్యాపకుల భర్తీలోనూ అక్రమాలు జరిగినట్లు పలువురు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ముందస్తుగానే భర్తీ చేసి ఆ తర్వాత నామమాత్రంగా హైదరాబాద్‌లో డెమో నిర్వహించి వారినే నియమించుకున్నారు. మైనార్టీ నేషనల్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో విచారణ జరపగా, భర్తీలో ఆక్రమాలు జరిగినట్లు విచారణలో తేలింది. ఫ్రిబవరి 10న విజిలెన్స్‌ చీఫ్‌ రామ్మోహన్‌రావు బృందం విచారణ చేపట్టారు. విచారణలోనూ అక్రమాలు జరిగినట్లు తేలగా, ఆ నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం వారే విధుల్లోనూ కొనసాగుతున్నారు.

మంత్రి ఐకే రెడ్డి పంపించిన విజ్ఞప్తి


తెల్లకాగితంపై పోస్టుల భర్తీకి ఇటీవల జారీ చేసిన ప్రకటన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని