logo

పులొచ్చింది మామో..!

చెన్నూరు అటవీ సబ్‌ డివిజన్‌ పరిధిలోని కోటపల్లి అడవుల్లో కొత్త పులి రాకతో మళ్లీ అలజడి మొదలైంది. పశువులను హతమారుస్తూ హల్‌చల్‌ చేస్తుండటంతో సమీప గ్రామాల ప్రజల్లో మరోసారి భయం పట్టుకుంది. గత ఏడు సంవత్సరాలుగా

Updated : 14 Aug 2022 04:32 IST

సీసీ కెమెరాకు చిక్కిన పులి ( దాచినచిత్రం)

కోటపల్లి, న్యూస్‌టుడే: చెన్నూరు అటవీ సబ్‌ డివిజన్‌ పరిధిలోని కోటపల్లి అడవుల్లో కొత్త పులి రాకతో మళ్లీ అలజడి మొదలైంది. పశువులను హతమారుస్తూ హల్‌చల్‌ చేస్తుండటంతో సమీప గ్రామాల ప్రజల్లో మరోసారి భయం పట్టుకుంది. గత ఏడు సంవత్సరాలుగా మహారాష్ట్రలోని తడోబా అడవుల నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మీదుగా ఈ ప్రాంతానికి రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో కోటపల్లి మండలం పిన్నారం అడవుల్లో 2016లో వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి ఓ పెద్దపులి మృత్యువాత పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అప్పటి నుంచి పులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిన అటవీశాఖ వాటికి అనువుగా వాతావరణం కల్పిస్తున్నారు. గతంలో ఈ అడవుల్లో కే4 పులితో పాటు జే1, ఎస్‌8 నామకరణంతో కూడిన ఇతరత్రా పులులను వాటి అడుగుజాడల ఆధారంగా అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం వాటి కదలికలు అంతగా లేకపోవడంతో వివిధ ప్రాంతాలకు తరలి పోయాయని భావిస్తున్న తరుణంలో.. గత 20 రోజుల నుంచి తూర్పు ప్రాంతంలో సంచరిస్తున్న ఓ పులితో మరోసారి అలజడి రేకెత్తింది. మహారాష్ట్ర నుంచి ప్రాణహిత మీదుగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి, నీల్వాయి రేంజ్‌ పరిధిలోని వెంచపల్లి అడవుల్లోకి సదరు పులి ప్రవేశించింది. బొప్పారం సమీపంలోని అడవుల్లో మేతకు వచ్చిన ఓ మేకపై దాడిచేయడంతో కొత్త పులి కదలికలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం నాలుగు రోజులకే ఎడగట్ట అడవుల్లో ఎద్దును హతమార్చడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా ఎదుల్లబంధం గ్రామానికి చెందిన ఎదుల సతీష్‌, లచ్చయ్య అనే వ్యక్తులకు చెందిన ఆవు, దూడను హతమార్చడంతో కొత్త పులి ఇదే ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. వెంచపల్లి మొదలు, బొప్పారం, ఎడగట్ట, పిన్నారం, లింగన్నపేట్‌, సిర్సా, అర్జునగుట్ట తదితర శివారు ప్రాంతాల్లో పులికదలికలు కనిపిస్తుండటంతో అటవీ అధికారులు ఈ ప్రాంతంపైనే దృష్టిసారించి పులికి ఎలాంటి హాని తలపెట్టవద్దంటూ ఆయా గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని