logo

‘కడెం’ ఆధునికీకరణకు తొలి అడుగు

కడెం జలాశయం గత జులై మాసంలో వచ్చిన భారీ వరదలతో ముప్పు నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే.

Published : 01 Dec 2022 05:48 IST

 వరద తీవ్రత తెలుసుకునేలా.. గేట్లు త్వరగా పైకెత్తేలా యంత్రాలు
కడెం, న్యూస్‌టుడే

ప్రస్తుతం జలాశయంపై ఉన్న వరదను కొలిచే ఏకైక పరికరం

కడెం జలాశయం గత జులై మాసంలో వచ్చిన భారీ వరదలతో ముప్పు నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. ఎగువ నుంచి వచ్చే వరదలను లెక్కగట్టేందుకు సరైన పరికరాలు లేకపోవడం, జలాశయంలోకి ఎంత వరద వస్తుందో లెక్కించేందుకు పాతపద్ధతే ఉండడంతో ఏటా ఇక్కడి అధికారులకు ఇబ్బందిగా మారుతోంది. వరదగేట్లను ఎత్తేందుకు సైతం పాతపద్ధతే ఉండడంతో పరిశీలించిన ఉన్నతాధికారులు, నిపుణుల కమిటీ ఇక్కడ ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు. దీంతో ప్రభుత్వం వరదగేట్లను ఎత్తే అధునాతన యంత్రపరికరాలు, సీసీ కెమెరాలు, వరదనీటిని కొలిచి చెప్పే ట్రాన్స్‌మీటర్లు మంజూరు చేసింది. పాతదైన కడెం జలాశయాన్ని ఆధునికీకరించాలనే డిమాండుకు తొలి అడుగు పడింది.

ప్రతి గేటుకూ సీసీ కెమెరా..

జలాశయానికి వరదపోటు ఎక్కువగా ఉంటుందని, దీన్ని లెక్కించడం, బయటకు వదలడం ఇబ్బందికరంగా ఉంటోందని కొత్త విధానంతో నిర్వహించే స్కాడా (సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డాటా ఎక్విజేషన్‌) సిస్టంను మంజూరు చేశారు. వరదగేట్లను ఎత్తే ప్రక్రియ మొత్తం ఇక కొత్తగా ఏర్పాటుచేసే కంట్రోల్‌ రూం నుంచే పరిశీలించనున్నారు. కడెం నారాయణ రెడ్డి జలాశయానికి మొత్తం 18 వరదగేట్లు ఉన్నాయి. ఇందులో తొమ్మిది జర్మన్‌ సాంకేతిక గేట్లు, తొమ్మిది ఇండియన్‌ గేట్లున్నాయి. వీటిలో ఇండియన్‌ గేట్లను ఎత్తేందుకు ఒక్కోదానికి రెండు పరికరాలు, జర్మనీ గేట్లను ఎత్తేందుకు ఒక పరికరం చొప్పున బిగించనున్నారు. ప్రతి గేటుకు ఒక సీసీ కెమెరా బిగించి వీటి ద్వారా గేటు ఎంత ఎత్తారు, నీరెంత పోతోంది, గేటు పనితీరును కంట్రోల్‌రూం నుంచే పరిశీలిస్తారు. జలాశయంపైన వరదగేట్లకు ఒక్కో చివరన పెద్ద(బుల్లెట్‌) సీసీకెమెరాలను అమర్చనున్నారు. జలాశయం ఎగువభాగంలో వరదవచ్చే శిఖామని(చీక్‌మాన్‌) కడెం నది ప్రాంతాలను గుర్తించి అక్కడ సోలార్‌ ద్వారా నడిచే రాడార్‌లెవల్‌ టైప్‌ ట్రాన్స్‌మీటర్‌లను బిగిస్తారు. వీటిద్వారా వచ్చే సమాచారంతో వరద ఉద్ధృతిని ముందే తెలుసుకునే అవకాశముంటుంది.

కంట్రోల్‌రూం నుంచే పర్యవేక్షణ..

జలాశయం దిగువన సైతం వరదల సమయంలో నీరెంత బయటకు పోతోందో తెలిసేలా వంతెన సమీపంలో ఒక ట్రాన్స్‌మీటర్‌ను ఏర్పాటుచేస్తారు. ఇదివరకు ప్రాజెక్టుకు వచ్చే వరదను ఇక్కడ గేజ్‌రూంలో ఉండే బావిలో మీటరుద్వారనే లెక్కించేవారు. అది లెక్కించడం ఆలస్యం అవుతోందని కొత్తపద్ధతిలోనే లెక్కించేలా ఒక పరికరాన్ని గేజ్‌రూంలోను ఏర్పాటు చేస్తారు. ఇలా ఎక్కడికక్కడ పరికరాలను ఏర్పాటుచేసి వచ్చే వరదను ముందుగానే పసిగట్టి జలాశయంలో నీరెంత నిల్వ ఉంచాలి, ఎంత వదలాలి, వరదగేట్లను ఎన్నిఎత్తాలి, ఎంతమేర ఎత్తాలనేది కంట్రోల్‌రూం ద్వారానే నిర్ణయిస్తారు. కంట్రోల్‌ రూంను కడెం వరదగేట్ల చివరన ఉన్న జనరేటర్‌ గదికి సమీపంలో నిర్మిస్తామని అధికారులు పేర్కొన్నారు. కొత్తగా కడెంతోపాటు ఎస్సారెస్సీ, ఎల్‌ఎండీ ప్రాజెక్టుకు స్కాడా సిస్టంద్వార వరదగేట్లను నిర్వహించేందుకు ఎంపికచేశారు. కడెంకు టెండరుద్వార పనులను దక్కించుకున్న సంస్థ యంత్రాలను బిగించి అయిదేళ్లపాటు జలాశయం నిర్వహణను పర్యవేక్షించనుంది. యంత్రాలు బిగించే పనులను ఎమ్మెల్యే రేఖానాయక్‌ ప్రారంభించి కడెం మెరుగుపడేందుకు ఇది ఒక మెట్టు అని అభిప్రాయపడ్డారు.

నిర్వహణ మెరుగుపడుతుంది
- రాజశేఖర్‌ గౌడ్‌, ఈఈ కడెం

కడెం జలాశయం వరదగేట్ల నిర్వహణ ఇకపై సులభం అవుతుంది. ప్రతిగేటువద్ద ఒక సీసీ కెమెరా ఉంటుంది. ఎగువన, దిగువన వరదనీటి ప్రవాహాన్ని కొలిచే పరికరాలుంటాయి. ఇవన్నీ జలాశయం వద్ద ఉండే కంట్రోల్‌రూంకు అనుసంధానమవుతాయి. గేట్లను ఎత్తడం, ఇన్‌ఫ్లోను ఎప్పటికప్పుడు తెలుసుకుని అప్రమత్తం అయ్యేందుకు అవకాశముంటుంది. జలాశయం ఆధునికీకరణలో భాగమిది.

Read latest Adilabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని