logo

ఎస్టీపీపీ వెలుగు జిలుగులు

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యుత్తు కేంద్రాల్లో జైపూర్‌లోని సింగరేణి విద్యుత్తు కేంద్రం ప్రత్యేకత చాటుకుంటోంది.

Updated : 02 Dec 2022 06:29 IST

పీఎల్‌ఎఫ్‌లో దేశంలో అగ్రస్థానం

శ్రీరాంపూర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే

జైపూర్‌లోని సింగరేణి విద్యుత్తు కేంద్రం

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యుత్తు కేంద్రాల్లో జైపూర్‌లోని సింగరేణి విద్యుత్తు కేంద్రం ప్రత్యేకత చాటుకుంటోంది. 2022-23 వార్షిక సంవత్సరంలో నవంబర్‌ నెలాఖరుకు నాటికి 90.86 ప్లాంట్ లోడ్‌ ఫ్యాక్టర్‌(పీఎల్‌ఎఫ్‌ కేంద్రం సగటు ఉత్పత్తి సామర్థ్యం)తో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది.

2016 ఆగస్టులో ప్రారంభమైన ఎస్టీపీపీ ఇప్పటికే నాలుగుసార్లు 100 శాతం పీఎల్‌ఎఫ్‌ సాధించి రికార్డు నెలకొల్పింది. ప్లాంటులోని రెండు యూనిట్లలో రెండో యూనిట్ పది సార్లు, మొదటిది ఏడుసార్లు ఈ ఘనత సాధించాయి. ప్లాంట్లు మొత్తంగా 2018 సెప్టెంబర్‌, 2019 ఫిబ్రవరి, 2020 ఫిబ్రవరి, 2022 మార్చిలో వంద శాతం పీఎల్‌ఎఫ్‌ సాధించింది.

సౌర విద్యుత్తులో ముందడుగు

తెలంగాణ రాష్ట్రంలో సోలార్‌ విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న తొలి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. రెండు విడతల్లో 219 మెగావాట్ల కేంద్రాలను విజయవంతంగా ఏర్పాటు చేసింది. మూడో విడతలో 81 మెగావాట్ల ప్లాంట్లను నెలకొల్పుతోంది. ఎస్టీపీపీ ఆవరణలోని నీటి రిజర్వాయర్‌లో మరో 15 మెగావాట్ల ప్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లకు శ్రీకారం చుట్టగా పనులు వేగంగా జరుగుతున్నాయి.


3వేల మెగావాట్ల విద్యుత్తు

ఎన్‌.శ్రీధర్‌, సింగరేణి సీఎండీ

ఎస్టీపీపీ నుంచి 51,547 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేశాం. రాష్ట్ర అభివృద్ధిలో క్రీయాశీల పాత్ర పోషిస్తున్న ఎస్టీపీపీ ఆవరణలో మరో 800 మెగావాట్ల ప్లాంటును నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2026 నాటికి మూడు వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఇక్కడి ఉద్యోగుల కృషితోనే ఎస్టీపీపీ రికార్డు స్థాయిలో పీఎల్‌ఎఫ్‌ సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని