logo

‘స్వచ్ఛత’ను చాటి.. ర్యాంకుల్లో మేటి

స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌-2022 ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మంచి ఫలితాలను సాధించింది. పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడటంతో జిల్లాలు మంచి ర్యాంకులను దక్కించుకున్నాయి.

Published : 05 Oct 2022 04:36 IST

సర్వే ఫలితాల్లో మెరుగుపడిన జిల్లాలు
న్యూస్‌టుడే, మావల

స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌-2022 ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మంచి ఫలితాలను సాధించింది. పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడటంతో జిల్లాలు మంచి ర్యాంకులను దక్కించుకున్నాయి. దేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి ర్యాంకు సాధించగా జిల్లాలు సైతం అదేస్థాయిలో పనితీరును కనబరిచాయి. దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించిన 709 జిల్లాల్లో ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురం భీం, మంచిర్యాల జిల్లాలు టాప్‌-25లో నిలవటం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామస్థుల్లో అవగాహన పెరిగింది. స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తుండడంతో ఉత్తమ ఫలితాలను సాధించడానికి దోహదపడింది.


తాంసి మండలం సావర్గావ్‌ పంచాయతీలో ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కల్పిస్తున్న సిబ్బంది

పల్లెల్లో కేంద్ర బృందాల పరిశీలన
కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో స్వచ్ఛతను పెంపొందించేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఉత్తమ ఫలితాలను సాధించిన రాష్ట్రాలకు, జిల్లాలకు ర్యాంకులను కేటాయిస్తోంది. ఇంటింటికీ చెత్త సేకరణ, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పారిశుద్ధ్య పరిస్థితి, ఇంకుడు గుంతల నిర్మాణం, ప్లాస్టిక్‌ నిషేధం, సేంద్రియ ఎరువుల తయారీ, స్వచ్ఛతలో ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలను సర్వేలో పరిగణనలోకి తీసుకుంటారు. కేంద్రం నియమించిన బృందాలు ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రత్యక్షంగా పరిశీలించి, ప్రజల అభిప్రాయాలను తీసుకుని తయారుచేసిన నివేదికల ఆధారంగా మార్కులను, ర్యాంకులను నిర్ణయిస్తారు. ఈ సారి మొత్తం 1000 మార్కులకు సేవల పురోగతికి 350 మార్కులు, ప్రజాభిప్రాయ సేకరణకు 350, ప్రత్యక్ష పరిశీలనకు 300 మార్కులను కేటాయించారు.


ఇచ్చోడ మండలం ముఖరా(కె)లో శ్రమదానం చేస్తున్న గ్రామస్థులు

పెరిగిన ప్రజల భాగస్వామ్యం
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అత్యధిక మార్కులతో నిర్మల్‌ జిల్లా ముందంజలో నిలిచింది. తర్వాత కుమురం భీం, మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాలున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణలో, సేవల పురోగతిలో నాలుగు జిల్లాలు మెరుగైన స్కోరు సాధించాయి. నిర్మల్‌ జిల్లా సేవల పురోగతిలో 350 మార్కులు, ప్రత్యక్ష పరిశీలనలో 284, ప్రజాభిప్రాయ సేకరణలో 349 స్కోరు సాధించింది. కుమురం భీం జిల్లా సేవల్లో 343, పరిశీలనలో 283, ఫీడ్‌బ్యాక్‌లో 349 మార్కులు పొందింది. మంచిర్యాల జిల్లాకు 343, పరిశీలనలో 283, అభిప్రాయ సేకరణలో 350 మార్కులు వచ్చాయి. ఆదిలాబాద్‌ జిల్లా ప్రజాభిప్రాయంలో 350 స్కోరు సాధించగా, పరిశీలనలో 281, సేవల్లో 345 మార్కులను సాధించింది. నాలుగు జిల్లాలు అటు జాతీయ స్థాయిలో, ఇటు రాష్ట్రంలో మెరుగైన ఫలితాలను సాధించి ముందంజలో నిలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని