logo

పండగొక్కటే.. విధానాలే వేరు..!!

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. మినీ భారత్‌గా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. కొందరు చదువు కోసం, మరికొందరు ఉద్యోగాలు, ఇంకొందరు వ్యాపార నిమిత్తం ఇక్కడే స్థిరపడ్డారు.

Updated : 05 Oct 2022 05:19 IST

ఒక్కో రాష్ట్రంలో విభిన్నంగా దసరా ఉత్సవాలు
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ సాంస్కృతికం

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. మినీ భారత్‌గా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. కొందరు చదువు కోసం, మరికొందరు ఉద్యోగాలు, ఇంకొందరు వ్యాపార నిమిత్తం ఇక్కడే స్థిరపడ్డారు. వందల సంవత్సరాల కిందట వలసగా వచ్చిన వీరంతా పండగలు, వేడుకలు, ఇతరత్ర కార్యక్రమాలు కలిసి చేస్తుంటారు.. ఈ నేపథ్యంలో వీరంతా దసరా పండగను తమ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం నిర్వహించడం గురించి వివరిస్తూ ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.


దేవీ నవరాత్రోత్సవాల్లో క్షత్రియ పట్కరీ సమాజ్‌  

శ్రీసోమవంశీయ సహస్త్ర క్షత్రియ పట్కరీ సమాజ్‌ కర్ణాటకలోని హుబ్లీ, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరుతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. వీరు దేవీ నవరాత్రోత్సవాలను ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు. తొమ్మిది రోజులు ఉపవాసాలు ఉంటారు. నవమి రోజు మహాప్రసాదం వితరణ చేస్తారు. బంధువులు, మిత్రులను ఇంటికి ఆహ్వానిస్తారు. దసరా రోజు అంటే దశమి రోజు ఇంటి దేవుని మందిరంలో ప్రతిష్ఠించిన దేవీ ఘటస్థాపనకు ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. ఆ తర్వాత వాటిని నీటిలో నిమజ్జనం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొంటారు. గ్రామ శివారున ఉన్న జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు. జమ్మి ఆకులను ఇచ్చిపుచ్చుకుంటారు.


గుజరాతీలు పార్వతి దేవిని కొలుస్తారు

విజయదశమి రోజున గుజరాతీ సమాజ్‌ పార్వతి దేవిని కొలుస్తారు. ఇంటింటా శక్తి పూజ చేస్తారు. ఇంటి గోడల మీద త్రిశూలాన్ని, శక్తి ఆయుధాన్ని పసుపుతో గీసి పూజిస్తారు. పొలం నుంచి తీసుకొచ్చిన మట్టితో వేదిక తయారు చేస్తారు. అందులో గోధుమ విత్తనాలు చల్లుతారు. దానిపై మట్టి ఉండ పెడతారు. దానిని నీటితో నింపి వెండి నాణెం వేస్తారు. ఆ మట్టికుండను వారు దేవిగా భావిస్తారు. అష్టమి రోజున నిర్వహిస్తారు. దశమి రోజున నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత పౌర్ణమి వరకు జరిగే గర్బా ఉత్సవాల్లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు.


మరాఠివారి హారతికి ప్రాధాన్యం

జిల్లా సరిహద్దున మహారాష్ట్ర ఉండటంతో చాలామంది ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చదువు, ఉద్యోగం, వ్యాపారరీత్యా నివాసం ఉంటున్నారు. దసరా ఉత్సవాన్ని విజయానికి సంకేతంగా పరిగణిస్తారు. వేడుక రోజు జమ్మి ఆకులను ఇంటికి తీసుకొచ్చి గుమ్మం వద్ద నిలుస్తారు. వీరికి ఇంటిల్లిపాదితో పాటు మహిళలు వారు తీసుకొచ్చిన జమ్మి ఆకులను ఇంటిదేవుని వద్ద ఉంచి పూజ చేస్తారు. ఆ తర్వాత తులసి చెట్టు వద్ద పెట్టి పూజిస్తారు. హారతి పళ్లెంలో బంగారం, వెండితో పాటు జమ్మి ఆకులు పెట్టి గుమ్మం వద్ద నిలిచిన వారికి హారతి ఇస్తారు. ఆ తర్వాత ఇంట్లోకి అనుమతిస్తారు. కుటుంబ సభ్యులు జమ్మి ఆకులు ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రతి కార్యంలో విజయం చేకూరాలని పెద్దలు ఆశీర్వదిస్తారు.


రాజస్థానీలకు దాండియా నృత్యాలు ప్రత్యేకం

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను రాజస్థానీ సమాజ్‌ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. దసరా పండగ రాక ముందు నుంచే అంటే నెలరోజుల నుంచే ఆ సమాజ్‌లోని మహిళలు, యువతుల్లో సందడి నెలకొంటుంది. ప్రత్యేకంగా దాండియా నృత్యాన్ని నేర్చుకుంటారు. దుర్గాదేవి ప్రతిమను ప్రతిష్ఠించిన మండపాల వద్ద, వారి సమాజ్‌ భవనం ప్రాంగణంలో రోజూ రాత్రి విడతల వారీగా మహిళలు, యువతులు దాండియా నృత్యం చేస్తారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ నృత్యాన్ని చిన్నారుల నుంచి పండుటాకుల వరకు వచ్చి వీక్షిస్తుంటారు. విజయదశమి రోజున జమ్మి ఆకులను తీసుకొచ్చి పూర్వీకుల చిత్రపటాల వద్ద ఉంచి మొక్కుతారు. పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు.

Read latest Adilabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts