logo

స్టేషన్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

పట్టణంలోని గ్రామీణ పోలీసు స్టేషన్‌ ఎదుట రహదారిపై మల్లేష్‌రెడ్డి అనే రైతు శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు వెంటనే అతడిని ప్రాంతీయ అసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన

Published : 14 Aug 2022 03:09 IST

భూతగాదాలే కారణం

భైంసా, న్యూస్‌టుడే : పట్టణంలోని గ్రామీణ పోలీసు స్టేషన్‌ ఎదుట రహదారిపై మల్లేష్‌రెడ్డి అనే రైతు శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు వెంటనే అతడిని ప్రాంతీయ అసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్సకోసం నిజామాబాద్‌కు పంపించారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. భైంసా మండలం కోతల్‌గాం గ్రామానికి చెందిన సామల మల్లేశ్‌రెడ్డి భార్య శైలజ పేరిట గ్రామ శివారులో సర్వేనంబరు 89/ఆ లో 1.29 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. ఆ భూమి తమదని రాయిటి చంద్రశేఖర్‌రెడ్డి బంధువులు గొడవకు దిగారు. ఈ విషయమై శైలజ రెండు నెలల క్రితం గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూ తగాదా కోర్టుకు చేరింది. ఇది ఇలా ఉండగా మల్లేశ్‌రెడ్డి, శైలజ పేరిట ఉన్న మరో 6.31 ఎకరాల భూమిలో పత్తి పంట సాగు చేశారు. శనివారం ఉదయం పంటను చూసేందుకు వెళ్లిన మల్లేశ్‌రెడ్డికి చేను మొత్తం దున్ని పంట చెరిపేసి ఉండడం కనిపించింది. దీంతో చంద్రశేఖర్‌రెడ్డి మళ్లీ తనపై కక్ష సాధింపు కోసం పత్తిపంట నాశనం చేశారని ఆరోపిస్తూ వెంటనే గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు నెలల క్రితం జరిగిన ఘటనపై ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీంతో వాళ్లే మళ్లీ తమ భూమిని దున్నేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా తనకు న్యాయం జరగదని భావించి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ఒడిగట్టారని భార్య శైలజ రోదించింది. ఈ విషయమై ఎస్సై శ్రీకాంత్‌ను వివరణ కోరగా.. రెండు నెలల క్రితం భూ తగాదాపై శైలజ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని తెలిపారు. తాజాగా జరిగిన పంట నాశనం ఘటనపై ఫిర్యాదు వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని చెప్పాం. పాత భూతగాదా నడుస్తోంది. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని