logo

ప్రాజెక్టు పూర్తయినా.. ప్రయోజనం సున్నా

జిల్లాలో చేపట్టిన కుమురం భీం ప్రాజెక్టు పూర్తయి పదిహేనేళ్లు దాటింది. కాలువల పనులు సైతం ముగిశాయి.

Published : 27 Nov 2022 03:43 IST

పదిహేనేళ్లుగా చుక్కనీరందని దుస్థితి

వాంకిడిలో సిమెంట్‌ లైనింగ్‌ లేని కాలువ

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే, వాంకిడి: జిల్లాలో చేపట్టిన కుమురం భీం ప్రాజెక్టు పూర్తయి పదిహేనేళ్లు దాటింది. కాలువల పనులు సైతం ముగిశాయి. కానీ అన్నదాతల చేన్లకు మాత్రం చుక్కనీరందడం లేదు. ఈ ఏడాది భారీ వర్షాలకు ఆనకట్ట చాలాచోట్ల పగుళ్లు తేలగా ఇంకా మరమ్మతుల ఊసెత్తడం లేదు. కాలువలకు సైతం అనేకచోట్ల గండ్లు పడి అధ్వానంగా మారాయి. మట్టి వేసి చదును చేసినా, సిమెంట్ లైనింగ్‌ వేయకపోవడంతో నీరు వదలలేని పరిస్థితి. కాలువల పరిస్థితి అలా ఉండగా.. యాసంగి పంటలకు సాగునీరు అందించాలని రైతులు రహదారులపై ధర్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పత్తి, కూరగాయల పంటలకు తడులు అందించాలని, కాలువ ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది సుదూరంలో ఉన్న వాగుల నుంచి పైప్‌లైన్లు వేసుకొని ఆయిల్‌ఇంజిన్లను పెట్టి తడులు పెడుతున్నారు.
2007లో కుమురం భీం జలాశయాన్ని పూర్తి చేశారు. ఎడమ ప్రధాన కాలువ ద్వారా 45 వేలు, కుడి కాలువ నుంచి 7 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యం. వాంకిడి మండలంలో ఎడమ కాలువకు ఈ ఏడాది ఆగస్టు నెలలో గండి పడింది. మట్టి వేసి చదును చేశారు. సిమెంటు లైనింగ్‌ వేయకపోవడంతో నీళ్లు వదిలితే మట్టి కట్ట కొట్టుకుపోతోంది. కుడి కాలువ పూర్తయి మూడేళ్లు దాటుతున్నా, ఇందులో ఒక్కసారి కూడా నీరు వదల్లేదు. మొదటి సంవత్సరం నుంచి కాలువ మొదలయ్యే ప్రాంతంలో కూలడం ప్రారంభమైంది. ఏటికేడు కాలువ కూలుతూ వస్తోంది.

రూ.30 కోట్లతో అంచనాలు...

కుడి కాలువ ప్రారంభ ప్రాంతంతో పాటు అనేక చోట్ల మట్టితో పూడుకుపోయింది. కొన్నిచోట్ల ధ్వంమమైపోయింది. మానిక్‌గూడ వద్ద కూలుతున్న ప్రాంతంలో సిమెంట్తో గోడ కట్టాలని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఇందుకు రూ.30 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. నిధుల విడుదలలో జాప్యం వల్ల పనులు ముందుకు సాగడం లేదు. ప్రాజెక్టు కాలువల పనులు పూర్తి స్థాయిలో కాకపోవడంతో పదిహేనేళ్లు దాటుతున్నా, నేటికి నిర్వహణ అంతా గుత్తేదారుకు చెందిన వ్యక్తులే చూస్తున్నారు.
పక్కనే కాలువ.. అయినా ఉపయోగం లేదు

ఉప్రె ప్రసాద్‌, కొసార- వాంకిడి

ఎడమ కాలువ పక్కనే నాకు అయిదెకరాల చేను ఉంది. ప్రస్తుతం పత్తి, కంది పంటలు సాగు చేశా. నీటి తడులు ఇద్దామంటే కాలువలో నీరు ఉండటం లేదు. పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.

సిమెంట్ లైనింగ్‌ పనులు చేయాలి

ఇనర్‌కర్‌ తిరుపతి, వాంకిడి

కాలువ తెగిపోయి సంవత్సరం దాటింది. నేటికి మరమ్మతులు పూర్తిస్థాయిలో చేయలేదు. ఈ సంవత్సరమైనా కాలువకు మరమ్మతులు చేస్తే యాసంగిలో నీళ్లు వచ్చే అవకాశం ఉంది. నాకున్న పది ఎకరాల్లో పత్తి వేశా. నీటి సౌకర్యం లేక ఇబ్బందులు తప్పడం లేదు.

మరమ్మతులు చేయాలని చెప్పాం..

గుణవంత్‌రావు, ఈఈ

కాలువకు సిమెంటు లైనింగ్‌తో మరమ్మతుల చేయాలని గుత్తేదారుకు చెప్పాం. పనులు చేసే విధంగా చూస్తాం. మట్టి కట్టకు ఇబ్బంది రాకుండా కొంతమేర నీరు వదులుతున్నాం. ఆనకట్ట మరమ్మతుల గురించి ఉన్నతాధికారులకు విన్నవించాం.

Read latest Adilabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని