logo

మారరు.. మార్చరు..

బాసర ఆర్జీయూకేటీలో భోజనశాలల నిర్వాహకులను మార్చాలని విద్యార్థులు ఉపవాస దీక్షలు, శాంతియుత నిరసనలు తెలిపినా అధికారులు ససేమిరా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.

Updated : 02 Dec 2022 06:32 IST

ఆర్జీయూకేటీ భోజనశాలల నిర్వాహకులకు అధికారుల అండ  

భద్రతా సిబ్బందిపై వేటు

ముథోల్‌(బాసర), న్యూస్‌టుడే

బాసర ఆర్జీయూకేటీ

బాసర ఆర్జీయూకేటీలో భోజనశాలల నిర్వాహకులను మార్చాలని విద్యార్థులు ఉపవాస దీక్షలు, శాంతియుత నిరసనలు తెలిపినా అధికారులు ససేమిరా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. గతంలో జరిగిన ఘటనలతో భోజనశాలల  నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని టెండర్లు పిలిచి విద్యాసంవత్సరం ప్రారంభం లోపు కొత్తవారికి అప్పగించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన అధికారులు ఇప్పటికీ వారినే కొనసాగిస్తున్నారు. బుధవారం విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం విదితమే. అయితే వీరు ఆసుపత్రికి వెళ్లిన సమాచారం ఇవ్వలేదని భద్రతా సిబ్బందిపై వేటు వేసి చేతులు దులుపుకొన్నారు.

భోజనశాలలో మారని దుస్థితి..

గతంలో నాణ్యత,పరిశుభ్రత లేని భోజనం వడ్డించడంతో విద్యార్థులు ఆందోళన చేశారు. అప్పుడు నాణ్యతలో రాజీపడకుండా, పట్టిక ప్రకారం భోజనం అందిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. హామీఇచ్చి నెలలు గడుస్తున్నా అది అమలు కావడం లేదు. ఇప్పటికే రెండు, మూడుసార్లు భోజనం వికటించి విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. సంఘటనలు జరిగినప్పుడే అధికారులు నిర్వాహకులను మారుస్తామని చెబుతున్నారు. తర్వాత దాని గురించి పట్టించుకోవడం లేదు. భోజనశాల నిర్వాహకులకు రాజకీయ అండ ఉండటంతో వారు పెట్టింది తినాలి, చెప్పింది వినాలన్నట్లుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

సమాచారం అందజేయలేని..

గతంలో కొందరిని విశ్వవిద్యాలయంలోకి తీసుకెళ్లి వారితో మత ప్రచారం చేయించిన అటెండర్‌ను వదిలేసి వారిని లోపలికి పంపించిన భద్రతా సిబ్బందిలో ఒకరిపై వారం రోజుల పాటు వేటు వేశారు. నిన్న జరిగిన ఘటనలో ఆసుపత్రి వద్ద విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది తమకు సమాచారం అందజేయలేదని ఒకరిపై నెలరోజుల పాటు సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆహారం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైతే మాత్రం బాధ్యులపై ఎలాంటి చర్యలు ఉండకపోవడంతో విద్యార్థులు మండిపడుతున్నారు. అధికారులు మాత్రం ఆహారం వికటించి కాదు, జలుబు, కడుపునొప్పితోనే విద్యార్థులు ఆసుపత్రికి వచ్చారని చెబుతున్నారు.  

ఈ విషయమై ‘న్యూస్‌టుడే’ గురువారం చరవాణిలో భద్రతాధికారి, డీఎస్పీ సురేష్‌ను సంప్రదిస్తే తమకు సమాచారం అందించకపోవడంతో నెల రోజుల పాటు ఒక  భద్రతా సిబ్బందిని తొలగించామమన్నారు.

ఈ విషయమై ‘న్యూస్‌టుడే’ ఆర్జీయూకేటీ డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌, ఇన్‌ఛార్జి ఉపకులపతి వెంకటరమణలకు చరవాణిలో సంప్రదించగా వారు స్పందించలేదు. మెసేజ్‌ చేసిన సమాధానం ఇవ్వలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని