logo

పరుగులో ‘మిణుగురు’లు

విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యం అంటారు. కొందరు చదువులో ముందుంటే మరికొందరు క్రీడల్లో తమ సత్తాచాటడం చూస్తుంటాం.

Published : 02 Dec 2022 03:05 IST

రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

లక్ష్మణచాంద, న్యూస్‌టుడే

విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యం అంటారు. కొందరు చదువులో ముందుంటే మరికొందరు క్రీడల్లో తమ సత్తాచాటడం చూస్తుంటాం. ముఖ్యంగా అథ్లెటిక్స్‌ పోటీల్లో మెరిసి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు విద్యార్థులు. నిర్మల్‌ జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూనే ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో క్రీడల్లో పాల్గొని తమదైన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఇటీవల నిర్మల్‌లో అంతర్‌జిల్లా స్థాయిలో నిర్వహించిన ‘పరుగు’ పందెం పోటీల్లో పాల్గొని రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభను ప్రదర్శించేందుకు సిద్దమయ్యారు. ‘పరుగు పందెం’లో మెరుగ్గా రాణించిన విద్యార్థులపై కథనం.


క్రీడలపై ఆసక్తితో..

సోన్‌ మండలంలోని కడ్తాల్‌ గ్రామానికి చెందిన రైతు చిల్లస్వామి- మానస కుమార్తె సీహెచ్‌. పల్లవి. ఈమె స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. చదువుతో పాటు క్రీడలంటే విద్యార్థినిక ఆసక్తి ఎక్కువ. ఇటీవల అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్మల్‌లో నిర్వహించిన అంతర్‌జిల్లా పరుగు పందెం పోటీల్లో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. నిర్వహించిన 100మీటర్ల పరుగుపందెం పోటీల్లో అంతర్‌జిల్లా స్థాయిలో మొదటిస్థానంలో నిలిచింది. త్వరలో బీహార్‌ రాష్ట్రం పాట్నాలో జరుగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననుంది.


ఆటల్లో చురుకు..

లక్ష్మణచాంద గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు భూమన్న కుమార్తె మెతుకు అభినయ. ఈ విద్యార్థిని ఆదిలాబాద్‌ క్రీడా పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఆటల్లో చురుకుగా ఉన్న ఈమె అథ్లెటిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్మల్‌లో అంతర్‌జిల్లా స్థాయిలో నిర్వహించిన పరుగుపందెం పోటీల్లో  ఉత్తమ ప్రతిభతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. 600మీటర్ల పరుగుపందెంలో ఇతర విద్యార్థులతో పోటీ పడి మొదటిస్థానంలో నిలిచింది. బీహార్‌ రాష్ట్రం పాట్నాలో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననుంది. దీంతో పాటు 8వ తెలంగాణ రాష్ట్ర సబ్‌జూనియర్‌ అథ్లెటిక్స్‌ 100మీటర్ల పరుగుపందెంలో జిల్లాస్థాయిలో సత్తాచాటింది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననుంది.


అలసట అన్నదే లేదు..

సాధారణంగా పరుగెడితే అలసి పోవటం కనిపిస్తుంది. కానీ రాచాపూర్‌ మహాత్మజ్యోతిబాపులే గురుకుల విద్యాలయంలో ఇంటర్‌ చదువుతున్న జీ. అరవింద్‌ మాత్రం తదేకంగా పరుగెడ్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్మల్‌లో అంతర్‌జిల్థాస్థాయిలో నిర్వహించిన 1600 పరుగుపందెం పోటీల్లో తోటి వారందరినీ వెనక్కునెట్టి మొదటిస్థానంలో నిలిచాడు. బీహార్‌ రాష్ట్రం పాట్నాలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.


గురుకుల మెరికలు

రాచాపూర్‌ మహాత్మజ్యోతిబాపులే గురుకుల విద్యాలయంలో 7వ తరగతి చదువుతున్న జె.గోకుల్‌నాయక్‌, ఆర్‌.సాయిచరణ్‌లో పరుగులో తమ సత్తాను చాటారు. అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్మల్‌లో అంతర్‌జిల్థా స్థాయిలో నిర్వహించిన 100మీటర్ల పరుగు పందెం అండర్‌ 14 విభాగంలో గోకుల్‌నాయక్‌ జిల్లాస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. అండర్‌-12 విభాగంలో ఆర్‌.సాయిచరణ్‌ వంద మీటర్ల పరుగుపందెంలో తనదైన ప్రతిభతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని