logo

ఎదుగుదలలోప నివారణలో.. ‘పోషకపాత్ర’

జిల్లాలో రోజు పనిచేస్తే కానీ పూటగడవని ఎన్నో కుటుంబాలున్నాయి. ఆ కుటుంబాల చిన్నారుల్లో ఎదుగుదల లోపాన్ని సరిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా వివిధ పథకాలను చేపడుతున్న విషయం తెలిసిందే.

Published : 05 Oct 2022 04:36 IST


కూరగాయలు, ఆహార దినుసులతో తయారు చేసిన ప్రదర్శన

భైంసా పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో రోజు పనిచేస్తే కానీ పూటగడవని ఎన్నో కుటుంబాలున్నాయి. ఆ కుటుంబాల చిన్నారుల్లో ఎదుగుదల లోపాన్ని సరిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా వివిధ పథకాలను చేపడుతున్న విషయం తెలిసిందే. అయినా సమస్య తీరడం లేదు. అతి తీవ్ర, తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు నిర్మల్‌ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ రాష్ట్రంలోనే మొదటి సారి ప్రత్యేక చొరవతో ‘పోషక పాత్ర’ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి డీఆర్డీవో అధికారులతో ఇటీవల ప్రారంభించారు.

సమస్యను గుర్తించి.. నామకరణం చేసి
నిర్మల్‌ జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ(డీఆర్డీవో) పీడీ విజయలక్ష్మి అదనంగా ఇంఛార్జి జిల్లా సంక్షేమాధికారిగా(డీడబ్ల్యూవో) బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత సెప్టెంబరులో నిర్వహించిన పోషణ మాసోత్సవంలో అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. చిన్నారుల్లో కొందరు అతి తీవ్ర(సామ్‌-సివియర్‌ అక్యుట్‌ మాల్‌ న్యూట్రిషన్‌), తీవ్ర(మామ్‌-మాడరేట్‌ అక్యుట్‌ మాల్‌ న్యూట్రిషన్‌) పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, వయసుకు తగిన ఎత్తు, బరువు పెరగటం లేదని గుర్తించారు. వారిలో లోపాన్ని సరిదిద్దేందుకు ప్రత్యేక చొరవ చూపాలని ఆమె నిర్ణయించారు. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోని జిల్లా, మండల, గ్రామ సమాఖ్య మహిళా సంఘాలతో ప్రత్యేకంగా చర్చించారు. రెండు శాఖల సమన్వయంతో వారికి మరింత అదనపు పోషకాహారాన్ని ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. తమ గ్రామ చిన్నారులను తామే బాగు చేయాలన్న బాధ్యత వారికి గుర్తుచేశారు. స్థానికంగా లభించే కూరగాయలు, ఆకుకూరలు, పాలు, కోడి మాసంతో ఆయా గ్రామ సమాఖ్యలు వాటితో ప్రతి రోజు ప్రత్యేక ఆహార పదార్థాలను తయారుచేసి ఇచ్చే గిన్నెడు ఆహారానికి ‘పోషక పాత్ర’ నామకరణం చేశారు.


లోపాన్ని సరిదిద్దేందుకే

- విజయలక్ష్మి, డీఆర్డీవో, ఇన్‌ఛార్జి డీడబ్ల్యూవో, నిర్మల్‌

నేటి బాలలే రేపటి పౌరులు. వారు బాల్యంలో ఆరోగ్యంగా ఎదిగితే భవిష్యత్తులో అన్ని విధాలుగా రాణిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందరు చిన్నారులకు ఒకే రకమైన కొలతలతో పోషకాహారాన్ని అందిస్తున్నా.. సామ్‌, మామ్‌ పిల్లలకు అది సరిపోవడం లేదని గుర్తించాం. సమస్య పరిష్కారానికి నా వంతుగా మహిళా సమాఖ్యల సహకారంతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాం. అందరి సహకారంతో విజయవంతం చేయాలన్నదే మా లక్ష్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని