logo

‘నిర్మల’ శోభితం.. అభివృద్ధి పథం

స్వాతంత్య్రం సాధించిన 75 వసంతాల్లో జిల్లా ప్రస్థానం ప్రగతి పంథాల్లో సాగుతోంది. వజ్రోత్సవ వేళ.. అన్ని రంగాల్లో అభివృద్ధిని అక్కున చేర్చుకుంటోంది. పల్లెల్లో ప్రగతి బాటలు కనిపిస్తున్నాయి. పట్టణాల్లో వికాసం విరజిల్లుతోంది. పాలనా సౌలభ్యం కోసం జరుగుతున్న వికేంద్రీకరణ ఫలాన్ని అందిస్తోంది.

Published : 15 Aug 2022 05:26 IST

అన్ని రంగాల్లో అనూహ్య మార్పులు
నిర్మల్‌, న్యూస్‌టుడే


సెంట్రల్‌ విద్యుత్తు స్తంభాలకు ఎల్‌ఈడీ వెలుగులు

స్వాతంత్య్రం సాధించిన 75 వసంతాల్లో జిల్లా ప్రస్థానం ప్రగతి పంథాల్లో సాగుతోంది. వజ్రోత్సవ వేళ.. అన్ని రంగాల్లో అభివృద్ధిని అక్కున చేర్చుకుంటోంది. పల్లెల్లో ప్రగతి బాటలు కనిపిస్తున్నాయి. పట్టణాల్లో వికాసం విరజిల్లుతోంది. పాలనా సౌలభ్యం కోసం జరుగుతున్న వికేంద్రీకరణ ఫలాన్ని అందిస్తోంది. ప్రజల మనుగడకు అవసరమైన మార్పు, కూర్పుల మేళవింపుతో పురోగతిలో పరుగులు తీస్తోంది. అంచెలంచెలుగా జిల్లా ఖ్యాతి అభివృద్థి పథంలో పయనిస్తోంది. 

1947 స్వాతంత్య్రం వచ్చే సమయానికి హైదరాబాద్‌ సంస్థాన్‌లో ఉంది. అప్పట్లోనే ఆనాటి రాజుల ద్వారా ఇక్కడి నుంచి చుట్టు పక్కల ప్రాంతాలకు పరిపాలన అందేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2016లో జిల్లాల పునర్విభజనలో భాగంగా నిర్మల్‌ కొత్త జిల్లాగా ఏర్పడింది. రెండు డివిజన్‌ కేంద్రాలు, మూడు పట్టణాలు, 19 మండలాలతో పాలనా సౌలభ్యాన్ని పెంచుకుంది.


నిర్మల్‌ జిల్లా కేంద్రం

పాలన చేరువ..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటించింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌ జిల్లా నుంచి నిర్మల్‌ జిల్లాగా రూపుదిద్దుకుంది. వెంటనే నూతన జిల్లాలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని పరిపాలన మొదలుపెట్టారు. గతంలో సమస్యలు విన్నవించుకునేందుకు నిర్మల్‌ నుంచి 80, బాసర నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేంది. జిల్లా ఆవిర్భవించిన తర్వాత పరిపాలన చేరువ కావడంతోపాటు వివిధ సమస్యలకు విన్నవించుకునేందుకు అధికార యంత్రాగం దగ్గర్లోనే ఉండటంతో సత్వరమే పరిష్కారం అవుతున్నాయి. ఒక డివిజన్‌, రెండు పట్టణాలు 13 మండలాలతో ఉన్న జిల్లా రెండు డివిజన్లు (నిర్మల్‌, భైంసా), మూడు పట్టణాలు (నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌)లతోపాటు ఆరు మండలాలు (నిర్మల్‌ అర్బన్‌, సోన్‌, నర్సాపూర్‌(జి), బాసర, పెంబి, దస్తురాబాద్‌) కొత్తగా ఏర్పడ్డాయి. 240 పంచాయతీలు ఉండగా.. ప్రస్తుతం 396లో పాలన సాగుతోంది. ప్రతి మారుమూల గ్రామాల్లోనూ రోడ్ల సౌకర్యం, తాగునీటి వసతి, విద్యుత్తు సదుపాయం, పారిశుద్ధ్యం మెరుగు వంటి ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో జిల్లా ముందుకెళ్తోంది. 

విద్య బలోపేతం

ప్రభుత్వ పాఠశాలలోపాటు ప్రైవేటు పాఠశాలలు పెరిగాయి. కేజీ నుంచి పీజీ వరకు విద్యా సౌకర్యం అందుబాటులో ఉంది. పాల్‌టెక్నిక్‌ కళాశాల, అన్ని మండలాల్లో కేజీబీవీ పాఠశాలలు, బీసీ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బాలికల రెసిడెన్షియల్‌ విద్యాలయాలు ఏర్పాటు చేయడంతో నాణ్యమైన విద్య అందుతుంది. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో 1.44 లక్షల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు.


సాగునీటి వనరుల ఖిల్లా..

జిల్లా ఆరంభం నుంచి ముగిసేంతవరకు గోదారం తీరం.. వాగులు, నదులు, ప్రాజెక్టులతో సాగునీటి వనరుల ఖిల్లాగా పేరుంది. 75 ఏళ్ల వసంతాల్లో సాగునీరు-వ్యవసాయ వృద్ధి విషయంలో ఆదర్శంగా నిలుస్తోంది. మిషన్‌ భగీరథ పనులతో చెరువులు కొత్తరూపు సాక్షాత్కరించింది. సాగు పరిణామ క్రమంలో సాంకేతికత వచ్చి చేరింది. పశు, మత్స్య సంపద అనూహ్యంగా పెరిగింది. ఎత్తిపోతల పథకాలు బీడు భూములను సస్యశ్యామలం చేశాయి. స్వర్ణ, గడ్డెన్నవాగు, కడెం ప్రాజెక్టులతోపాటు ఎస్సారెస్పీ ద్వారా సరస్వతి కాలువ కింద వేలాది ఎకరాల భూముల్లో ధాన్య సిరులు కురిపిస్తున్నాయి.  


వైద్యం.. మరింత మెరుగు

జిల్లాలో ఇప్పటికే రెండు ప్రాంతీయ, మరో రెండు సామాజిక, 17 పీహెచ్‌సీలు, మూడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా.. కొత్తగా వైద్య కళాశాల మంజూరైంది. దీన్ని రూ. 166 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. ప్రథమ సంవత్సరం 100 సీట్లు కేటాయించనున్నారు. జిల్లా ఆసుపత్రిలో ఆధునిక ఉపకరణాలు అందుబాటులోకి రావడంతో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. జిల్లా, ప్రసూతి ఆసుపత్రులు ఎన్‌-క్వాష్‌, కాయకల్ప అవార్డులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచాయి. 106 ఉప కేంద్రాల్లోని 30 వాటిని వెల్‌నెల్‌ సెంటర్లుగా మార్చారు. నర్సాపూర్‌(జి), ముథోల్‌ ఆసుపత్రులు ఉన్నతీకరణ పొందాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని