logo

తరలింపు తప్పదా?

జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి (ప్రస్తుత జీజీహెచ్‌)లో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తనిధి కేంద్రం భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Published : 04 Dec 2022 05:30 IST

రెడ్‌ క్రాస్‌ రక్తనిధి కేంద్రం కొనసాగింపుపై సందిగ్ధం..

ఆరోగ్యశ్రీ ద్వారా రక్తనిధి కేంద్రంలో చికిత్స పొందుతున్న తలసీమియా, సికిల్‌సెల్‌ వ్యాధిగ్రస్థులు

మంచిర్యాల వైద్యవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి (ప్రస్తుత జీజీహెచ్‌)లో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తనిధి కేంద్రం భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. దాదాపు 14 ఏళ్లుగా వేలమంది లబ్ధి దీనిద్వారా పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, తలసీమియా, సికిల్‌సెల్‌ బాధితులు, రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు, మూత్రపిండాల వ్యాధిగ్రస్థులకు అత్యవసర సమయంలో రక్తాన్ని అందిస్తూ వారి ప్రాణాలకు భరోసా కల్పిస్తోంది. మొన్నటి వరకు తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు (టీవీవీపీ) సహకారంతో సాఫీగా సాగగా ఇటీవల ఆసుపత్రి డీఎంఈ పరిధికి వెళ్లడంతో కేంద్రం నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఆసుపత్రిలో ప్రభుత్వ రక్తనిధి కేంద్రం ఉండాలనే నిబంధన ఉండటంతో రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలోని ఈ సంస్థను మరో ప్రాంతానికి తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఏళ్లుగా ధర్మాసుపత్రి ఆవరణలో రక్తనిధి కేంద్రం కొనసాగుతుండటంతో అద్దె, విద్యుత్తు ఖర్చులు ఆసుపత్రి భరిస్తోంది. బాధితులకు రక్తాన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. ఆసుపత్రి టీవీవీపీ పరిధిలో ఉండటంతో ఏ ఇబ్బంది లేకపోయింది. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఈ కేంద్రంలో ఉచితంగా రక్తంతో పాటు మందులు, ఇతర సౌకర్యాలు పొందుతున్నారు. ముందుగా ఈ ఖర్చులు రక్తనిధి కేంద్రం భరిస్తుండగా ఆ తర్వాత వచ్చే ఆదాయం ఆసుపత్రి ఖాతాలో జమవుతోంది. టీవీవీపీ పర్యవేక్షణలో ఉన్నంత కాలం లావాదేవీలు సక్రమంగానే ఉన్నా ఇటీవల వైద్యకళాశాల మంజూరుతో ఇబ్బందులు మొదలైనట్లు తెలుస్తోంది. కళాశాలకు అనుబంధంగా ఆసుపత్రి జీజీహెచ్‌గా మారడం, సంబంధిత పర్యవేక్షకులు వీటిని రక్తనిధికి చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఆరోగ్యశ్రీ నుంచి రావాల్సిన బకాయిల్లో ఇటీవల రూ.30 లక్షలకు పైగా జమ అయినట్లు కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారు. కానీ వీటిని రక్తనిధి కేంద్రానికి బదిలీ చేసేందుకు పర్యవేక్షకులు జాప్యం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

ఐఆర్‌సీఎస్‌తో ప్రయోజనం..

వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రికి తప్పనిసరిగా ప్రభుత్వ రక్తనిధి కేంద్రం ఉండాలి. ఐఆర్‌సీఎస్‌ కేంద్రాన్ని మరో చోటుకు తరలించాలి. జిల్లా కేంద్రంలో ఈ రెండూ అందుబాటులో ఉంటే బాధితులకు సేవలు మరింత మెరుగ్గా అందుతాయి. తలసీమియా, సికిల్‌సెల్‌ వ్యాధిగ్రస్థులకు రక్తం కొరత రాకుండా ఉంటుంది. ఐఆర్‌సీఎస్‌ కేవలం రక్తనిధి కేంద్రానికి పరిమితం కాకుండా అనాథాశ్రమాల ఏర్పాటుచేసి ఎంతో మందికి ఆపన్నహస్తం అందిస్తోంది. విపత్తు సమయంలో జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  


ప్రభుత్వ రక్తనిధి కేంద్రం వస్తుండటంతోనే
- భాస్కర్‌రెడ్డి, రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా ఛైర్మన్‌

జిల్లాకు వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిలో ప్రభుత్వ రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేసే అవకాశముంది. దీంతో రాష్ట్ర ఛైర్మన్‌ సైతం ఆసుపత్రి నుంచి కేంద్రాన్ని తరలించాలని ఆదేశాలిచ్చారు. ప్రైవేటు భవనంలో ఏర్పాటు చేసి సేవలు మరింత విస్తృతం చేస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా తలసీమియా, సికిల్‌సెల్‌ వ్యాధిగ్రస్థులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని