logo

సూత్రధారులెవరో.. పాత్రధారులెందరో?

జిల్లాలో రాయితీ బియ్యం కుంభకోణంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని నెలలుగా దందా సాగుతున్నా.. జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

Published : 05 Oct 2022 04:36 IST

బియ్యం కుంభకోణంపై సర్వత్రా విమర్శలు
కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే

జిల్లాలో రాయితీ బియ్యం కుంభకోణంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని నెలలుగా దందా సాగుతున్నా.. జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇటీవల రాష్ట్ర ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు తనిఖీల్లో ఆసిఫాబాద్‌ మండల స్థాయి నిల్వ(ఎంఎల్‌ఎస్‌) పాయింట్‌లో 8,400 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టినట్లు వెల్లడైన విషయం తెలిసిందే. తక్షణమే ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌ఛార్జి గోపినాథ్‌ను సస్పెండ్‌ చేయగా, తాజాగా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి స్వామి కుమార్‌పై వేటు వేస్తూ పాలనాధికారి రాహుల్‌రాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఇంకా కొందరి హస్తమున్నట్లు తెలుస్తోంది.

ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌ఛార్జి నెలరోజుల క్రితమే కాగజ్‌నగర్‌కు బదిలీ కాగా, కాగజ్‌నగర్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌ఛార్జి ఆసిఫాబాద్‌కు బదిలీ అయ్యారు. నిల్వల లెక్కలు, పత్రాలు సక్రమంగా ఉంటేనే బాధ్యతలు స్వీకరిస్తానని బదిలీ అధికారి తేల్చి చెప్పడంతో ఇద్దరి మధ్య చర్చలు నడుస్తూనే వచ్చాయి. నిల్వల్లో కొంత మేర వ్యత్యాసాలు ఉన్నాయి. త్వరలో రికవరీ చేస్తామని చెప్పిన ఆసిఫాబాద్‌ అధికారి.. అలాగే కాలం వెల్లదీస్తున్నారు. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం. అప్పుడే లెక్కలు చూసి ఉంటే విషయం తెలిసేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రీడింగ్‌ పరిశీలిస్తే వెలుగులోకి..
సిర్పూర్‌(టి) మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఓ రైస్‌ మిల్లు యజమాని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు బియ్యం ఎగుమతి చేయకున్నా.. చేసినట్లు రికార్డులు సృష్టించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ రైస్‌ మిల్లులో ఏ నెలలో ఎన్ని క్వింటాళ్ల వడ్లు బియ్యంగా మార్చారు. ఈక్రమంలో మిల్లులో ఎంత విద్యుత్తు ఖర్చయ్యింది. విద్యుత్తు రీడింగ్‌, రికార్డులను పరిశీలిస్తే నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది. ఆ దిశగా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

ఇన్‌ఛార్జి ఫోన్‌కాల్స్‌పై సమగ్ర విచారణ
ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌ఛార్జికు సంబంధించిన చరవాణికి ఆ సమయంలో అధికారులు, రైస్‌ మిల్లు యజమానుల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌పై కూడా ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. సదరు ఇన్‌ఛార్జి సైతం ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలు ఉన్నాయంటూ.. తమ వద్ద అన్ని ఆధారాలున్నాయంటూ జిల్లాలోని ఇతర ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌ఛార్జులతో అన్నట్లు తెలుస్తోంది. రైస్‌ మిల్లుల నుంచి లోడ్‌ లారీలపై ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌ఛార్జి, క్వాలిటీ నివేదికలుంటాయి. ఆ నివేదికలను పరిశీలిస్తే మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉంది.

రూ.3 కోట్లు పంచుకున్నదెవరు?
ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌: ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్ గోదాంలోని బియ్యం మాయం వెనక అనేక మంది అధికారులు, కొందరు నేతలు కూడా ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ బియ్యం విలువ రూ.3 కోట్ల వరకు ఉంటుందని అధికారుల అంచనా.  రేషన్‌ డీలర్లకు బాస్‌గా చెప్పుకునే వ్యక్తి రెవెన్యూ అధికారులు, సస్పెండైన వ్యక్తికి మధ్యవర్తిగా ఉంటూ కాసుల బేరం నడిపినట్లు తెలుస్తోంది. ఓ జిల్లా అధికారి ఇంట్లోనే ఈ తంతంగం నడిచినట్లు విశ్వసనీయ సమాచారం. కేసు నుంచి బయటపడేస్తాను.. అడిగినంత ఇవ్వాలని సదరు డీలర్ల బాస్‌ చెప్పడం.. సదరు వ్యక్తి మొదటి విడతగా రూ.50 వేలు చెల్లించడం జరిగిపోయానని సమాచారం. కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి) మండలాల్లో ఉన్న రైస్‌మిల్లర్లు సైతం సదరు అధికారికి భారీగా ముడుపులు ముట్టజెప్పారని ప్రచారం సాగుతోంది. తమ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు వాకె ఉన్నతాధికారికి భారీగా డబ్బులు ఇచ్చేవారని తెలుస్తోంది. మిల్లర్ల నుంచి బియ్యం రాకుండానే వచ్చినట్లుగా రికార్డులు సృష్టించి 8 వేల క్వింటాళ్లకు పైగా బొక్కేసిన కేసులో పకడ్బందీగా, పక్షపాత రహితంగా విచారణ చేస్తేనే అసలు దొంగలు బయటపడే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని