logo

నిధుల సంకటం.. పనులకు ఆటంకం

తిర్యాణి మండలం మంగీ గ్రామంలో ప్రమాదకరంగా ఉన్న కర్ర విద్యుత్తు స్తంభాలు ఇవి. ఈ లైన్‌ పది బావుల వరకు ఉంది. వీటి ద్వారా మోటార్లు పెట్టి పంటలకు సాగు నీరు అందిస్తున్నారు.

Published : 04 Dec 2022 05:30 IST

గిరి వికాసానికి ఆరునెలలుగా డబ్బులు రాని వైనం
ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌

తిర్యాణి మండలం మంగీ గ్రామంలో ప్రమాదకరంగా ఉన్న కర్ర విద్యుత్తు స్తంభాలు ఇవి. ఈ లైన్‌ పది బావుల వరకు ఉంది. వీటి ద్వారా మోటార్లు పెట్టి పంటలకు సాగు నీరు అందిస్తున్నారు. విద్యుత్తు పనులతో పాటు, మోటార్లు, పైప్‌లైన్‌ పనులను పూర్తి చేయాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. నిధుల కొరతతో జిల్లాలో చాలా వరకు పనులు ఇలా   అసంపూర్తి మిగిలాయి.


జిల్లాలో అపారమైన జల వనరులు ఉన్నాయి. ప్రాజెక్టుల్లో నిండా నీరున్నా.. కాలువల పనులు దశాబ్దాలుగా కొనసాగుతుండటంతో రైతులు వర్షాధార పంటలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఆర్థిక భారమైనా పలువురు బోర్లు, ఆయిల్‌ ఇంజిన్లు, బావుల ద్వారా పంటలకు నీరందిస్తున్నారు. మరోవైపు కర్షకులకు బోర్లు వేసి, విద్యుత్తు సౌకర్యం కల్పించి, పైపులు సైతం ఉచితంగా ఇచ్చే ‘గిరి’ వికాసం పథకానికి కాసుల కటకట నెలకొంది. దీంతో ఆరు నెలల నుంచి జిల్లాలో పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా మారింది.

‘ఇందిర జలప్రభ’ పథకాన్నే గిరి వికాసంగా కొనసాగిస్తున్నారు. జిల్లాలో 40 వేల మంది రైతులు బావుల ద్వారా పంటలు పండిస్తున్నారని అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కొత్త బావుల తవ్వకాలు, ఇంతుకు ముందు ఐటీడీఏ ఆధ్వర్యంలో తవ్విన బావులకు సైతం గిరి వికాసం వర్తింపజేస్తున్నారు. ఇందుకు ఆయా గ్రామాల్లో త్రీఫేజ్‌ విద్యుత్తు సౌకర్యం సైతం కల్పిస్తున్నారు. ఆరు నెలల నుంచి నిధుల విడుదలలో జాప్యం కారణంగా విద్యుత్తు, మోటార్లు, పైపుల పనులేవీ ముందుకు సాగడం లేదు.

అత్యధికంగా ఆయిల్‌ ఇంజిన్లతో సాగు

చెరువులు, నదులు, వాగులు అన్ని మండలాల్లో ఉన్నాయి. అధ్వాన్న కాలువల వల్ల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందని పరిస్థితి. ఈ తరుణంలో రైతులు సూదూర ప్రాంతాల్లో ఉన్న వాగుల నుంచి పైప్‌లైన్లు వేసి ఆయిల్‌ ఇంజిన్ల ద్వారా పంటలకు సాగు నీరందిస్తున్నారు. ఒక్క రోజుకు ఆయిల్‌ ఇంజిన్‌ నడపడానికి రూ.1000 వరకు ఖర్చు చేస్తున్నామని, పంట కాలం పూర్తయ్యే వరకు వ్యయం తడిసిమోపడవుతుందని కర్షకులు వాపోతున్నారు.


పనులు త్వరగా పూర్తిచేయాలి
భీము, గోండుగూడ, తిర్యాణి

మా ప్రాంతంలో అధికంగా బావుల నీటి ద్వారానే సాగు చేస్తాం. గతంలో ఐటీడీఏ అధికారులు బావులను తవ్వించారు. మోటార్లు, విద్యుత్తు సౌకర్యం లేదు. ఇక్కడి ప్రజలందరికీ గిరి వికాసం వర్తింప జేసి, పనులను పూర్తి చేయాలి.


అధికారులకు నివేదించాం..
ఆంజనేయులు, ఉపాధిహామీ ఏపీడీ

పేరుకుపోయిన బకాయిలు చెల్లించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ నెలలో పనులు వేగంగా పూర్తయ్యేలా విద్యుత్తుశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని