logo

‘మాస్టర్‌ ప్లాన్‌’ అమలుకు సన్నాహాలు

రాష్ట్రంలోని 84 నగర, పురపాలికల్లో కొత్త మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించి, ముసాయిదాను ఈ నెలాఖరులోపు ఆమోదించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 02 Dec 2022 03:05 IST

22ఏళ్ల తర్వాత మార్పు

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే

మాస్టర్‌ ప్లాన్‌ మ్యాప్‌

రాష్ట్రంలోని 84 నగర, పురపాలికల్లో కొత్త మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించి, ముసాయిదాను ఈ నెలాఖరులోపు ఆమోదించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కుమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్‌ పురపాలికకు అవకాశం దక్కింది. ఇక్కడ మూడేళ్ల కిందట సర్వే పూర్తి చేసిన మాస్టర్‌ ప్లాన్‌ (బృహత్తర ప్రణాళిక) ఎట్టకేలకు ప్రభుత్వం ఆమోదించి, అమలుకు శ్రీకారం చుట్టనుంది.

జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్‌నగర్‌ పురపాలికలో 1999-2000 సంవత్సరంలో ఏర్పాటు చేసిన మాస్టర్‌ ప్లాన్‌ ఆధారంగా.. రోడ్ల నిర్మాణంతో పాటు, ఇతర కార్యక్రమాలు సాగుతుండగా, దాదాపు 22ఏళ్ల తర్వాత మళ్లీ బల్దియాలో మాస్టర్‌ ప్లాన్‌ అమలు కానుంది. మాస్టర్‌ ప్లాన్‌ అమలు జరిగితే ఇరుకైన ప్రధాన రహదారులతోపాటు, రోజు రోజు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరింత అభివృద్ధి జరగనుంది.

కాగజ్‌నగర్‌ పట్టణం

మూడేళ్ల కిందట రెండు విడతలుగా సర్వే

కాగజ్‌నగర్‌ బల్దియాలో ఉన్న 30 వార్డులతోపాటు, పట్టణంలోని ప్రధాన కూడళ్లు, పట్టణ సరిహద్దు ప్రాంతాలను గుర్తించి, పూర్తి స్థాయిలో రాబోయే 20 ఏళ్లకు అనుకూలంగా ఉండే విధంగా మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దిల్లీకి చెందిన డీడీఎఫ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ దీన్ని రూపొందించే టెండర్‌ దక్కించుకుంది. ఆ సంస్థ ప్రతినిధులు రెండు విడతలుగా పురపాలికను సందర్శించి పూర్తి స్థాయి నివేదికలను తయారు చేశారు. ఆ సర్వే నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. మూడేళ్లు గడిచినప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. ఎన్నో ఏళ్లుగా మాస్టర్‌ ప్లాన్‌ అమలు కాకపోవడంతో పట్టణవాసులు నరకయాతన పడుతున్నారు. పట్టణంలోని రైల్వే పై వంతెన ఏరియా, లారీ చౌరస్తా, అంబేడ్కర్‌ చౌరస్తా, రాజీవ్‌గాంధీ చౌరస్తా, తదితర ఏరియాల్లో రహదారులు ఇరుకుగా మారడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొత్తగా మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు చర్యలు చేపట్టడంతో ఇబ్బందులు తొలగుతాయని ఆశిస్తున్నారు.

సిబ్బంది కొరతే అసలు సమస్య

మాస్టర్‌ ప్లాన్‌ అమలులో పురపాలిక పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులదే కీలక పాత్ర. అయితే బల్దియాలో కొన్నేళ్లుగా పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి పురపాలికలో టీపీఎస్‌గా కొనసాగుతున్న తిరుపతమ్మ ప్రస్తుతం ఇక్కడ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. కాగజ్‌నగర్‌ పురపాలికలో సోమవారం, మంగళవారం, బుధవారం విధులు నిర్వర్తించి, మిగతా మూడు రోజులు చొప్పదండిలో నిర్వహించాల్సి ఉంటుంది. ఆ విభాగంలో టీపీఓ-01, టీపీఎస్‌-01, టీపీబీవో-04, సర్వేయిర్‌-01 పోస్టులుండగా.. ఏ ఒక్క పోస్టు భర్తీ కాలేదు. ప్రస్తుతం ఒక టీపీఎస్‌ డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు. దీంతో పట్టణంలో ఆక్రమణలు, భవనాల అనుమతులు తదితర పనులు తీవ్ర జాప్యంతోపాటు, మాస్టర్‌ ప్లాన్‌ అమలుపై పర్యవేక్షణ మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది.  


ఉత్తర్వులు అందాయి..

అంజయ్య, కమిషనర్‌

పట్టణ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రూపొందించేందుకు దిల్లీకి చెందిన సంస్థ ప్రతినిధులు మాస్టర్‌ప్లాన్‌ సర్వే చేశారు.  వారికి పట్టణ సమగ్ర వివరాలు అందజేశాం. ప్రభుత్వం నుంచి ఇటీవలే అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ ప్రణాళిక విభాగంలోని ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయాం. ఆ పోస్టులు భర్తీ అయితే సత్వరమే మాస్టర్‌ ప్లాన్‌ అమలు జరిగే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని