logo

ఖనిజ సంపద ఖాళీ!

సహజ వనరులకు నిలయమైన కుమురం భీం జిల్లా.. అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది.  ముఖ్యంగా ఖనిజ సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు.

Published : 02 Dec 2022 03:05 IST

అనుమతులు ముగిసినా.. క్వారీల్లో తవ్వకాలు, తరలింపు

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌

ఇంధాని కొండపై క్వారీ

సహజ వనరులకు నిలయమైన కుమురం భీం జిల్లా.. అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది.  ముఖ్యంగా ఖనిజ సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. అనుమతులు ముగిసినా.. రాత్రి సమయంలో, తెల్లవారుజామున గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తూ రూ.కోట్లు వెనుకేసుకుంటున్నారు. నియంత్రించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం జిల్లాలో పరిపాటిగా మారింది. ఈ తరుణంలో అక్రమార్కులు రెచ్చిపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ స్థాయిలో గండి పడుతోంది. గనులకు కేటాయించిన స్థలాల్లో ఎంతమేరకు తవ్వకాలు జరుపుతున్నారో అధికారులకు తెలియకుండా పోతోంది. ఇందు కోసం జీపీఎస్‌ సర్వే చేసి, సరిహద్దులు గుర్తిస్తామని అధికారులు గతంలోనే ప్రకటించినా.. నేటికి కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం.

జిల్లాలో తెల్లసుద్ద, కంకర, క్వారీలతోపాటు క్రషర్లు మొత్తం 20 వరకు ఉన్నాయి. తెల్లసుద్ద క్యూబిక్‌ మీటర్‌ తరలింపునకు రూ.30 చొప్పున, కంకర క్యూబిక్‌ మీటర్‌ తీసుకెళ్లడానికి రూ.40 చొప్పున రాయల్టీని గనులశాఖకు గుత్తేదారులు చెల్లించాలి. అన్ని క్వారీలకు పర్యావరణ అనుమతులతోపాటు, లీజుకు సంబంధించిన గడువు ఉంటుంది. సరకును తరలించడానికి సైతం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అనుమతులు లేక అనధికారికంగా నడుస్తున్న క్వారీలతో ప్రభుత్వ ఖజానాకు భారీ స్థాయిలో నష్టం కలుగుతోంది. గనులశాఖ అధికారులు ఏ క్వారీని తనిఖీ చేయకపోవడంతో జిల్లాలో విలువైన మొరం, కంకర ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది.

మచ్చుకు కొన్ని..

కౌటాల మండలం ముత్యంపేట సర్వే నంబర్‌ 186/1 రెండు హెక్టార్‌లలో కంకర క్వారీ ఉంది. ఈ క్వారీ అనుమతులు 2016లోనే ముగిశాయి. అయినా ఇక్కడ నుంచి కంకరను తరలిస్తున్నారు. ఇటీవలే కేటాయించిన కొత్త క్వారీ సైతం అనుమతులకు మించి తవ్వకాలు విస్తృత స్థాయిలో జరుపుతున్నా.. తనిఖీలు చేసే అధికారులే కరవయ్యారు.

జైనూర్‌ మండలంలో మూడు కంకర క్వారీలు ఉండగా.. ఇద్దరు యజమానులు ఈ క్వారీలను నడపలేమని ప్రభుత్వానికి సరెండర్‌ చేసి, మళ్లీ అనుమతి తీసుకోకుండానే అందులోని రెండు క్వారీల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతూ కంకరను లారీల్లో తరలిస్తున్నారు.

కాగజ్‌నగర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద సైతం తెల్లసుద్ద క్వారీలపై.. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తవ్వకాలు ఇష్టానుసారంగా ప్రధాన రహదారిని ఆనుకునే సాగుతున్నాయి.


పునఃరుద్ధరణ కాకున్నా.. యథేచ్ఛగా

వాంకిడి మండలంలోని ఇంధాని సమీపంలో ఉన్న కొండపై క్వారీ ఇది. అయిదు ఎకరాల్లో ఉన్న ఈ క్వారీకి 2021 ఆగస్టు నెలలో అనుమతులు ముగిశాయి. మళ్లీ రెన్యూవల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇంకా అనుమతులు రాలేదు. కానీ ఇక్కడి నుంచి మాత్రం నిరంతరం రాత్రి వేళల్లోనే కంకరను క్వారీ నుంచి క్రషర్‌కు ఇష్టానుసారంగా తరలిస్తున్నారు.  


జరిమానాలు విధిస్తాం..

నాగరాజు, గనులశాఖ ఏడీ, కుమురంభీం

అనుమతులు లేనిదే క్వారీల్లో తవ్వకాలు జరుపవద్దు. గడువులోపు తవ్వింది ఉంటే తీసుకుపోవచ్చు. అది కూడా పర్మిట్లకు సంబంధించిన రుసుం చెల్లించిన తర్వాతనే తరలించాలి. గడువు ముగిసి మళ్లీ పునఃరుద్ధరణ కాకముందే తవ్వకాలు జరిపితే సంబంధిత క్వారీ యజమానులకు జరిమానాలు విధిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని