logo

రోగుల భోజనంలోనూ కక్కుర్తే!

ఆదిలాబాద్‌ పెద్దాసుపత్రి రిమ్స్‌లో రోగులకు అందించే అల్పాహారం, భోజనం నిధుల్లోనూ గుత్తేదారు స్వాహాపర్వం సాగుతోంది.

Published : 27 Nov 2022 03:43 IST

రిమ్స్‌ గుత్తేదారు నిర్వాకం

ఈటీవీ - ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ పెద్దాసుపత్రి రిమ్స్‌లో రోగులకు అందించే అల్పాహారం, భోజనం నిధుల్లోనూ గుత్తేదారు స్వాహాపర్వం సాగుతోంది. ప్రభుత్వం సదాశయంతో రోగులకు పౌష్టికాహారం అందించాలని సంకల్పిస్తే గుత్తేదారు సొంత లాభమే ప్రధానం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నిర్దేశించిన ఆహార పట్టికప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా వడ్డించడంతో రోగులకు ప్రాణసంకటంగా మారుతోంది. రిమ్స్‌ ఆవరణలోనే సత్యసాయి, అంబాడీబాబా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రోగుల బంధువులకు చేసే ఉచిత అన్నదానం ప్రశంసలు అందుకుంటుంటే, ప్రభుత్వం ఇచ్చే నిధులతో రోగులకు సరఫరా చేయాల్సిన భోజనంలో కోత విధిస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిమ్స్‌ 500 పడకల ఆసుపత్రి. ఇందులోని రోగికి ప్రతి రోజు ప్రభుత్వం నిర్దేశించిన పట్టిక ప్రకారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెట్టాలి.

రూ.60 లక్షలు విడుదల

రిమ్స్‌లోని రోగుల అల్పాహారం, భోజనానికి సంబంధించిన బిల్లు రూ.60 లక్షలను ప్రభుత్వం ఇటీవలే రెండు విడతల్లో విడుదల చేసింది. ప్రభుత్వం కేటాయించే ఈ నిధులపై రిమ్స్‌లోని అధికారులకు అజమాయిషీ లేదు. కేవలం ఎంతమంది రోగులకు, ఎన్ని రోజులు అల్పాహారం, భోజనం వడ్డించారనే దాన్ని నిర్ధారించడంతోనే సరిపోతోంది. ప్రభుత్వం ఇచ్చే బిల్లు నేరుగా ఖజానా శాఖకు చేరుతుంది. అక్కడి నుంచి గుత్తేదారు తీసుకోవడంతో వైద్యుల పాత్ర ఉండటం లేదు. వినియోగిస్తున్న నూనెలు, ఉప్పు, పప్పు కారంలాంటి వంటసామగ్రిని పరిశీలించే పద్ధతి అమలు కావడం లేదు. ఏరోజుకారోజు వినియోగించే వస్తువులను క్షుణ్ణంగా పరిశీలిస్తే గుత్తేదారు నిర్వాకం వెల్లడయ్యే అవకాశం ఉంది. అధికారులు సరైన పర్యవేక్షణ, నిఘా ఉంచితే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశాలున్నాయి.

ఇదీ ఆహారపట్టిక

మొదటి చిత్రం ప్రభుత్వం నిర్దేశించిన పట్టిక. రెండో చిత్రం గంపగుత్తగా ఒకే రకమైన భోజనానిది. నిబంధనల ప్రకారం ప్రతి రోజు ఉదయం 7.30 నుంచి 9 గంటల లోపు అల్పాహారం అందించాలి. ఆదివారం కిచిడి, సోమవారం ఇడ్లీ సాంబారు, మంగళవారం ఉప్మా, బుధవారం పోహా(అటుకులతో తయారు చేసినది), గురువారం సేమియా, శుక్రవారం ఇడ్లీ సాంబారు, శనివారం ఉప్మా అల్పాహారంగా ఇవ్వాలి. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 లోపల అన్నం 660 గ్రాములు, ఆకు కూర, పప్పు, ఒక ఉడకపెట్టిన గుడ్డు, అరటిపండు ఇవ్వాలి. రాత్రి భోజనం సాయంత్రం 6.30 నుంచి 7.30 మధ్య అన్నం, పప్పు, సాంబారు, రెండు రకాల కూరగాయల కర్రీ, ఉడకపెట్టిన గుడ్డు ఇవ్వాలి. పట్టికలోని వివరాలను అందరికీ తెలిసేలా వార్డుల్లోని గోడలపై ముద్రించినా గుత్తేదారు పట్టించుకోవడం లేదు. ఆసుపత్రిలో ఉండే ప్రతి రోగి అల్పాహారం, భోజనం కోసం ఇది వరకు ప్రభుత్వ రూ.40 చొప్పున ఇచ్చేది.  ఇటీవల ప్రభుత్వం రూ.80కి పెంచింది. క్షయ రోగులకు ఇది వరకున్న రూ.56 ఉన్న డబ్బుల కేటాయింపును రూ.112కి పెంచింది. ఆసుపత్రి విధుల్లో ఉన్న వైద్యుల భోజనం కోసం ఇది వరకు రూ.80 ఉంటే ఇప్పుడు రూ.160కి పెంచింది. చాలా మంది వైద్యులు అక్కడ భోజనమే చేయరు. ఆ బిల్లును సైతం గుత్తేదారు తీసుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ. ఆరోగ్యం బాగైతే చాలనుకునే రోగులు ఆసుపత్రిలో వడ్డించే అల్పాహారం, భోజనాలను పట్టించుకోకపోవడం గుత్తేదారుకు వరంగా మారింది.

Read latest Adilabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు