logo

సరిలేరు ఈ కాలనీవాసులకెవ్వరూ

మనమంతా సుఖ సంతోషాలతో, స్వేచ్ఛా వాతావరణంలో ఉన్నామంటే అందులో క్రియాశీలకమైన పాత్రను పోషిస్తోంది దేశ రక్షణ విభాగం. సరిహద్దుల్లో ఎండనకా, వాననకా, చలనకా, శరీరం మంచుతో గడ్డలు కడుతున్నా.. ఇలా ఎన్నో కష్టాలనెదుర్కొంటూ

Published : 18 Aug 2022 04:13 IST

దేశ రక్షణ రంగంలో బంగల్‌పేట్‌ యువత..

నిర్మల్‌ అర్బన్‌, న్యూస్‌టుడే

విధి నిర్వహణలో సైనికులు

మనమంతా సుఖ సంతోషాలతో, స్వేచ్ఛా వాతావరణంలో ఉన్నామంటే అందులో క్రియాశీలకమైన పాత్రను పోషిస్తోంది దేశ రక్షణ విభాగం. సరిహద్దుల్లో ఎండనకా, వాననకా, చలనకా, శరీరం మంచుతో గడ్డలు కడుతున్నా.. ఇలా ఎన్నో కష్టాలనెదుర్కొంటూ నిత్యం పహారా కాస్తున్నారు సైనికులు. అలాంటి అరుదైన రంగమైన ఆర్మీలో ఒకే కాలనీకి చెందిన వారు అధికంగా ఉండడం విశేషం. ఒకరిని చూసి మరొకరు ఇలా మొత్తం సుమారు 38 మంది వివిధ కేటగిరీల్లో విధులు నిర్వర్తిస్తున్న ఘనత నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్‌ కాలనీవాసులకు దక్కుతోంది. సుమారు 22 ఏళ్ల క్రితం ప్రారంభమై నేటికీ కొనసాగుతోంది. వీరందరూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు. దేశ సేవలో తమవంతు బాధ్యతను నిర్వర్తించాలన్న పట్టుదల, కృషితో నిత్యం సాధన చేస్తూ తమ లక్ష్యాన్ని చేరుకొని దేశ భద్రతలో తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

బంగల్‌పేట్‌ కాలనీ​​​​​​​

కాలనీ : బంగల్‌పేట్‌

జనాభా : సుమారు 5 వేలు

ఓటర్లు : దాదాపు 3 వేలు

వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారు : వందకు పైగా..

రక్షణ విభాగంలో..: 38 మంది

వైద్య సేవల్లో..

వైద్య సేవలు చేస్తున్న సతీష్‌కుమార్‌

గన్నేరి మహేశ్వర్‌- లక్ష్మి దంపతుల కుమారుడు గన్నేరి సతీష్‌కుమార్‌ డిగ్రీ పూర్తి కాగానే 2012లో ఆర్మీలో ఉద్యోగం సంపాదించారు. సిపాయిగా ప్రారంభమైన ఆయన విధి నిర్వహణ ప్రస్తుతం నాయక్‌ హోదాలో పనిచేస్తున్నారు. వైద్య సేవల్లో ప్రత్యేక శిక్షణ తీసుకొని ఉదంపూర్‌ కమాండ్‌ ఆసుపత్రిలో, పంజాబ్‌లోని జలందర్‌ మిలిటరీ ఆసుపత్రిలో పనిచేసి, ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. రక్షణ రంగంలోనే వైద్య సేవలందించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

అరుదైన పురస్కారం..

బంగల్‌పేట్‌ కాలనీకి ఆనుకొని ఉన్న రాంరావుబాగ్‌కు చెందిన కోట్ల నరేశ్‌కు స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా అరుదైన పురస్కారం లభించింది. ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేసిన కోట్ల రాజేశ్వర్‌- భూదేవి దంపతుల కుమారుడు నరేశ్‌కు చిన్నప్పటి నుంచి రక్షణ రంగంలో పనిచేయాలన్న ఆశయం ఉండేది. దీంతో డిగ్రీ పూర్తి కాగానే 2015లో ఆర్మీలో చేరారు. సిపాయిగా చేరి అరుణాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌లలో పనిచేశారు. 2019- 22 వరకు జమ్మూలో రాష్ట్రీయ రైఫిల్స్‌ విభాగంలో, ప్రస్తుతం యునైటెడ్‌ నేషన్స్‌ మిషన్‌ డెమోక్రసీ రిపబ్లిక్‌ కాంగోలో నాయక్‌ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన సేవలకు గాను 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ మెడల్‌ పొందారు.

సిపాయిగా ప్రారంభమై హవల్దార్‌ వరకు..

కాళ్ల పోశెట్టి- వనజ దంపతుల కుమారుడు ప్రజోష్‌కుమార్‌ డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సమయంలో 2010లో ఆర్మీలో ఉద్యోగం సంపాదించారు. సిక్కిం, జమ్ముకశ్మీర్‌ తదితర ప్రాంతాల్లో సరిహద్దుల్లో సిపాయిగా ప్రారంభమైన ఈయన ప్రయాణం ప్రస్తుతం పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో హవాల్దార్‌ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు.

ప్రతి క్షణం అప్రమత్తంగా..

అమర్‌నాథ్‌లో ఇటీవల చేపట్టిన సహాయక చర్యల్లో భీమేశ్‌

రొక్కడి భీమన్న- కమల దంపతుల కుమారుడు రొక్కడి భీమేశ్‌ 2010లో ఆర్మీలో చేరారు. ప్రస్తుతం 44 ఆర్‌ఆర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ దేశ రక్షణలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల అమర్‌నాథ్‌ యాత్రలో జరిగిన ఘటనలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఈయన పలువురికి సహాయసహకారాలు అందించారు. చిన్నప్పటి నుంచి యూనిఫారం ధరించే ఉద్యోగం చేయాలన్న కాంక్ష ఆర్మీతో నేరవేరిందని, రక్షణ రంగంలో విధులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని