logo

బాబోయ్‌.. 1945

1945.. ఈ అంకెలు చూడగానే లోకేశ్వరం మండలంలోని రాజురాకు చెందిన రైతులు ఆందోళన చెందుతారు. దీనికంతటికీ కారణం రెవెన్యూ అధికారులు చేసిన పొరపాటు. దశాబ్ద కాలానికి పైగా ఎంత మంది అధికారుల చుట్టూ తిరిగినా అంకె మారడం లేదు. వారి ఇబ్బందులు దూరమవడం లేదు..

Published : 03 Oct 2022 04:25 IST

అసైన్డ్‌ భూములు, డీ-1 పట్టాలకు ఒకే సర్వే నెంబరు కేటాయింపు
లోకేశ్వరం, న్యూస్‌టుడే

1945.. ఈ అంకెలు చూడగానే లోకేశ్వరం మండలంలోని రాజురాకు చెందిన రైతులు ఆందోళన చెందుతారు. దీనికంతటికీ కారణం రెవెన్యూ అధికారులు చేసిన పొరపాటు. దశాబ్ద కాలానికి పైగా ఎంత మంది అధికారుల చుట్టూ తిరిగినా అంకె మారడం లేదు. వారి ఇబ్బందులు దూరమవడం లేదు..


చేతిలో పట్టాదారు పాసుపుస్తకం చూపుతున్న ఈ రైతు లోలం లస్మన్న. ఈయనకు 1945/106 సర్వే నెంబరులో 1.00 ఎకరం భూమి కేటాయించారు. ఈయనకు ఇద్దరు కుమారులు. తన కుమారులకు భూమి పంపకం చేద్దామని మండల కార్యాలయానికి వెళ్లగా ఈ సర్వే నెంబరులోని భూమిని పేరు బదలాయింపు కుదరదని, అసైన్డ్‌గా నమోదైనందున తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు.  


ధరణితోనే అసలు సమస్య
రాజురా 1978లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన గ్రామం. పాత గ్రామంలో భూములు కోల్పోయిన రైతులకు డీ-1 పట్టాల రూపంలో కొత్త ఊరిలో భూములు అందజేశారు. ఆ సమయంలో ఎంత మందికి పట్టాలు జారీ చేశారో వారందరికీ ఒకే సర్వే నెంబరు(1945)ను కేటాయించారు. ఆ తర్వాత గ్రామంలోని సర్కారీ భూమిలో కొంత భాగాన్ని భూమి లేని నిరుపేదలకు అసైన్డ్‌ పేరున పట్టాలిచ్చారు. వీటికి కూడా 1945 సర్వే నెంబరులోనే కేటాయించారు. ఇప్పుడు గ్రామ పహాణీ చూస్తే 1945/1 నుంచి 1945/76 వరకు దాదాపు 100 ఎకరాలు 80 మంది రైతుల పేరున అసైన్డ్‌ భూమి ఉంటుంది. మళ్లీ 1945/15 నుంచి 1945/131 వరకు 512 ఎకరాలు దాదాపు 150 మందికి డీ-1 పట్టా రూపంలో అందజేసిన భూములుంటాయి. ఎక్కడైనా ఒక రైతుకు కేటాయించిన సర్వే నెంబరును మరో రైతుకు కేటాయించరు. ఇక్కడ మాత్రం అధికారులు ఇవేవీ పట్టనట్లు వ్యవహరించడం హాస్యాస్పదం. రెవెన్యూ అధికారుల పొరపాటు కారణంగా ప్రస్తుతం ఈ సర్వే నెంబర్లలోని భూములను కొనుగోలు చేసినా, విక్రయించినా ఆన్‌లైన్‌లో అసైన్డ్‌ భూమిగానే చూపడంతో పట్టా మార్పిడి కుదరడం లేదు. దాదాపు 40 ఏళ్ల కిందట కేటాయించిన భూములకు ధరణి రాకతో సమస్య మరింత జటిలమైంది.


న పట్టాదారు పాసుపుస్తకంలో 1945/15/అ2 సర్వే నెంబరులో 2.24 ఎకరాల పట్టా భూమి ఉందని చూపుతున్న ఈ రైతు మైస శ్రీనివాసు. ఇదే సర్వే నెంబరు 1945/15లో పుప్పాల లస్మన్నకు 1.00 ఎకరం అసైన్డ్‌ కేటాయించినట్లు ఉంది. తనఖా రుణం అవసరం ఉండి మైస శ్రీనివాసు బ్యాంకుకు వెళ్లగా పాసుపుస్తకంలో పట్టాభూమిగా ఉన్నా.. ధరణిలో ప్రభుత్వ భూమిగా ఉందని చెప్పి తిరస్కరిస్తున్నారు. తనది ప్రభుత్వం అందజేసిన పట్టా భూమి అని మండల తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి ధ్రువీకరణ పత్రం తెచ్చి ఇవ్వగా స్థానిక టీజీబీ మేనేజరుతో పాటు ఆర్‌ఎం, ఎస్‌ఎం స్థాయి అధికారులు సైతం తిప్పి పంపడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని