logo

ప్రణాళిక లోపం.. పనులు నిరుపయోగం

పట్టణంలో ప్రజల అవసరాలను తీర్చేందుకు చేపట్టిన పనులు నిరుపయోగంగా మారాయి. నిర్వహణ లేమి, ప్రణాళిక లోపంతో ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు.

Published : 02 Dec 2022 03:05 IST

బల్దియాలో ఇదీ పరిస్థితి

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ అర్బన్‌

ట్టణంలో ప్రజల అవసరాలను తీర్చేందుకు చేపట్టిన పనులు నిరుపయోగంగా మారాయి. నిర్వహణ లేమి, ప్రణాళిక లోపంతో ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. బల్దియా యంత్రాంగం ఖర్చు చేసిన నిధులు వృథా అయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖానాపూర్‌ చెరువులో గుర్రపు డెక్క మళ్లీ నిండిపోవడంతో ఇప్పటిదాకా చేసిన శ్రమ, నిధులు వృథా అయ్యాయి. కొవిడ్‌ కేసులు ఉధృతంగా ఉన్నప్పుడు రోగులు చనిపోతే కట్టెలు పేర్చి మృతదేశాన్ని దహనం చేసేవారు. పాలకవర్గం ఇందుకోసం ప్రత్యేకంగా శవదహన యంత్రాలను కొనుగోలు చేసి ప్రత్యేక శ్మశాన వాటికను ఏర్పాటు చేశాక కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో అది ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా దుర్గానగర్‌, కేఆర్కే కాలనీలో రూ.24 లక్షలతో నిధులతో ఏర్పాటు చేసిన సామూహిక మరుగుదొడ్లు వినియోగంలో లేవు. బయో టాయిలెట్‌ బస్సు పట్టణంలో పలుచోట్ల తిప్పుతున్నా ప్రజలు వాడటం లేదు. బల్దియా యంత్రాంగం చేసిన పనులు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో రెండేళ్లలో దాదాపు రూ.కోటి వరకు ప్రజాధనం వృథా అయ్యిందనే ఆరోపణలున్నాయి.


కరోనా వ్యాప్తి చెందిన కాలంలో ఏడాదిన్నర కిందట మావల శివారులో ప్రత్యేకంగా కొవిడ్‌ శ్మశాన వాటికను నిర్మించారు. రూ.2 లక్షలు ఖర్చుచేసి మృతదేహాలను దహనం చేసేందుకు గ్యాస్‌తో పనిచేసే యంత్రాలను ఏర్పాటు చేశారు. అప్పటికే కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో ఈ శ్మశాన వాటిక అవసరం అంతగా రాలేదు.


దుర్గానగర్‌లో రూ.8 లక్షల పట్టణ ప్రగతి నిధులతో సామూహిక మరుగుదొడ్డిని నిర్మించారు. బోరు, నీళ్ల ట్యాంకులు ఏర్పాటు చేసి నీటి సదుపాయం కల్పించారు. విద్యుత్తు కనెక్షన్‌ సైతం ఇచ్చారు. నిర్వహణ లోపంతో రెండేళ్లుగా వృథాగా ఉండడంతో తలుపులు మాయమయ్యాయి.


స్వచ్ఛ భారత్‌లో భాగంగా మొబైల్‌ బయో టాయిలెట్‌ను ఏర్పాటు చేశారు. రూ.10 లక్షలతో పాత ఆర్టీసీ బస్సును కొనుగోలు చేసి మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్డి, మూత్రశాలలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద, జనసంచారం ఉన్నచోట నిలిపినా ప్రజలు వినియోగించుకోవడం లేదు.


ఖానాపూర్‌ చెరువులో గుర్రపు డెక్క పెరగడంతో తొలగించేందుకు రెండేళ్ల కిందట రూ.35 లక్షల నిధులను కేటాయించారు. జేసీబీతో తొలగించినా పూర్తిస్థాయిలో పోలేదు. ఇపుడు మళ్లీ అది చెరువంతా వ్యాపించింది. గతంలో చేపలు పట్టుకుని మత్స్యకారులు ఉపాధి పొందేవారు. ఇపుడు పనికి రాకుండా పోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని