logo

జనం తోడుగా.. ‘బండి’ నడవగా

జిల్లాలో ప్రజా సంగ్రామయాత్ర నాల్గవరోజు జన సందోహం మధ్య కొనసాగింది.. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణుల అండగా దండులాగా సాగింది.

Published : 02 Dec 2022 03:05 IST

ఉత్సాహంగా సాగిన ప్రజాసంగ్రామయాత్ర

నిర్మల్‌-భైంసా, న్యూస్‌టుడే

రైతులతో మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

జిల్లాలో ప్రజా సంగ్రామయాత్ర నాల్గవరోజు జన సందోహం మధ్య కొనసాగింది.. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణుల అండగా దండులాగా సాగింది. అడుగడుగునా నీరా‘జనం’ పట్టడంతో శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. గురువారం కుంటాల మండలం లింబా(బి), సేవాలాల్‌తాండ, కుంటాల, అంబకంటి గ్రామాల మీదుగా బండి సంజయ్‌ యాత్ర కొనసాగింది. గ్రామాల్లోని మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. యువకులు, ప్రజలు పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దారి పొడవునా రైతులు, ప్రజలను కలుస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకుసాగారు. అంతకుముందు బస శిబిరం వద్ద జిల్లాలోని పార్టీ మండల, ఆపైస్థాయి నాయకులకు పార్టీ బలోపేతంపై దిశా నిర్దేశం చేశారు. లింబా(బి) గ్రామంలోని మండల పరిషత్‌ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాలలో సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులను ఉద్దేశించి.. మీరేమవుదామని అనుకుంటున్నారని అడగగా.. కలెక్టర్‌, డాక్టర్‌ను అవుతానని చెప్పడంతో సంతోషించారు. ఉపాధ్యాయుల కొరతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సీపీఎస్‌ రద్దు చేయాలని ఆ పాఠశాల ఉపాధ్యాయులు వినతిపత్రం అందజేశారు. అనంతరం లింబా(బి) గ్రామంలో శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఓల గ్రామ సమీపంలో రైతులు తీసుకొచ్చిన ఎడ్లబండి ఎక్కి కాసేపు నడిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు 27 ప్యాకేజీ కింద నిర్మిస్తున్న సాగునీటి కాలువను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు.

లింబా - ఓల గ్రామాల మధ్య పాదయాత్ర

సారూ.. మా కష్టాలు తీర్చండి..

కుంటాల మండలం ఓల గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన పలువురు తాము పడుతున్న కష్టాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అంతకుముందు శివాజీ చిత్రపటానికి పూలమాల కాషాయజెండాను ఎగురవేశారు. అక్కడున్న అన్నబాహు సాటే, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాకు ఫసల్‌ బీమా యోజన రావడం లేదు. రెండు పడక గదుల ఇళ్లు, 24 గంటలు కరెంటు ఇవ్వడం లేదు. మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదు. రోడ్లు సరిగా లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. పోడు భూమి సమస్య ఉంది. అటవీ అధికారులు మా భూములను స్వాధీనం చేసుకున్నారని, ఆ భూమిని ఇప్పించాలని కోరారు. అంబుగాం నుంచి పాంగర్‌పాడ్‌కు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.. ఆటోలు కూడా రావడం లేదు.. రుణమాఫీ చేయలేదు. దళితబంధు రాలేదు. కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి ఇప్పటి వరకు పరిహారం అందలేదని ఆవేదనతో చెప్పడంతో ఆయన మాట్లాడుతూ సంవత్సరకాలంగా మీకోసమే పాదయాత్ర చేస్తున్నానని, ప్రజల దగ్గరకు వెళ్లాలని, సమస్యలను తెలుసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశిస్తేనే మీ దగ్గరికి వచ్చానన్నారు. ఎక్కడికి వెళ్లినా.. సమస్యలే స్వాగతం పలుకుతున్నాయని, పేదోడు ప్రధాని అయిన తర్వాతే.. ఈ దేశంలో ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. ఓల గ్రామానికి కేంద్రం మంజూరుచేసిన నిధులగురించి వివరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, నాయకులు రామారావుపటేల్‌, మోహన్‌రావుపటేల్‌, సుహాసినిరెడ్డి, అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్‌, డా.మల్లిఖార్జున్‌రెడ్డి, అప్పాల గణేశ్‌, జానుబాయి, బాజీరావు, భోజారెడ్డి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

కుంటాల సభలో మాట్లాడుతున్న బండి సంజయ్‌


నేడు ప్రజా సంగ్రామ యాత్ర ఇలా..

నిర్మల్‌, న్యూస్‌టుడే : ప్రజా సంగ్రామ యాత్ర అయిదవ రోజైన శుక్రవారం ముథోల్‌ నియోజకవర్గంలో ముగించి నిర్మల్‌లో ప్రవేశించనుంది. నర్సాపూర్‌(జి) మండలం బామ్ని, నందన్‌, నర్సాపూర్‌(జి), కుస్లిగేట్‌, నసీరాబాద్‌ల మీదుగా రాంపూర్‌ వరకు కొనసాగుతుంది.

హాజరైన ప్రజలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని