logo

బీమా.. కార్మిక కుటుంబాలకు ధీమా

సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమంలో కార్మిక శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ శాఖ ద్వారానే ప్రభుత్వం పథకాలకు రూపకల్పన చేస్తుంది.

Published : 04 Dec 2022 05:30 IST

సహాయ కార్మిక అధికారి జి.రాజలింగు

ఈటీవీ - ఆదిలాబాద్‌: సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమంలో కార్మిక శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ శాఖ ద్వారానే ప్రభుత్వం పథకాలకు రూపకల్పన చేస్తుంది. నిబంధనలకు అనుగుణంగా వారు తమ పేర్లు నమోదు చేసుకుంటే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలేమిటి? వాటి ప్రయోజనాలేమిటి? అనే అంశాలపై ఆదిలాబాద్‌ సహాయ కార్మిక అధికారి జి.రాజలింగుతో ‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖి.

ఈనాడు : కార్మికులు పథకాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి?

ఏఎల్‌వో : భవన, ఇతర నిర్మాణ కార్మికులు లబ్ధి పొందాలంటే అయిదేళ్ల కోసం రూ.110 చెల్లించి పేరు నమోదు చేసుకుంటే గుర్తింపు కార్డు వస్తుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6.30 లక్షల పరిహారం పొందొచ్చు. సహజ మరణమైతే రూ.1.30 లక్షలు పొందొచ్చు. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లల వివాహాల సమయంలో రూ.30 వేల చొప్పున పెళ్లి కానుక వస్తుంది. ఆ ఇద్దరు ఆడ పిల్లల రెండు కాన్పుల వరకు ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పు ప్రసూతి సాయం లభిస్తుంది. ప్రమాదంలో అంగవైకల్యం సంభవిస్తే రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు పొందే వెసులుబాటు ఉంది. అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో అయిదు రోజులకు పైబడి చేరితే రోజుకు రూ.300 చొప్పున ఆర్థిక సాయం పొందొచ్చు.

ఈ : భవన నిర్మాణ రంగం మినహాయిస్తే ఇతర కార్మికులకు పథకాల మాటేమిటి?

ఏఎల్‌వో : అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేక వెసులుబాటు ఉంది. ముఖ్యంగా జర్నలిస్టులు, రైతులు, రైతుకూలీలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, దుకాణాల్లో పని చేసే కార్మికులు, వీధి వ్యాపారులు, మత్స్యకారులు, ఆటో, లారీ డ్రైవర్లు, హమాలీలు, వ్యవసాయ అనుబంధ రంగాల కార్మికలకు మేలు చేసేలా ప్రత్యేక సౌకర్యం ఉంది. అందుకోసం ఈ-శ్రమ్‌లో ఉచితంగా పేరు నమోదు చేసుకోవాలి. ఒకసారి పేరు నమోదు చేసుకుంటే జీవితకాలం పనికొస్తుంది. అప్పుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షలు, అంగవైకల్యమైతే రూ.1 లక్ష ఆర్థికసాయం పొందవచ్చు.

ఈ : పెళ్లి కూతుళ్లు, ఎక్స్‌గ్రేషియానే కాకుండా కార్మికుడిపై ఆధారపడిన భార్య, కొడుకు ఉంటే వారికేమైనా సాయం అందుతుందా?

ఏఎల్‌వో : భార్య, కొడుకు, బిడ్డలకు నేషనల్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ అకాడమీ(న్యాక్‌) ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తాం. టేలరింగ్‌, తాపీమేస్త్రీ, ప్లంబింగ్‌, ఎలక్ట్రీషియన్‌ కోసం మూడు నెలల పాటు ఉచిత సర్టిఫికెట్‌ కోర్సు అందిస్తాం. శిక్షణలో రోజుకు రూ.300 చొప్పున ఉపకార వేతనం వస్తుంది. మహిళలకైతే ఉచితంగా కుట్టుమిషన్‌ అందజేస్తాం.

ఈ : సామాజిక భద్రతా పథకం ఉద్దేశమేమిటి?

ఏఎల్‌వో : ఇది ప్రధానంగా జర్నలిస్టులు, హోంగార్డులు, ఆటో, లారీ డ్రైవర్లకు మాత్రమే  ఉద్దేశించిన పథకం. వీరి తరఫున ప్రభుత్వమే రుసుం చెల్లిస్తుంది. ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక సాయం పొందే వెసులుబాటు ఉంది. జర్నలిస్టులైతే పౌర సంబంధాల అధికారి, హోంగార్డులైతే ఎస్పీ, ఆటో, లారీ డ్రైవర్లయితే ఎంవీఐల ద్వారా ధ్రువపత్రాలు సమర్పించి పరిహారం పొందడానికి అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని