logo

ప్రజావసరాలపై పట్టింపేది?

పట్టణ ప్రజలు ఏటా చెల్లించే వివిధ రకాల పన్నులతోనే మంచిర్యాల పురపాలక సంఘం పరిపాలన విభాగం నడుస్తోంది. చాలామంది ప్రజలు ప్రతి రోజు పన్నులు చెల్లించడానికి, వివిధ అవసరాల కోసం స్థానిక కార్యాలయానికి వస్తుంటారు.

Published : 05 Oct 2022 04:36 IST

బల్దియాలో మరుగుదొడ్లకు తాళాలు వేసిన వైనం
మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే


మంచిర్యాల మున్సిపల్‌ కార్యాలయంలో మరుగుదొడ్లకు వేసిన తాళం

పట్టణ ప్రజలు ఏటా చెల్లించే వివిధ రకాల పన్నులతోనే మంచిర్యాల పురపాలక సంఘం పరిపాలన విభాగం నడుస్తోంది. చాలామంది ప్రజలు ప్రతి రోజు పన్నులు చెల్లించడానికి, వివిధ అవసరాల కోసం స్థానిక కార్యాలయానికి వస్తుంటారు. అక్కడికి వచ్చే ప్రజలు అత్యవసరాల కోసం మలమూత్ర విసర్జన చేయడానికి కూడా మరుగుదొడ్లు పని చేయడం లేదు. పురుషుల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్డి చెడిపోగా, స్త్రీలకు ఉపయోగించే మరుగు దొడ్డికి తాళం వేస్తున్నారు. సిబ్బందికి అవసరం ఉన్నప్పుడు మాత్రమే తాళం మళ్లీ తెరుస్తున్నారు. ఆ కార్యాలయానికి వచ్చే మహిళలు, వృద్ధులు మలమూత్ర విసర్జనకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై మూడు నెలల కిందనే ఈనాడు దిన పత్రికలో కథనం ప్రచురితం చేసినా.. అధికారులకు  పట్టడంలేదు. ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు తీసుకునే ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం ఆ కార్యాలయంలో ఛైర్స్‌పర్సన్‌, కమిషనర్‌, ఇంజినీరు, పారిశుద్ద్య విభాగం అధికారుల గదులకు అటాచ్డ్‌ మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. గతంలో ప్రజల కోసం కార్యాలయం ముందు మెట్ల పక్కన నిర్మించిన రెండు మరుగుదొడ్లు చెడిపోతే వాటికి మరమ్మతులు చేయకుండా తాళాలు వేసి పెట్టడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ఇక్కడి మున్సిపల్‌ అధికారుల తీరు.. ప్రజలు చెల్లించే పన్నులతో అన్ని సౌకర్యాలు పొందుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యాలయానికి వచ్చే ప్రజల కోసం కనీసం మురుగుదొడ్లు, తాగునీటి వసతి కల్పించలేని దుస్థితి ఏర్పడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.


మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో పది రోజుల నుంచి తాగునీటి ఫ్రిజ్‌ చెడిపోయినా.. మరమ్మతులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. వివిధ అవసరాల కోసం వచ్చే ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు, నాయకులు మాత్రం మినరల్‌ వాటర్‌ తెప్పించుకొని తాగుతున్నారు. అధికారులు స్పందించి కార్యాలయంలో ఫ్రిజ్‌కు మరమ్మతులు చేసి తాగునీటి వసతి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.


మున్సిపల్‌ కార్యాలయం పక్కన గల దుకాణ సముదాయం వద్ద మహిళల కోసం మూడేళ్ల కింద రూ.లక్షలు ఖర్చు చేసి షీ టాయ్‌లెట్స్‌ నిర్మించారు. నిర్మించినప్పటి నుంచి పర్యవేక్షణ లేక నిరుపయోగంగా మారింది. అప్పుడు నాలుగు ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే నామమాత్రంగా పని చేస్తోంది. మిగతా మూడు చోట్ల పని చేయడంలేదు. కార్యాలయం పక్కన ఉన్న షీ టాయ్‌లెట్‌ను వినియోగంలోకి తెస్తే వ్యాపారులకు, కొనుగోలుదారులకు సౌకర్యంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని