logo

అధికారుల పాపం.. పేదలకు శాపం

పౌర సరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యం,నిర్లిప్తతలకు పేదలు మూల్యం చెల్లించుకోవాల్సివస్తోంది. ఈ నెలలో ప్రజా పంపిణీ చేయాల్సిన బియ్యం ఆలస్యమయ్యే ప్రమాదం నెలకొంది.

Published : 02 Dec 2022 03:05 IST

రేషన్‌ దుకాణాలకు పంపిణీ కాని బియ్యం

శ్రీరాంపూర్‌, న్యూస్‌టుడే

పౌర సరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యం,నిర్లిప్తతలకు పేదలు మూల్యం చెల్లించుకోవాల్సివస్తోంది. ఈ నెలలో ప్రజా పంపిణీ చేయాల్సిన బియ్యం ఆలస్యమయ్యే ప్రమాదం నెలకొంది. ఈ నెల 1 నుంచి జిల్లాలోని 423 రేషన్‌ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 80 దుకాణాలకు మాత్రమే సరకు రవాణా జరిగింది. మిగతా వాటికి బియ్యం చేరకపోవడంతో పౌర సరఫరాల దుకాణాల్లో పంపిణీ ఆలస్యం కానుంది. పౌరసరఫరాల శాఖలో నెలకొన్న దుస్థితిపై స్వయంగా జిల్లా పాలనాధికారి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మంగళవారం జిల్లా పాలనాధికారి భారతి హోళ్లికేరి స్వయంగా రైస్‌ మిల్లర్లు, అధికారులతో సమావేశం నిర్వహించి గోదాములకు బియ్యం రవాణా చేయాలని సూచించారంటే పౌర సరఫరాల శాఖ ఎంత నిద్ర మత్తులో ఉందో అర్థమవుతోంది.

గతేడాది బియ్యమే ఎఫ్‌సీఐలకు చేరని దైన్యం

రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొంత మంది రైస్‌ మిల్లర్లు గతేడాది అమ్ముకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఎఫ్‌సీఐలకు చేరాల్సిన సీఎంఆర్‌ బియ్యం దాదాపు 30 నుంచి 35 వేల క్వింటాళ్లు మిల్లర్లు రవాణా చేయలేదని సమాచారం. పౌర సరఫరాల శాఖ ఉదాసీనత వల్ల మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది సేకరించిన ధాన్యంతో గతేడాది తాలూకు బియ్యాన్ని సర్దుబాటు చేసుకోవాలనే ఉద్దేశంతో రైస్‌ మిల్లర్లు ఉన్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని బహిర్గతం చేయకుండా ఎఫ్‌సీఐలకు తాము ధాన్యం రవాణా చేయమని, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (ఎస్‌డబ్ల్యూసీ)కు పంపిణీ చేస్తామంటూ మిల్లర్లు వాదిస్తున్నారు. ఎఫ్‌సీఐ బియ్యం నాణ్యత విషయంలో రాజీపడబోదనే ఉద్దేశంతో రైస్‌ మిల్లర్లు ఎస్‌డబ్ల్యూసీకి పంపిస్తామని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతేడాది వానాకాలం సీజన్‌లో సేకరించిన 30 వేల క్వింటాళ్ల బియ్యం ఇప్పటి వరకు తూకం వేయకపోవడంతో వాటిని ఎఫీసీలకు చేర్చలేదు. ఆ బియ్యం అక్రమ మార్గంలో పక్కదారి పట్టడంతో ప్రస్తుతం మిల్లర్ల వద్ద సరిపడినంత ధాన్యం లేదని సమాచారం. జిల్లా పరిధిలో మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరు, బెల్లంపల్లి, తాండూరు, కోటపల్లిలలో మండల స్థాయి గిడ్డంగులు (ఎంఎల్‌ఎస్‌) ఉన్నాయి. ఈ ఆరు కేంద్రాల్లో బియ్యం నిల్వలు నిండుకోవడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.


నిద్రావస్థలో అధికారులు

మండల స్థాయి గిడ్డంగుల్లో నిల్వ ఉన్న బియ్యం గురించి అధికారులకు ఏమాత్రం పట్టింపు లేదనే విమర్శలున్నాయి. గిడ్డంగులకు ఎంత బియ్యం నిల్వలు చేరాయి, పంపిణీ ఎంత జరిగింది.. అనే విషయాన్ని అధికారులు తనిఖీ చేసి నిర్ధారించాల్సి ఉంటుంది. రెండేళ్ల నుంచి అధికారులు ఏ విధమైన తనిఖీలు జరగలేదని తెలిసింది. మాయమైన 550 క్వింటాళ్ల బియ్యం అక్రమాలను తేల్చడానికి ఇప్పటి వరకు విచారణాధికారిని ప్రకటించకపోవడం అధికారుల ఉదాసీనతకు నిదర్శనంగా చెప్పొచ్చు. పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ను పాలనాధికారి సరెండర్‌ చేసిన తర్వాత, ఆయన స్థానంలో డీఎస్‌ఓకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇన్‌ఛార్జి బాధ్యతల్లో ఉన్న డీఎస్‌ఓ పూర్తిస్థాయిలో పనిచేయలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాలలోని నిల్వ కేంద్రంలో పర్సన్‌ ఇన్‌ఛార్జిని సస్పెండ్‌ చేసిన తర్వాత, ఆయన స్థానంలో పొరుగు సేవల ఉద్యోగితో నెట్టుకొస్తున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ఉద్యోగిని నియమించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమనే విమర్శలు వస్తున్నాయి.


మాయమైన బియ్యంపై కొనసాగని విచారణ

మంచిర్యాల ఎంఎల్‌ఎస్‌ కేంద్రంలో పది నెలల కింద 550 క్వింటాళ్ల బియ్యం నిల్వలు తక్కువగా వచ్చాయని విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులు రెండు మూడు నెలల తర్వాత ఆ కేంద్రం ఇన్ఛార్జిని సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకొన్నారు. అంతకు ముందు మంచిర్యాల ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో ఇన్ఛార్జిగా పనిచేసిన వ్యక్తి హయాంలో 200 క్వింటాళ్ల బియ్యం తక్కువున్నాయని గుర్తించగా, గుట్టుచప్పుడు కాకుండా ఒక రైస్‌ మిల్లు నుంచి తగ్గిన బియ్యాన్ని రాత్రికి రాత్రి సర్దుబాటు చేసినట్లు ఆరోపణలున్నాయి. తగ్గినట్లుగా గుర్తించిన 200 క్వింటాళ్ల బియ్యాన్ని కొనుగోలు చేసినట్లుగా బిల్లులను సైతం జిల్లా అధికారులకు సమర్పించిన అంశంపై విమర్శలు వెల్లువెత్తాయి. రేషన్‌ డీలర్ల వద్ద క్వింటాలు, రెండు క్వింటాళ్లు తగ్గితే 6ఏ కేసులు నమోదు చేసే అధికారులు, గిడ్డంగుల నిర్వాహకుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడ]ం వెనుక ఆంతర్యం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. పది నెలలుగా మాయమైన 550 క్వింటాళ్ల బియ్యం గురించి అధికారులు ఇప్పటి వరకు విచారణ చేపట్టకపోవడం వెనుక అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని