logo

581 మంది ఉపాధ్యాయులకు మెమోలు జారీ

సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై అదనపు పాలనాధికారి రిజ్వాన్‌ బాషా షేక్‌ కొరడా ఝుళిపించారు.

Published : 02 Dec 2022 03:05 IST

మోమోలు ఇవ్వాలని అదనపు పాలనాధికారి ఆదేశాలు ఇవి

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై అదనపు పాలనాధికారి రిజ్వాన్‌ బాషా షేక్‌ కొరడా ఝుళిపించారు. నిర్ణీత సమయానికి వెళ్లేలా పర్యవేక్షణకు విద్యాశాఖ ఆధార్‌ సహిత హాజరు నమోదు(అబాస్‌) అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం(30వ తేదీన) రోజున అబాస్‌ యంత్రాలపై వేలిముద్ర పెట్టని ఉపాధ్యాయుల జాబితాను తీశారు. ఇందులో ఏకంగా 581 మంది ఉపాధ్యాయులు వేలిముద్ర వేయని విషయం వెలుగుచూసింది. ఉన్నతాధికారులు కొలువు ఉండే జిల్లా కేంద్రంతో సహా ఉట్నూరు, బోథ్‌, జైనథ్‌, ఇచ్చోడ, బేల, భీంపూర్‌, ఆదిలాబాద్‌గ్రామీణం, సిరికొండ, గాదిగూడ, నార్నూర్‌ మండలాల్లో అత్యధికులు బయోమెట్రిక్‌ పెట్టలేదు. సంబంధీకులందరికీ మోమోలు జారీ చేసి శుక్రవారం లోగా నివేదికలు ఇవ్వాలని స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలను, ఎంఈవోలను ఆదేశించారు. ఇటీవల ‘టీచర్లూ.. ఇదేం తీరు’ శీర్షికన గంట ముందే తిరుగుపయనమైన భీంపూర్‌ మండలం కరంజి-టి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. సమయపాలన పాటించని టీచర్లపై డీఈవో విచారణకు ఆదేశించారు. ఈ వార్త ‘ఈనాడు’లో ప్రచురితమైన బుధవారం నాడు జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయుల హాజరు వివరాలను అదనపు పాలనాధికారి స్వయంగా పరిశీలించారు. అందులో బయోమెట్రిక్‌ వినియోగించని టీచర్లపై ఆరాతీస్తే ఏకంగా 581 మంది తేలడంతో వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సమయపాలన పాటించని వారే సంకేతాల సాకు చూపుతూ బయోమెట్రిక్‌ వాడటం లేదని తెలుస్తోంది. ఆయా మెమోలకు అధికారులకు ఇచ్చే నివేదికలతో అసలు విషయం బయటపడనుంది. ఆ తర్వాత ఏం చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉద్దేశపూర్వకంగా డుమ్మా కొట్టిన టీచర్లలో మాత్రం అపుడే వణుకు మొదలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని