logo

గుంటల పేరిట.. గంతలు..

చెన్నూరులో అసైన్డు భూముల దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ భూముల అమ్మకాలు, కొనుగోలు చేపడుతున్నారు. అసైన్డు భూముల అమ్మకం.. కొనుగోళ్లు చేయరాదనే నిబంధన ఉన్నా.. ఇక్కడ అమలు కావడం లేదు.

Published : 14 Aug 2022 03:09 IST

అసైన్డ్‌భూముల్లో ప్లాట్లుచేసి అమ్మకం

చెన్నూరు పట్టణం, న్యూస్‌టుడే

షెడ్డు నిర్మాణం చేపట్టేందుకు వేసిన బండరాళ్లు

చెన్నూరులో అసైన్డు భూముల దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ భూముల అమ్మకాలు, కొనుగోలు చేపడుతున్నారు. అసైన్డు భూముల అమ్మకం.. కొనుగోళ్లు చేయరాదనే నిబంధన ఉన్నా.. ఇక్కడ అమలు కావడం లేదు. రాజకీయ నాయకుల అండతో కొందరు స్థిరాస్థి వ్యాపారులు ఎకరాల కొద్దీ భూములను కొనుగోలు చేసి ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారు. ఈ భూదందా వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

తక్కువ ధరలో కొనుగోలు చేస్తూ..

అసైన్డ్‌ భూములు కొనడం, అమ్మటం చట్టప్రకారం నేరం. వాటిల్లో శాశ్వత నిర్మాణాలు చేపడితే తీవ్ర నేరంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటారు. చెన్నూరులో మాత్రం వీటిని అధికారులు మామూలుగానే తీసుకోవడంతో భూముల దందా జోరుగా సాగుతోంది. చెన్నూరు పురపాలికగా రూపాంతరం చెందడం, 63వ జాతీయ రహదారి నిర్మాణం పూర్తై రాకపోకలు ప్రారంభం కావడంతో భూముల ధరలు బాగా పెరిగాయి. దీంతో కొందరు స్థిరాస్తి వ్యాపారులు ఏకంగా ప్రభుత్వ భూములపై కన్నేసి కొనుగోలు, అమ్మకాలు చేపడుతున్నారు. భూములను కాగితాలపై గుంటల చొప్పున ప్లాట్లుగా మార్చి లక్షల్లో విక్రయిస్తూ భారీగా లబ్ధి పొందుతున్నారు.

సాగు చేయకుంటే.. స్వాధీనం చేసుకుంటారని..

చెన్నూరు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములను గతంలో అప్పటి ప్రభుత్వం చాలామంది ఎస్సీలకు సాగు నిమిత్తం పంపిణీ చేసింది. అందులో కొందరు రైతులు భూములను సాగు చేసుకోగా మరికొందరు బీడుగా వదిలేశారు. ఆ భూములన్నీ రెవెన్యూ రికార్డుల్లో వారిపేరునే ఉన్నాయి. ఇటీవల కాలంలో పట్టాభూముల ధరలు పెరగడంతో కొందరు స్థిరాస్థి వ్యాపారులు అసైన్డుభూముల దందాను ప్రారంభించారు. అమాయక రైతుల అవసరాలను ఆసరాగా చేసుకోవడంతో పాటు వారిని భయాందోళనకు గురిచేస్తున్నారు. భూములు బీడుగా ఉంటే ప్రభుత్వ అవసరాలకు తిరిగి స్వాధీనం చేసుకుంటారని వారిని భయపెడుతూన్నారు. ఈ విషయంలో దళారులు రంగప్రవేశం చేసి రైతులు భూములను విక్రయించేలా చేస్తున్నారు.

కాగితాలపైనే వెంచర్‌ ఏర్పాటు...

చెన్నూరులోని గెర్రెకాలనీ, లంబాడిపల్లికి వెళ్లే మార్గంలో సర్వేనెంబర్లు 858, 859, 869, 1046, 1047, 1048లలో ఉన్న అసైన్డు భూములను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. కొనుగోలు చేసిన వ్యక్తులు సిమెంటు స్తంభాలతో హద్దులను ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు దొడ్డిదారిన ఇంటినెంబరు పొంది కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు. మరికొందరు యథేచ్ఛగా షెడ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. ఇదంతా బహిరంగంగానే సాగుతున్నా.. పురపాలిక, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. ఈ అక్రమ వ్యవహారంతో కొందరు ప్రజాప్రతినిధులు, ఓ అధికారి భారీగా దండు కొంటున్నట్లు సమాచారం. ●

చెన్నూరు పట్టణ సమీపంలోని లంబాడిపల్లికి వెళ్లే మార్గంలో సర్వే నంబరు 1046, 1047, 1048 (బై నంబర్లు ఉన్నాయి)లో ఉన్న అసైన్డు భూమిని స్థిరాస్తి వ్యాపారులు కొనుగోలు చేశారు. అందులో గుంటల చొప్పున ప్లాట్లుగా మార్చి విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యక్తులు సిమెంటు స్తంభాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇందులో శాశ్వత నిర్మాణాలను చేపడుతున్న సమయంలో దొడ్డిదారిన అనుమతులు కోసం ప్రయత్నం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని