logo

కదలని దస్త్రం.. అక్రమాలే సమస్తం

సమగ్ర భూ ప్రక్షాళన అనంతరం అనేక రకాల భూ సమస్యలతో అన్నదాతలు సతమతమవుతున్నారు. సర్వే నంబర్లు, విస్తీర్ణంలో వ్యత్యాసాలతో పాసు పుస్తకాలు పొందలేకపోతున్నారు. ధరణిలో కొన్ని ఐచ్ఛికాలు వచ్చినా అధికారులు చేయి తడపనిదే పని చేయడం లేదని కర్షకులు వాపోతున్నారు.

Published : 05 Oct 2022 04:36 IST

ఏళ్లుగా పెండింగ్‌లో ‘ధరణి’ దరఖాస్తులు
ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌

సమగ్ర భూ ప్రక్షాళన అనంతరం అనేక రకాల భూ సమస్యలతో అన్నదాతలు సతమతమవుతున్నారు. సర్వే నంబర్లు, విస్తీర్ణంలో వ్యత్యాసాలతో పాసు పుస్తకాలు పొందలేకపోతున్నారు. ధరణిలో కొన్ని ఐచ్ఛికాలు వచ్చినా అధికారులు చేయి తడపనిదే పని చేయడం లేదని కర్షకులు వాపోతున్నారు.

మీ సేవతో పాటు ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగానికి భూ సమస్యలకు సంబంధించి ఏన్నో అర్జీలు ఇస్తున్నా.. పరిష్కారం మాత్రం కావడం లేదు. డిజిటల్‌ సైన్‌ (డీఎస్‌) పెండింగ్‌తో సైతం ఆనేక మంది రైతులు కాస్తుల్లో ఉన్నా చేతికి పట్టాపాసు పుస్తకం రాక, ఐదు సంవత్సరాల నుంచి రైతుబంధు, రైతు బీమా పథకాలకు దూరమవుతున్నారు.

జిల్లావ్యాప్తంగా 20 వేల మంది..
ధరణి వెబ్‌సైట్లో పాసుపుస్తకాల సవరణకు ప్రభుత్వం ఇటీవలే కొన్ని ఐచ్ఛికాలు ఇచ్చింది. ఇందులో పేర్లు, చిరునామాలు, విస్తీర్ణం, భూమి స్వభావం తదితర అంశాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 20 వేల మంది రైతులు వివిధ భూ సమస్యలతో సతమతమవుతున్నారు. అన్నదాతలు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే అధికారులు సరిచేసి ధరణి వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాలి. కానీ బాధితులు మీ సేవ కేంద్రాల్లో అర్జీలు ఇస్తున్నా, సమస్యలన్నీ అలాగే పెండింగ్‌లో ఉంటున్నాయి. రెవెన్యూ కార్యాలయాలకు వెళితే మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారని.. ఇక్కడ ఎలాంటి పరిష్కారం లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ.లక్ష డిమాండ్‌..
కౌటాల మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తాతల కాలం నుంచి భూమిని సాగు చేస్తున్నారు. ఇతనికి లావుణి పట్టా ఉంది. మరో వ్యక్తి ఈ స్థలం నాదేనని కోర్టుకు వెళ్లాడు. పట్టా ఉన్న వ్యక్తి లావుణి పట్టా పత్రాలతో పాటు, స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఈ భూమికి సంబంధించిన పత్రాలు కోర్టులో అందించాల్సి ఉంటుంది. వీటిని అడగానికి వెళితే స్థానిక అధికారులు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.

ఏడాదిగా ప్రదక్షిణలు..
కౌటాల మండలానికి చెందిన మరో వ్యక్తి బాండ్‌ పేపర్‌ మీద రాసుకుని భూమి కొనుగోలు చేశాడు. పట్టా విక్రయించిన వ్యక్తి పేరు మీదే ఉంది. ఈ నేపథ్యంలో తన పేరు మీద పట్టా చేసుకోవాలని భావించిన ఈ రైతు వద్ద సైతం అధికారులు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లుగా బాధితుడు వాపోతున్నారు. సంవత్సరం నుంచి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

డబ్బులిస్తే అభయం..
కాగజ్‌నగర్‌ మండలానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి సైతం సరిహద్దు భూముల విషయంలో తరుచూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొందరు సర్వేయర్లు మా చేతిలో డబ్బులు పెట్టండి మేము చూసుకుంటామని సదరు ఉద్యోగికి అభయమిస్తున్నారు.

ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు.. : - రాజేశం, అదనపు పాలనాధికారి
భూ సమస్యలకు సంబంధించి రైతుతు ఏ అధికారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తాం.

4 ఏళ్లుగా తిరుగుతున్నా.. : - చౌదరి రంగయ్య, ముంజంపల్లి, బెజ్జూర్‌
నాకు సర్వే నంబర్‌ 71/67లో అయిదెకరాల భూమి ఉంది. 2018 నుంచి ఇప్పటి వరకు పాసుపుస్తకం రాలేదు. డీఎస్‌(డిజిటల్‌ సైన్‌) పెండింగ్‌ అని ఆన్‌లైన్‌లో చూపెడుతుంది. నాలుగు సంవత్సరాల నుంచి రైతుబంధు, బ్యాంకు రుణాలు రావడం లేదు. ఎన్నోసార్లు మీ సేవలో అర్జీలు సమర్పించినా సమస్య పరిష్కారం కావడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని