logo

వినిపించనుంది కొత్త కూత..!

రైల్వేశాఖకు సంబంధించిన న్యూ నార్త్‌ సౌత్‌ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌ డీఎఫ్‌సీ) రామగుండం, మణుగూరు మధ్య సరకు రవాణాకు రైలుమార్గం కోసం సర్వే చేపట్టింది. ప్రస్తుతం క్షేత్రస్థాయి సర్వే, మట్టినమూనాలు సేకరిస్తున్నారు. సర్వే నివేదిక ఆధారంగా రైల్వేశాఖ నిధుల మంజూరుపై నిర్ణయం తీసుకోనుంది.

Published : 03 Oct 2022 04:25 IST

చెన్నూరు మీదుగా రామగుండం - మణుగూరు రైల్వేలైనుకు సర్వే
మంచిర్యాల అర్బన్‌, న్యూస్‌టుడే

రైల్వేశాఖకు సంబంధించిన న్యూ నార్త్‌ సౌత్‌ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌ డీఎఫ్‌సీ) రామగుండం, మణుగూరు మధ్య సరకు రవాణాకు రైలుమార్గం కోసం సర్వే చేపట్టింది. ప్రస్తుతం క్షేత్రస్థాయి సర్వే, మట్టినమూనాలు సేకరిస్తున్నారు. సర్వే నివేదిక ఆధారంగా రైల్వేశాఖ నిధుల మంజూరుపై నిర్ణయం తీసుకోనుంది. దక్షిణమధ్య రైల్వేమార్గంలో ఇప్పటికే మంచిర్యాల మీదుగా పలు రైళ్ల రాకపోకలకు సౌకర్యం ఉంది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ముఖ్యనగరాలను వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. తాజాగా రామగుండం నుంచి చెన్నూరు మీదుగా మణుగూరుకు సరకు రవాణా రైల్వేమార్గం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ములుగు జిల్లాలో వంతెన నిర్మాణం కోసం మట్టి నమూనాలను సేకరించే ప్రక్రియ జరుగుతోంది. జిల్లాలో మంచిర్యాల నుంచి బల్లార్షా మార్గంలో రైలు సదుపాయం ఉండగా.. చెన్నూరు ప్రాంత వాసులకు సైతం రైలు కూత వినిపించొచ్చు. గతంలో రైల్వేశాఖ ప్రతిపాదించిన సరకు రవాణా కారిడార్‌లో భాగంగా ఈ రైల్వేలైనుపై అధికారులు దృష్టిసారిస్తున్నారు.

ములుగు జిల్లాలో మట్టి నమూనాలు సేకరిస్తున్న సిబ్బంది

దూరభారం తగ్గనుంది...
రామగుండం నుంచి మణుగూరుకు ప్రస్తుత రైల్వేమార్గం 289 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుత కొత్తలైను చెన్నూరు, భూపాలపల్లి, మేడారం, తాడ్వాయి మీదుగా 200 కిలోమీటర్లలోపే వస్తుంది. మణుగూరు నుంచి భద్రాచలం, కొత్తగూడెం, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు చేరుకునేందుకు సమయం ఆదా అవుతుంది. భవిష్యత్తులో ప్యాసింజర్‌ రైళ్లు నడిపితే ప్రయాణికులకు దూరభారం తగ్గుతుంది. సింగరేణి ప్రాంత కార్మికులు తరచూ రామగుండం, భూపాలపల్లి, మణుగూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. వారికి ప్రయోజనం కలుగుతుంది. కాళేశ్వరం, రామప్ప, మేడారం, లక్నవరం జలాశయం, బొగత జలపాతం తదితర పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు సులభంగా చేరుకోవడానికి వీలు ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని